KTR Strategy: సుప్రీంకోర్టులోనూ నిరాశ ఎదురైతే ప్రజల్లోకి స్కాం జరిగిందేనే భావన - కేటీఆర్ రిస్క్ చేస్తున్నారా ?
Formula E Race: కేటీఆర్ న్యాయపోరాటం ఆయనకు రిస్క్‌గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. సుప్రీంకోర్టులో రిలీఫ్ లభించకపోతే స్కాం జరిగిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది.
KTR legal battle will become a risk for him: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కట్టివేసింది. అరెస్టు నుంచి కల్పించిన రక్షణ కూడా ఎత్తి వేసింది. ఉదంయ తీర్పు రాగానే సాయంత్రం అలా కేటీఆర్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన న్యాయపోరాటం ఆయనకు రిస్క్‌గా మారుతుందని.. ధైర్యంగా నిలబడి విచారణ ఎదుర్కొంటే ప్రజల నుంచి సానుభూతి అయినా వస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో ఉంది. ఇప్పుడు సుప్రీంలోనూ ఊరట లభించకపోతే అన్ని న్యాయపరమైన అవకాశాలను కోల్పోవడంతో పాటు కేసులో ఏదో ఉందని అందుకే ఆయనకు రిలీఫ్ దక్కలేదని ప్రజల్లో ప్రచారం జరిగే అవకాశం ఉంది.
తప్పు చేయనప్పుడు విచారణ ఎదుర్కోవాలంటున్న కాంగ్రెస్
ఫార్ములా ఈ రేసు కేసులో ఎలాంటి అవినీతి లేదని కేటీఆర్ గట్టిగా వాదిస్తున్నారు. ఇందులో పస లేదని లొట్టపీసు కేసు అని హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తర్వాత కూడా వ్యాఖ్యానించారు. అందుకే ఆయన న్యాయపోరాటానికి మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు వరకూ వెళ్లడం ఎందుకని తప్పు చేయనప్పుడు ఎందుకు అలా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. నిజాయితీ పరుడు అయితే నిరూపించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది. అయితే రాజ్యాంగపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకునే హక్కు తనకు ఉందని.. అందుకే సుప్రీంకోర్టుకు పోయామని న్యాయపోరాటం చేస్తున్నామని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
సుప్రీంకోర్టులో చుక్కెదులు అయితే ఇబ్బందే !
ఏసీబీ లేదా ఈడీ ఎలాంటి దూకుడు చర్యలు తీసుకున్నా కేటీఆర్ కు రాజకీయంగా ప్లస్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అరెస్టులు చేయడం వల్ల రాజకీయంగా ఆయనకు సానుభూతి వస్తుంది తప్ప దాని వల్ల ఉపయోగం ఏమీ ఉండదని ఇప్పటి వరకూ జరిగిన రాజకీయాలతో ఎవరికైనా అర్థం అవుతుందని కాంగ్రెస్ నేతలూ బహిరంగంగానే చెబుతున్నారు. అదే కక్ష సాధింపులు అనే భావన ప్రజలకు రాకుండా న్యాయపరమైన అన్ని అవకాశాలనూ వినియోగించుకున్న తర్వాత అరెస్టు చేస్తే కేటీఆర్ తప్పు చేసినందునే న్యాయవ్యవస్థ రిలీఫ్ ఇవ్వలేదన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్తుంది. అప్పుడు అరెస్టు చేసినా రియాక్షన్ రాదని అనుకుంటూ ఉండవచ్చు. అందుకే అరెస్టు చేయకుండా కేటీఆర్ కు అన్ని న్యాయపరమైన అవకాశాలను కల్పిస్తున్నారని భావిస్తున్నారు.
సుప్రీంకోర్టులో తేలే వరకూ అరెస్టు చేయకపోవచ్చు !
పిటిషన్ వేయడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు కానీ రాజకీయంగా ఎలాంటి పరిణామాలు వస్తాయన్నదానిపైనే కేటీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఏసీబీ సుప్రీంకోర్టులో కేవియట్ వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏసీబీ అధికారులు గ్రీన్ కో తో పాటు సబ్సిడరీ కంపెనీల్లో సోదాలు ప్రారంభించారు. ఈ కేసులో ఏ టుగా ఉన్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుుమార్, ఏ త్రీగా ఉన్న హెచ్‌ఎండీఏ మాజీ ఉన్నతాధికారి బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. వారు కూడా విచారణకు హాజరు కాలేదు. తమకు సమయం కావాలని కోరారు. దాంతో వారికీ మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని ప్రశ్నించిన తర్వాతనే కేటీఆర్ ను ప్రశ్నించాలని ఈడీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. విచారణలకు అయితే హాజరవుతారు కానీ.. ఏసీబీ కానీ ఈడీ కానీ సుప్రీంకోర్టులో పిటిషన్ తేలే వరకూ చర్యలు తీసుకోకపోవచ్చన్న వాదన వినిపిస్తోంది.