Shankaravam: రాయలసీమను రాజస్థాన్‌లా మార్చేశారు, ఎండుతున్న గొంతులతో జనం అల్లాడిపోతున్నారని లోకేశ్ విమర్శలు
Lokesh Sankaravam: ఉరవకొండ శంఖారావం సభలో వైసీపీ పాలనపై లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ నేతలు చివరి ఛాన్స్ అనుకుంటూ మొత్తం దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు
Lokesh Sankaravam: మళ్లీ అధికారంలోకి వస్తామో రామో అని వైసీపీ(YCP) నేతలు అందినకాడికి దోచుకుంటున్నారని తెలుగుదేశం(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Lokesh) విమర్శించారు. గత ఆరు నెలల్లో కొండలు, గుట్టలు మాయమయ్యాయని...వేల ఎకరాల భూములు కబ్జా చేశారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రాయలసీమను దోచేశారని లోకేశ్(Lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్, సైన్స్ సిటీ పేరుతో వైకాపా ప్రభుత్వం సుమారు 17 వేల ఎకరాలు సేకరించిందని.. కానీ ఒక్క పరిశ్రమ తీసుకురాలేదని ఆయన ఆరోపించారు.
లోకేశ్ శంఖారావం
లోకేశ్ చేపట్టిన మలివిడత శంఖారావం(Sankaravam) సభ రాయలసీమ జిల్లాల్లో కొనసాగుతోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ(Uravakonda)లో లోకేశ్ శంఖారావం సభలో పాల్గొన్నారు. 53 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే... జగన్ రాయలసీమకు చేసిందేమీ లేదని లోకేశ్ (Lokesh)మండిపడ్డారు. తెలుగుదేశం హయాంలోనే ఉరవకొండలో 3వేల మందికి ఇళ్లపట్టాలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. పయ్యావుల కేశవ్(Payyavula Kesav) మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు తీసుకువస్తే... వైసీపీ(YCP) ప్రభుత్వం కనీసం పదిశాతం పనులు కూడా చేయలేదన్నారు. నకిలీ ఆధార్ కార్డులు, పత్రాలతో భూములు కాజేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న నడిచిన నేల పచ్చగా మారిపోతుందని గ్రాఫిక్స్ జిమ్మిక్కులు చేశారని...ఇప్పుడు రాయలసీమ ఎండిపోతోందని లోకేశ్ అన్నారు. కనీసం తాగడానికి గుక్కెడు నీరు దొరక్క అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉరవకొండ నియోజకవర్గంలో 80 వేల ఎకరాలకు నీరిస్తామని జగన్(Jagan) హామీ ఇచ్చారని...కనీసం 8వేల ఎకరాలకైనా ఇచ్చారా అని లోకేశ్ నిలదీశారు. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తే ప్రతి చెరువును నీటితో నింపుతామన్నారు. మెగా డ్రిప్(Mega Drip)ఇరిగేషన్ పూర్తి చేసి ప్రతి రైతును ఆదుకుంటామని హామీ ఇచ్చారు. రాయలసీమకు పూర్వవైభవం తీసుకొస్తామని...లోకేశ్ హామీ ఇచ్చారు. జగన్ వచ్చిన తర్వాత..సాగునీటి ప్రాజెక్ట్‌ల్లో తట్ట మట్టి ఎత్తలేదని...ఎక్కడ పనులు అక్కడ వదిలేశారని విమర్శించారు. తెలుగుదేశం వచ్చిన తర్వాత, హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి సీమలో సిరులు పండిస్తామని లోకేశ్ అన్నారు. మరోసారి వైసీపీకి అధికారంలో ఇస్తే రాయలసీమ రాజస్థాన్‌గా మారిపోతుందని విమర్శించారు. కాబట్టి తెలుగుదేశం కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఎండుతున్న సీమ భూములు
జగన్ పాలనలో సీమ ప్రజల బతుకులు ఛిద్రమయ్యాయని లోకేశ్ విమర్శించారు. ‘‘గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు. శంఖారావం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తుండగా.. రాయదుర్గం నియోజకవర్గం మాల్యం గ్రామంలో సాగునీరు లేక బీడువారిన పొలాలు, గతుకుల రోడ్లు చూసి చలించిపోయాయని లోకేశ్ తెలిపారు. ప్రజల కష్టాలను గాలికొదిలేసి.. ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌ల పేరుతో ప్రజల రక్తం తాగుతున్న జగన్ రాయలసీమ బిడ్డ కాదు.. ఈ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ విమర్శించారు. ఐదేళ్ల పాలనలో పట్టుమని పదెకరాలకు కూడా సాగునీరు అందించలేని అసమర్థుడిగా జగన్ మిగిలిపోయారన్నారు. గత ప్రభుత్వ హయాంలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా లక్షలాది మంది సీమ రైతుల జీవితాల్లో వెలుగులు నింపామన్నారు. కరవు సీమలో కార్లపంట పండించిన అపర భగీరథుడు చంద్రన్న కావాలో.... గజ దొంగ కావాలో ప్రజలే తేల్చుకోవాలంటూ లోకేశ్ ట్వీట్ చేశారు...