AP Politics : టీడీపీతో కలవకుండా జనసేనను బీజేపీ అడ్డుకుంటోందా ? ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది ?
టీడీపీతో కలవకుండా జనసేనను బీజేపీ బెదిరిస్తోందా ?వైసీపీ,బీజేపీ ఒక్కటేనంటున్న అచ్చెన్నాయుడు! టీడీపీ నేతల ఆరోపణలకు బీజేపీ నేతలు ఎందుకు స్పందించడం లేదు ?జనసేన తమతోనే ఉంటుందని ధీమాగా ఎలా చెబుతున్నారు?
AP Politics : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొంత కాలంగా పవన్ కల్యాణ్ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నారు. ఆయన పొత్తులపై ఎలాంటి అడుగులు వేయాలో ఓ అంచనాకు వచ్చారు . కానీ ఎలా ముందడుగు వేయాలో మాత్రం అర్థం కావడం లేదు. బీజేపీతో ఉంటే ఓట్లు చీలిపోవడం తప్ప… ఇంకే ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. అదే సమయంలో తెలుగుదేశంపార్టీకి దగ్గరవుతున్నారు. చంద్రబాబుతో నేరుగానే చర్చలు జరిపారు. ఎర్రగొండపాలెంలో చంద్రబాబుపై రాళ్ల దాడిని పవన్ వెంటనే ఖండించారు. టీడీపీతో కలవాలని అనుకుంటున్న పవన్ కల్యాణ్ ను బీజేపీ అడ్డుకుంటోందని పితాని సత్యానారాయణ ఆరోపించడం కలకలం రేపింది. అదే సమయంలో అచ్చెన్నాయుడు బీజేపీకి దగ్గర అని ప్రజల అభిప్రాయమని స్పష్టం చేశారు. దీంతో రాజకీయాలపై ఓ క్లారిటీ వస్తున్నట్లయింది.
పవన్ కు అన్ని రూట్ మ్యాప్‌లు ఇచ్చేశామన్న సునీల్ ధియోధర్
సునీల్ ధియోధర్ పవన్ కు ఇవ్వాల్సిన రూట్ మ్యాప్ లన్నీ ఇచ్చేశామని ఇక నిర్ణయం ఆయనదేనని ప్రకటించారు. మరో వైపు బీజేపీతో కలుస్తారా అన్న ప్రశ్నకు అచ్చెన్నాయుడు మీడియా ముందు భిన్నమైన సమాధానం ఇచ్చారు. ఆ పార్టీ వైసీపీతో కలిసి ఉందని ప్రజలు నమ్ముతున్నారని… స్పష్టం చేశారు. అలాంటి పార్టీతో ఎలా కలుస్తామన్నట్లుగా మాట్లాటారు. వైసీపీతో కలిసి లేమని ప్రజలు నమ్మేలా ఎలా చేయాలో కూడా ఆయన పరోక్షంగా చెప్పారు. అడ్డగోలు అప్పులకు అనుమతిని నిరాకరించాలని ఆయన అంటున్నారు. అయితే అది రాష్ట్ర నాయకుల చేతుల్లో లేని అంశం. టీడీపీ, జనసేన విషయంలో పాజిటివ్ స్పందనలు ఉన్నా.. బీజేపీ మాత్రమే.. ఆ రెండు కలవకుండా చేస్తోందన్న అభిప్రాయాన్ని టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
పొత్తులు ఉన్నా లేనట్లే బీజేపీ , జనసేన
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య నాలుగేళ్లుగా పొత్తు కొనసాగుతోంది. నామ్ కే వాస్తే అన్నట్లుగా ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తన పార్టీని బలపశువు కాబోదని చెప్పిన పవన్ కొత్త లెక్కలతో వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్ చాలా సార్లు చెప్పారు. బీజేపీతో తనకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళ్లిన పవన్ కల్యాణ్ తమ రెండు పార్టీలతో పాటుగా టీడీపీని కలుపుకోవాలనే ప్రతిపాదన చేసినట్లు ప్రచారం సాగుతోంది. దీని పైన బీజేపీ నుంచి నిర్ణయం తెలియాల్సి ఉంది. బీజేపీ కలిసి వస్తే మూడు పార్టీలు కలిసి వైసీపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనేది టీడీపీ, జనసేన పార్టీల వ్యూహం. బీజేపీ కలిసి రాకపోతే పవన్ టీడీపీతో కలిసి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
వైఎస్ఆర్‌సీపీకి సహకారం ఆపేయాలనేదే టీడీపీ పెడుతున్న డిమాండ్ ?
రాష్ట్రంలో బిజెపి ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వెనుక జగన్ మోహన్ రెడ్డికి మద్దతు ఇస్తుందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అచ్చెన్నాయుడు కూడా అప్పుల విషయంలో కేంద్రం జగన్ కు సహకరిస్తోందని విమర్శించారు. బీజేపీ, జగన్ మధ్య సంబంధాలు లేవని నేతలు చెప్పటం కాదన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే వైఎస్ఆర్‌సీపీకి సహకరించడం ఆపేయాలన్న డిమాండ్ కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి. ప్రభుత్వానికి అనధికారికంగా అప్పులు ఇవ్వడాన్ని నిలిపివేయడంతో పాటు జగన్ కేసుల విషయంలో వేగం ఉండాలని కోరుకుంటున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. కేంద్రంతో ఘర్షణ జగన్ కోరుకోరు. దూరం అయ్యే అవకాశం లేదు. రాజకీయంగా దూరంగా నే ఉంటున్నా, సంబంధాలు మాత్రం కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తున్న వేళ..వాళ్లకంటే తాను నమ్మకమైన మిత్రుడనని నమ్మించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు.