Rapaka Varaprasad: జనసేన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ - పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారా?, అసలు నిజం ఏంటంటే?
Janasena: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి పార్టీ వీడిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మళ్లీ జనసేనలోకి రానున్నట్లు తెలుస్తోంది.
Ex MLA Rapaka Attended Janasena Meeting: జనసేన మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad) కూటమి వైపు చూస్తున్నారు. వీలైతే జనసేన లేకుంటే కనీసం టీడీపీ (TDP) తీర్థం పుచ్చుకోవడానికి రూట్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి త్వరలో రాజీనామా చేస్తానని ఈ విషయాన్ని పార్టీ హైకమండ్‌కు తెలియజేసినట్టు ఆయన తన సన్నిహితులతో అన్నారు. అంతేకాదు ఆదివారం ఏకంగా మలికిపురంలో జరిగిన జనసేన సమావేశానికి ఆయన హాజరు కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుత రాజోలు ఎమ్మెల్యే దేవా వరప్రసాద్‌ను కలిసిన రాపాక కొన్ని కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం.
ఒకే ఒక్కడు..
2019 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యేగా రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలిచారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఆ సారి పోటీ చేసిన గాజువాక, భీమవరం రెండు చోట్ల ఓడిపోగా రాపాక మాత్రం రాజోలు ఎమ్మెల్యేగా సమీప వైసీపీ అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుపై 814 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే గెలిచిన తర్వాత ఆయన అప్పటి అధికార వైసీపీతో సన్నిహితంగా మెలిగారు. జనసేనలో తనకు తగిన గౌరవం లభించడం లేదని, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అపాయింట్మెంట్స్ సరిగ్గా ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు. అలాగే తన గెలుపునకు స్థానికంగా తను చేసిన ఎలక్షనీరింగ్ కారణం అంటూ చెప్పేవారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అమలాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న రాపాక ప్రస్తుతం మళ్లీ కూటమి వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే జనసేన మీటింగ్‌కు కూడా రాపాక హాజరయ్యారు.
పవన్ ఒప్పుకుంటారా?
ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక స్థానంలో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ మరో వైపు పార్టీని విస్తరించడంపైనా దృష్టి పెట్టారు. గత ప్రభుత్వంలో వైసీపీ నుంచి తనపై విమర్శలు, ఆరోపణలు గుప్పించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య లాంటి వాళ్లకు కూడా జనసేన నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇదే కోవలో తనను తిరిగి పార్టీలోకి చేర్చుకుంటారని రాపాక వరప్రసాద్ ఆశిస్తున్నారనేది ఆయన సన్నిహితుల కథనం. దాని తగ్గట్టుగానే ఆయన పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన విడివిడిగా ఎలక్షన్స్‌కు వెళ్తాయని ఆ సమయానికి బలాన్ని పెంచుకునేలాగా జనసేన విస్తరణ కార్యక్రమం చేపడుతుందనేది రాజకీయ వర్గాల కథనం.
అందులో భాగంగానే జనసేనలోకి రీ ఎంట్రీ కోసం రాపాక ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ అది కుదరకపోతే కనీసం టీడీపీలోకన్నా ఎంట్రీ కోసం రాపాక ఆలోచిస్తున్నారని రాజోలు నియోజకవర్గంలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా జగన్ తనకు సీటు ఇస్తారని భావించిన రాపాక వరప్రసాద్ తనకు అమలాపురం ఎంపీ సీటు కేటాయించడంపైనా అసహనంగానే ఉన్నారు. దానితో 2024 ఎన్నికల ఫలితాలు తర్వాత వైసీపీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. అయితే జనసేన ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి వత్తాసు పలికిన రాపాకను తిరిగి జనసేన కార్యకర్తలు అక్కున చేర్చుకుంటారా.?, అసలు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మాజీ ఎమ్మెల్యే రాపాక రీ ఎంట్రీకు అనుమతి ఇస్తారా అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చగా మారింది.
'అదే కారణం..!'
అయితే రాపాక తనను కలిసిన విషయపై రాజోలు జనసేన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మరోలా స్పందించారు. మలికిపురం కాలేజీలో పని చేస్తూ తమకు జీతాలు రావడం లేదంటూ ధర్నా చేస్తున్న 25 మంది అధ్యాపకుల కోసం మాత్రమే రాపాక తనను కలిశారని దీనిలో రాజకీయ కోణం లేదని తెలిపారు. కానీ స్థానికంగా మాత్రం రాపాక జనసేన వైపు తిరిగి రావడం కోసమే పావులు కదుపుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.