TRS Alliance : పొత్తులకు కేసీఆర్ రెడీ ! కమ్యూనిస్టులతోనేనా ఇతర పార్టీలతోనూ సిద్ధమేనా ?
తెలంగాణలో పొత్తుల రాజకీయాలపై చర్చలకు కేసీఆర్ తెర లేపారు. మునుగోడు సభలో చేసిన వ్యాఖ్యలతో పొత్తులు ఉంటాయన్న సంకేతాలు పంపారు. కమ్యూనిస్టులతోనేనా ఇంకా ఇతర పార్టీలతోనూ ఉంటాయా ?
TRS Alliance : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మునుగోడులో జరిగిన బహిరంగసభలో కీలకమైన ప్రకటన చేశారు. సీపీఐతో పొత్తు పెట్టుకున్నామని త్వరలో సీపీఎం కూడా కలసి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీజేపీపై పోరాడటానికి శక్తులన్నీ కలిసి పోరాడటానికి దేశవ్యాప్తంగా చర్చలు జరుపుతున్నామన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటి వరకూ పొత్తులనే మాటను ఆయన ఎప్పుడూ రానీయలేదు. తొలి సారిగా కమ్యూనిస్టులతో పొత్తు గురించి ప్రస్తావించారు. ఇతర పార్టీలతోనూ కలిసే అంశాన్ని ఖండించలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ వ్యూహంపై చర్చలు ప్రారంభమయ్యాయి.
కమ్యూనిస్టులతో టీఆక్ఎస్ పొత్తు !
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ఏ పార్టీతోనూ కలవాలని అనుకోలేదు. ఎంఐఎం వంటి పార్టీలతో లోపాయికీ ఒప్పందాలకే పరిమితమైంది కానీ.. నేరుగా పొత్తు ప్రస్తావన తీసుకు రాలేదు.అన్ని పార్టీల నేతలనూ తమ పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిజానికి కేసీఆర్ ఆకర్ష్ బాధిత పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీలూ ఉన్నాయి. 2014 తర్వాత ఆ పార్టీ నేతల్ని టీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు. అయితే ఇటీవలి కాలంలో కేసీఆర్ కమ్యూనిస్టు పార్టీలను దగ్గరకు తీసుకుంటున్నారు. ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాలో ఆ పార్టీలకు మెరుగైన ఓటు బ్యాంక్ ఉండటం.. ఆయా జిల్లాల్లో టీఆర్ఎస్ వీక్‌గా ఉండటంతో వారి వల్ల మేలు జరుగుతుందన్న ఉద్దేశంతోనే ఆయన వారితో సన్నిహితంగా ఉంటున్నారు. ఇప్పుడు మునుగోడు ఎన్నికల కారణంగా ముందుగానే వారి పొత్తు విషయంలో క్లారిటీ వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్‌కు సీపీఐ మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ పొత్తు సాగుతుందని కేసీఆర్ చెప్పారు. జాతీయ స్థాయి వరకూ పొత్తు ఉంటుందన్నారు.
పొత్తుల ప్రశ్నే ఉండదన్నట్లుగా ఇటీవలి వరకూ వ్యాఖ్యలు !
తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల ట్విట్టర్‌లో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఆ సమయంలో పొత్తుల గురించి ఓ నెటిజన్ ప్రశ్నించారు. తమకు ప్రజలతో తప్ప ఇతర పార్టీలతో పొత్తులు ఉండవని.. కేటీఆర్ వ్యాఖ్యానించారు. అయితే ఇది జరిగి కొద్ది రోజులు జరగకముందే కేసీఆర్ కమ్యూనిస్టులతో తమ బందాన్ని ప్రకటించారు. ఇప్పుడు కమ్యూనిస్టులతో మాత్రమే సరిపెడతారా.. ఇతర పార్టీలతోనూ కలిసేందుకు సిద్ధమవతారా అన్నది హాట్ టాపిక్‌గా మారుతోంది. ఎందుకంటే తెలంగామలో లెక్కకు మిక్కిలిగా పార్టీలు ఉన్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ మాత్రమే కాదు.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, బీఎస్పీ, కేఏపాల్ ప్రజాశాంతి వంటి పార్టీలు ఉన్నాయి. అందరికి ఒకటో..రెండు శాతమో ఓటు బ్యాంక్ ఉంటుంది. అది కూడా కీలకమయ్యే చాన్స్ ఉంది. అందుకే పొత్తుల గురించి విస్తృత చర్చ జరుగుతోంది.
జాతీయ పార్టీలతో ఎన్నికల తర్వాతే.. ఎన్నికల ముందు ఉండకపోవచ్చు !
తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ సంస్థాగతంగా బలంగా ఉంది. బీజేపీ పుంజుకుంటోంది. ఈ రెండు పార్టీలకూ టీఆర్ఎస్ దూరంగానే ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీని ప్రధాన శత్రువుగా పరిగణిస్తోంది. ఢిల్లీ లెవల్లో కాంగ్రెస్ పార్టీతో అప్పుడప్పుడూ కలిసి బీజేపీని టార్గెట్ చేస్తోంది. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త టీఆర్ఎస్‌కు దగ్గర అనుకోవచ్చు. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ అంటే భగ్గుమంటున్నారు. ఆరు నూరైనా టీఆర్ఎస్‌తో చేతులు కలిపే ప్రశ్నే లేదంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు కూడా తెలంగాణలో ఎన్నికలకు ముందు ఎలాంటి పొత్తులు పెట్టుకోవాలనే ఆలోచన చేయడం లేదు. అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే అనుకుంటున్నారు .
ఎన్నికల తర్వాత హంగ్ వస్తే ఏ పార్టీతో కలవొచ్చు !?
అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వస్తుందో చెప్పలేము. సర్వేలు అంచనా వేస్తున్నట్లుగా హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అప్పుడు టీఆర్ఎస్ .. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా.. బీజేపీతో కలిశా అనేది కీలకం కావొచ్చు. బీజేపీని ఎంత టార్గెట్ చేసినా.. కేంద్రంలో మళ్లీ అ పార్టీనే అధికారంలోకి వస్తుందని కేసీఆర్ నమ్మితే.. బీజేపీ కలసి వస్తే ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. లేకపోతే.. బీజేపీపై ప్రస్తుతం ఉన్న రీతిలోనే యుద్ధం కొనసాగించాలంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. హంగ్ ఏర్పడిన సందర్భంలో .. లోక్ సభ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో .. కాంగ్రెస్ పార్టీకి మరో చాయిస్ ఉండకపోవచ్చు. అందుకే.. తెలంగాణలో పొత్తుల చర్చలు ఇక ముందు జోరుగా సాగనున్నాయి. వాటికి కేసీఆర్ బీజం వేశాడని అనుకోవచ్చు.