పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు- బీజేపీతో ఉన్నాం ఉంటామని కామెంట్
కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు పవన్ కల్యాణ్.
ఎన్నికల నోటిఫికేషన్ పడినాటికి పొత్తులపై క్లారిటీ వస్తుందన్నారు జనసేన అధినతే పవన్ కల్యాణ్. పార్టీ ప్రచార రథం వారాహి వెహికల్‌కు ప్రత్యేక పూజలు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆయన... కొన్ని అంశాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటందన్నారు. టీడీపీతో కలవబోమని బీజేపీ అంటోందన్న ప్రచారంపై కూడా ఇలానే స్పందించారు పవన్.
తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర ఏంటనేది కాలమే చెప్పాలన్నారు పవన్ కల్యాణ్. తమ పరిమితి ప్రజలు నిర్ణయించాలన్నారు. తమ శక్తి మేరకు తెలంగాణలో గొంతును వినిపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు.
బీఆర్‌ఎస్ ఏర్పాటును స్వాగతించిన పవన్ కల్యాణ్... మార్పు ఆహ్వానించదగిందే అన్నారు. తమ పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడాన్ని కూడా పవన్ లైట్ తీసుకున్నారు. కొందరు నాయకులు మార్పు కోరుకుంటారని అలాంటి వాళ్లు పార్టీ మారడం సహజమని కామెంట్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరమైన నిర్ణయాలు కఠినంగా తీసుకుంటే తప్ప దావోస్‌లాంటి పర్యటనలు ప్రయోజనాలు ఇవ్వబోమన్నారు పవన్. గతంలో ఏపీ ప్రభుత్వ నేతలు వెళ్లిన తర్వాత.. ఆ ఊపును కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.
ఈ ఉదయం హైదరాబాద్‌లో బయల్దేరిన పవన్ కల్యాణ్... సిద్దిపేట, కరీంనగర్ మీదుగా కొండగట్టు చేరుకున్నారు. దారి పొడవును అభిమానులు ఆయనకు స్వాగతం పలికారు. హైదరాబాద్ దాటే క్రమంలో కాసేపు ఆయన ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. హైదరాబాద్ దాటివెళ్లిన తర్వాత రోడ్డుకు ఇరువైపుల పవన్ కల్యాణ్‌ను చూసేందుకు జనం భారీగాతరలి వచ్చారు. అక్కడక్కడ కారులో నుంచి పైకి వచ్చిన పవన్... అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
సుమారు 11 గంటలకు కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి చేరుకున్న జనసేన అధినేత.. అక్కడ వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అధికారులు, వేదపడింతులు ఘన స్వాగతం పలికారు. ముందుగా అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్... అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ప్రచార రథం వారాహికి పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు జరిపారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.
వారాహికి పూజలు చేస్తున్న క్రమంలోనే వేదపండితులతోపాటు ఆయన కూడా మంత్రోచ్చరణ చేశారు. పూజలు సందర్భంగా పవన్ కల్యాణ్.. కాషాయ ఉత్తరీయం ధరించారు. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు దగ్గరుండి చేయించి, వాహనం ఎదుట సంకల్పసిద్ధి చేయించారు వేద పండితులు. ప్రత్యేకంగా స్వామివారి యంత్రాన్ని వారాహికి కట్టి, సింధూరంతో శ్రీరామదూత్ అని రాశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పండితులు విఘ్నాలు తొలగిపోయేలా, విజయాలు సిద్ధించేలా గుమ్మడికాయ కొట్టారు. అనంతరం వారాహిని ప్రారంభించారు.
పూజలు పూర్తైన తర్వాత పవన్ కల్యాణ్ వేదపడింతుల ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి బయల్దేరారు. ప్రారంభసూచకంగా వారాహి ఎక్కి వాహనాన్ని పరిశీలించారు. అనంతరం తన వాహనంలోనే నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టుకు చేరుకున్నారు. కాసేపట్లో అక్కడ జనసేన తెలంగాణ నాయకులతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అక్కడే లంచ్ కూడా పవన్ చేయనున్నారు. తెలంగాణ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు... ప్రజలకు అండగా ఉండాల్సిన అంశాలపై కార్యకర్తలకు, పార్టీ లీడర్లకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.