Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా దీపాదాస్ మున్షి - సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారన్న ఆరోపణలు
Deepadas Munshi : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షిపై రాను రాను విమర్శలు పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోనే ఉంటూ ఆమె పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
Telangana Governaent : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఓ వైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్రంలోనే మకాం వేసినా ఆ పార్టీ వ్యవహారాలు రోడ్డున పడుతున్నాయి. ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీపై తిరుగుబాటు చేసినంత పని చేస్తున్నారు. వారితో మాట్లాడేందుకు కూడా ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. పార్టీలో చేరిన వారూ అసంతృప్తిలో ఉన్నారు. మరో వైపు పార్టీ వ్యవహారాలను చక్క బెట్టాల్సిన పార్టీ ఇంచార్జ్ పరిపాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీలోనే ఇంచార్జ్ తీరుపై అసంతృప్తి పెరుగుతోంది.
ఇంచార్జ్ గా ప్రకటించినప్పటి నుంచి రాష్ట్రంలోనే దీపాదాస్
తెలంగాణలో అధికారంలోకి వచ్చే వరకూ మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ధాకరే కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉండేవారు. ఎంత ఎన్నికల సీజన్ లో అయినా ఇక్కడ ఎప్పుడూ ఇల్లు తీసుకుని నివాసం ఉండలేదు. ఎక్కువ పని ఉంటే నాలుగైదు రోజులు ఉండేవారు. కాంగ్రెస్ గెలిచిన తర్వాత ఆయనను తప్పించి కొత్త ఇంచార్జ్ గా దీపాదాస్ మున్షిని నియమించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీకి ఇంచార్జ్ గా వచ్చిన ఆమె హైదరాబాద్‌లోనే ఓ భారీ బంగళా అద్దెకు తీసుకుని ఉండిపోయారు. సాధారణంగా ఇంచార్జ్ అంటే పార్టీకి దిశానిర్దేశం చేయాల్సి వచ్చినప్పుడో.. పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయాల్సి వచ్చినప్పుడో.. ఇంకా హైకమండ్ సందేశం తీసుకు వచ్చినప్పుడో వస్తారు. కానీ దీపాదాస్ మున్షి మాత్రం.. ఇంచార్జ్ గా హైదరాబాద్‌లోని మకాం వేశారు.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు - తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో పెరిగిన నిఘా
పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీకి కొత్తగా పీసీసీ చీఫ్ ను నియమించారు. పార్టీ వ్యవహారాలను ఆయన చూసుకుంటారు. కానీ మహేష్ కుమార్ గౌడ్ ఇంటి వద్ద లేదా గాంధీభవన్ వద్ద కన్నా.. దీపాదాస్ మున్షి ఇంటి వద్దే ఎక్కువ సందడి ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ పార్టీ నేతలు వచ్చి కలుస్తూనే ఉంటారు. ఎవరెవరు కలవాలనేది దీపాదాస్ మున్షి వ్యక్తిగత టీం నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ ఆమె అలా నివాసం ఏర్పాటు చేసుకుని మరీ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టడం లేదని.. పాలనలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. విపక్షంలో ఉంటే పార్టీని బలోపేతం చేయడానికి దగ్గరుండి పని చేయిస్తున్నారని అనుకుంటున్నారు. కానీ అధికారంలో ఉండటంతో ఆమెపై ఆరోపణలు వస్తున్నాయి. పాలనలో జోక్యం చేసుకుంటున్నారని అంటున్నారు.
కాంగ్రెస్‌కో దండం - స్వచ్చంద సంస్థ పెట్టుకంటా - తేల్చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కేబినెట్ విస్తరణ జరగకుండా నివేదికలిస్తున్నారా ?
కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ అంటే.. హైకమాండ్‌కు నివేదికలు పంపడం కీలకం. వారు పంపే నివేదికల్ని హైకమాండ్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె పార్టీ పరిస్థితులపై నివేదికలు ఇస్తూ మంత్రి వర్గ విస్తరణ జరగకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీపాదాస్ మున్షి రాష్ట్రంలోకి వచ్చిన కొత్తలో అత్యంత లగ్జరీ కారును గిఫ్టుగా పొందారని బీజేపీ నేతలు ఆరోపించారు. అయితే వారిపై ఆమె కోర్టులో కేసు వేశారు. ఇంచార్జ్‌కు అసలు తెలంగాణలో ఏం పని అని వస్తున్న విమర్శలను కూడా ఆమె లెక్క చేయడం లేదు. దీపాదాస్ మున్షి పై కాంగ్రెస్‌లోనే అంతర్గతంగా అసంతృప్తి కనిపిస్తూండటంతో హైకమాండ్‌కు ఫిర్యాదులు పంపుతున్నారని ప్రచారం జరుగుతోంది.