YSRCP News : వైసీపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సీఎం జగన్ పునరాలోచన ? - పార్టీ కోసం కష్టపడిన వారికే ప్రాధాన్యం ఇస్తారా ?
వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలకు టిక్కెట్లపై ఆ పార్టీ పునరాలోచన చేస్తోందా ? వారి వ్యతిరేకత పార్టీకి మైనస్ చేస్తోందని అనుకుంటున్నారా?
YSRCP News : తెలుగుదేశం పార్టీ నుంచి ఫిరాయించి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల విషయంలో వైఎస్ఆర్‌సీపీలో అంతర్మథనం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. వారు రావడం వల్ల పార్టీ చాలా సమస్యలను ఎదుర్కొంటోందని ఓ నిర్ణయానికి వచ్చారు. గన్నవరం, చీరాల, విశాఖ దక్షిణ, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లో ఇలా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరి నియోజకవర్గాల్లో పార్టీ కోసం కష్టపడిన వారిని అసంతృప్తికి గురి చేసి.. టీడీపీ కోసం కష్టపడిన వారికి ప్రాధాన్యం ఎందుకు ఇవ్వాల్సి వస్తోందన్న ఓ అభిప్రాయం హైకమాండ్‌లో వచ్చిందని చెబుతున్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నియోజకవర్గాల్లో గడ్డు పరిస్థితి
టీడీపీ తరపున గెలిచి ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్ కు చాలా కాలంగా గడ్డు పరిస్థితే ఉంది. వారు వచ్చినప్పటి నుండి తమ అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చారు కానీ.. వైసీపీ నేతల్ని పట్టించుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ వారికే టిక్కెట్లు ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అక్కడ ఉన్న వైసీపీ నేతలు వేరే దారి చూసుకుంటున్నారు. దీంతో వైసీపీ పెద్దల్లో అంతర్మథనం ప్రారంభమవుతోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తున్నామా అన్న ఆలోచనతో మనసు మార్చుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
టీడీపీ నేతల వ్యతిరేకతను తమకు అంటించుకున్నామా అన్న మథనం !
గన్నవరం నుంచి వల్లభనేని వంశీ టీడీపీ నుంచి చాలా తక్కువ ఓట్లతో రెండో సారి గెలిచారు. రాజకీయాలకు కొత్త అయినా యార్లగడ్డ వెంకట్రావు కష్టపడ్డారు. చాలా స్వల్ప తేడాతో ఓడిపోయారు. వల్లభనేని వంశీ ఆయన వ్యవహరంపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. ఆయన టీడీపీలోనే ఉండి ఉంటే ఆయనకే టిక్కెట్ ఖరారు చేసే వారు. ఈ సారి అక్కడ వైసీపీ విజయం కేక్ వాక్ అయ్యేదన్న వాదన ఉంది. . కానీ వంశీని చేర్చుకోవడంతో ఆయనపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వచ్చి పడటమే కాదు... పార్టీ కోసం కష్టపడిన నేతల్ని వదులుకోవాల్సి వస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఉపఎన్నికల్లో గన్నవరం పరిధిలోని నున్న గ్రామంలో ఓ వార్డు స్థానానికి ఎన్నిక జరిగింది. అక్కడ వంశీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా.. వైసీపీకే మెజార్టీ వస్తుంది. అక్కడ వంశీ తన అభ్యర్థిని నిలబెట్టారు. చాలా ఖర్చు చేశారు. కానీ అక్కడ టీడీపీ అభ్యర్థే విజయం సాధించారు. ఇది వైసీపీ పెద్దలను మైండ్ బ్లాంక్ చేసిందని చెబుతున్నారు.
వంశీపై వ్యతిరేకత కారణంగానే నున్న వార్డులో ఓటమి !
అక్కడ ఉన్న పరస్థితుల్ని ఆరా తీస్తే.. పూర్తిగా వంశీపై వ్యతిరేకత వల్లనే ఆ ఫలితం వచ్చిందని నిర్ధారించుకున్నారని అంటున్నారు. ఈ పరిణామంతో పాటు యార్లగడ్డ వెంకట్రావును కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయక... మొత్తంగా రెచ్చగొట్టి బయటకు పంపేశారన్న ఆగ్రహం హైకమాండ్ లో కనిపిస్తోంది. యార్లగడ్డ టిక్కెట్ ఇవ్వకపోయినా పార్టీలోనే ఉండేవారని.. కానీ ఉండలేని పరిస్థితుల్ని సృష్టించారని గన్నవరంలో పాత వైసీపీ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాలన్నింటిపై .. వైసీపీ హైకమాండ్ సీరియస్ గా ఉందని చెబుతున్నారు. ఈ క్రమంలో గన్నవరం టిక్కెట్ పైనా ఇచ్చిన హామీ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంటోది.
గుంటూరు పశ్చిమ, చీరాల, విశాఖ దక్షిణలోనూ పునరాలోచన
చీరాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది . అక్కడ ఇండిపెండెంట్ గా కూడా గెలిచిన ఆమంచికి అన్యాయం చేసి ... టీడీపీ నుంచి వచ్చిన కరణంకో చోటివ్వడం మంచిదేనా అని చర్చలు ప్రారంభించారు. ఆమంచిని పర్చూరు నియోజకవర్గానికి పంపినప్పటికీ ఆయన సంతృప్తిగా లేరు. అలాగే.. విాఖ దక్షిణంలో వాసుపల్లి పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని స్పష్టమయింది. గతంలోనే ఆయన ఓ సారి వైసీపీకి దూరమయ్యారు. తర్వాత సీఎం జగన్ బుజ్జగించారు. తర్వాత ఆయననే ఇంచార్జ్ గా ప్రకటించినా వైసీపీ క్యాడర్ మాత్రం ఆయనకు దూరంగానే ఉంటోంది. ఇక గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే కన్నా వైసీపీ నేతలే ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు. అప్పిరెడ్డితో పాటు మరో ఇద్దరు , ముగ్గురు టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. మద్దాలగిరికి మళ్లీ టిక్కెట్ ఇవ్వడం తప్పిదమవుతుందని ఆ పార్టీలో గుసగుసలున్నాయి.
అంతే ఇప్పుడు వైసీపీలో ..టీడీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చివరికి ఏదో ఓ నిర్ణయం తీసుకుంటారన్న చర్చ జరుగుతోంది.