AP Kapu Leaders : తెలుగు రాష్ట్రాల కాపు నేతల రహస్య సమావేశాలు - సొంత పార్టీ పెడతారా?
తెలుగు రాష్ట్రాల కాపు నేతలు ఆదివారం రహస్య సమావేశం నిర్వహించారు. వారి సమావేశం ఎజెండాపై మాత్రం స్పష్టత లేదు.
AP Kapu Leaders : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం అంతా సామాజిక సమీకరణాలు చుట్టూ తిరుగుతోంది. ముఖ్యంగా గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తారని భావిస్తున్న కాపు సామాజికవర్గం చుట్టూనే రెండు రాష్ట్రాల రాజకీయం నడుస్తోంది. ఇటీవల కాపు సామాజికవర్గ నేతలు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓ సారి విశాఖలో .. మరో సారి హైదరాబాద్‌లో ఇలాంటి సమవేశాలు నిర్వహించారు. అయితే కొన్నాళ్లుగా అలాంటి సమావేశాలు జరిగినట్లుగా బయటకు రాలేదు. కానీ గత ఆదివారం మరోసారి కాపు నేతలు సమావేశమయ్యారని తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నేతలు కూడా హాజరయ్యారని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి కాపు నేతలు రాజకీయ సంచలనం సృష్టించవచ్చన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
హైదరాబాద్‌లో కాపు నేతల రహస్య భేటీ !
హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హోటల్ లో ఆదివారం కొంతమంది కాపు నేతల సమావేశం అయ్యారు. ఏపీ , తెలంగాణ కు సంబంధించిన నేతలు హాజరయ్యారని.. రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లుగా చెబుతున్నారు. రెండు రాష్ట్రాల్లో కాపు సామాజిక వర్గ పరిస్థితి వచ్చే ఎన్నికలపై చర్చించారని అంటున్నారు. ఈ సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుతో పాటు ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన తోట చంద్రశేఖర్ కూడా ఈ సమావేశానికి హాజరైనట్లుగా చెబుతున్నారు. ఈ సమావేశాన్ని తోసి పుచ్చలేమని... ఇటీవలి కాలంలో కాపు సామాజికవర్గ నేతలు.. ఐక్యత సాధించేందుకు ప్రయత్నిస్తున్నరని కొంత మంది గుర్తు చేస్తున్నారు.
కాపు వర్గం మద్దతు కోసం బీఆర్ఎస్ ప్రయత్నం !
టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత కేసీఆర్. ఏపీలో ఓటు బ్యాంక్ సంపాదించడానికి కాపు సామాజికవర్గాన్ని ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ఆయన తోట చంద్రశేఖర్ ను.. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ గా నియమించారని అంటున్నారు. అంతే కాదు.. బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్న నేతలంతా కాపు సామాజికవర్గానికి చెందినవారే అదే సమయంలో తెలంగాణ చీప్ సెక్రటరీగా శాంతి కుమారిని కూడా సామాజిక కోణంలోనే నియమించారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే.. హైదరాబాద్‌లో జరిగినకాపు నేతల మీటింగ్‌లో బీఆర్ఎస్ అంశం చర్చకు వచ్చే ఉంటుందని భావిస్తున్నారు. ఏ రాజకీయ నిర్ణయాలు అయినా ఈ సమావేశంలో తీసుకున్నారో లేదో స్పష్టత లేదు .
కాపు నేతలంతా ఏకతాటిపైకి రావడం అసాధ్యం !
అయితే కాపు నేతలంతా ఎప్పటికప్పుడు సమావేశమైనా అందరూ ఒకే పార్టీ వైపు రావడం లేదా.. కలిసి సొంత పార్టీ పెట్టడం సాధ్యం కాదన్న వాదన ఉంది. రాజకీయాల్లో ఒక్క సామాజికవర్గం అండతో గెలవడం సాధ్యం కాదు. అన్ని వర్గాల మద్దతు లభించాలి. ఈ విషయం రాజకీయాల్లో ఢక్కా మొక్కీలు తిన్న ఆ నేతలకు తెలియనిది కాదు. అందుకే .. వారందరూ ఎవరి పార్టీల్లోనే వారు ఉండి... ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రయత్నించాలని అనుకుంటారు కానీ.. సొంత పార్టీ ఆలోచనలు చేయరని అంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు మున్నూరు కాపు సామాజికవర్గం మద్దతు కీలకం. వీరి మద్దతు కోసం .. చేసే ప్రయత్నాల్లో ఈ నేతలు సహకారం అందించవచ్చని చెబుతున్నారు. కారణం ఏదైనా.. కాపు నేతల సీక్రెట్ మీటింగ్స్ మాత్రం ... తరచూ చర్చనీయాంశమవుతున్నాయి.