(Source: ECI/ABP News/ABP Majha)
Nizamabad Kavita : నిజామాబాద్ రాజకీయాల్లో కవిత కలకలం - ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
నిజామాబాద్ జిల్లా రాజకీయాలపై కల్వకుంట్ల కవిత పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సీఎం పర్యటనలో మొక్కుబడిగా పాల్గొని వెళ్లిపోయారు.
Nizamabad Kavita : నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించారు. కలెక్టరేట్ ప్రారంభించారు. బహిరంగసభలో ప్రసంగించారు. టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. అయితే ఓ డౌట్ మాత్రం మిగిలిపోయింది. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాల్ని శాసిస్తారన్న పేరున్న కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హడావుడి పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కేవలం బహిరంగసభకు హాజరై.. వెళ్లిపోయారు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడలేదు. ప్రసంగించలేదు. దీంతో టీఆర్ఎస్‌లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
నిజామాబాద్ టీఆర్ఎస్‌కు కల్వకుంట్ల కవిత ఎంత చెబితే అంత !
నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ముందుండి నడిపించే నాయకురాలు ఎమ్మెల్సీ కవిత. జిల్లాలో పార్టీకి అన్నీ తానై వ్యవహరించే కవిత తాజాగా నిజామాబాద్ లో జరిగిన సీఎం కార్యక్రమాల్లో సైలెంట్ గా ఉండిపోయారు. జిల్లాకు సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. కానీ ఈసారి ఆ సిన్ కనిపించలేదు. సీఎం సభ ఏర్పాట్లలో కూడా ఆమె ప్రమేయం లేకుండా పోయింది. నూతనంగా నిర్మించిన జిల్లా టీఆరెస్ కార్యాలయం, కొత్త కలెక్టరేట్ భవనం ప్రారంభోత్సవంలో కూడా కవిత కనిపోయించలేదు. నేరుగా బహిరంగ సభ స్థలికి చేరుకున్నారు. సీఎం సభ ముగియగానే వెళ్లిపోయారు. కనీసం పార్టీ ఎమ్మెల్యేలతో కూడా కవిత పెద్దగా మాట్లాడలేదు.
పర్యటన ఏర్పాట్లను కూడా ఎందుకు పట్టించుకోలేదు ?
జిల్లాలో ఎప్పుడూ సీఎం సభలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత అన్నీ తానై వ్యవహరించేవారు. సభ ప్రాంగణం మొదలుకుని జన సమీకరణ ఇలా ప్రతి అంశంలో కవిత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేవారు. సీఎం కేసీఆర్ సభ అంటే ముందుగానే జిల్లాలోనే ఉండే కవిత సీఎం కేసీఆర్ సభకు చేరుకునే అరగంట ముందు సభ స్థలికి చేరుకోవటంపై జిల్లా టీఆరెస్ శ్రేణులు ఆలోచనలో పడ్డారు. జిల్లాలో టీఆరెస్ శ్రేణులకు పెద్ద దిక్కుగా ఉన్న కవిత కొంత కాలంగా జిల్లాకు దూరంగా ఉండటం సీఎం కేసీఆర్ సభ ఉండటం కనీసం సభ ఏర్పాట్లను చూసేందుకైనా రాలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజామాబాద్ నుంచి పోటీ చేసే ఆలోచనలో లేరా ?
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కవిత ప్రత్యక్ష రాజకీయాలు కొంత కాలం దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు. ఇటీవలి కాలంలో మళ్లీ నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో తరచూ పర్యటిస్తున్నారు. అయితే హఠాత్తుగా అవి కూడా నిలిపివేశారు. పూర్తి స్థాయిలో మౌనం వహిస్తున్నారు. నిజామాబాద్ నేతలు కూడా ఆమె మౌనానికి కారణం ఏమిటన్నదానిపై గుంభనంగా వ్యవహరిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలే కారణమా ?
ఇటీవల కాలంలో కవిత నిజామాబాద్ జిల్లా పై ఫోకస్ పెట్టడం తగ్గించారని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితపై ఆరోపణలు రావడంతో ఆమె కొంత సైలెంట్ అయ్యారన్న చర్చ జరుగుతోంది. సీఎం సభలో ప్రసంగించిన ఎమ్మెల్యేలు సైతం కవిత పేరు ఎత్తకపోవటం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసినట్లయింది. కారణం ఏదైనా కవిత ఇప్పుడు రాజకీయంగా క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని టీఆర్ఎస్ వర్గాలంటున్నాయి.