Telangana Elections : తెలంగాణ రాజకీయంలో పార్టీలెక్కువ - ఎవరి సన్నాహాలు ఎలా ఉన్నాయంటే ?
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ఎన్ని పార్టీలు ప్రభావం చూపిస్తాయన్నది స్పష్టత లేకుండా పోయింది.
Telangana Elections : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. అందులో తెలంగాణ షెడ్యూల్ కూడా ఉంది. కానీ తెలంగాణది ఈ జాబితాలో చివరి స్థానం. అంటే.. నామినేషన్ల తేదీ ప్రారంభమయ్యేది నవంబర్ మూడో తేదీన. అంటే మూడు వారాల కన్నా ఎక్కువ సమయం ఉంది. సాధారణంగా రాజకీయ పార్టీలు షెడ్యూల్ ప్రకటనను కాకుండా.. నామినేషన్ల గడువు వరకూ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తాయి. ఎందుకంటే అభ్యర్థులు చాలా ముఖ్యం. పోటీ పడేవారిలో అత్యుత్తమం అనుకున్న వారిని ఎంపిక చేసుకుని రంగంలోకి దిగుతాయి. అప్పటి వరకూ సభలు, సమావేశాలు పెట్టినా.. అంత జోరుగా ఉండవు. అయితే ఈ విషయంలో బీఆర్ఎస్ ఒక్కటే మినహాయింపు.
మూడు నెలల ముందు నుంచే దూకుడుగా ఉన్న బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్న సంకేతాలు తరచూ సీఎం కేసీఆర్ ఇస్తూండటంతో గత ఏడాది కాలంగా రాజకీయాలు వేడి మీద ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో దాదాపు 50 రోజులపాటు అవి ప్రచారంతో రాష్ట్రాన్ని హోరెత్తించనున్నాయి. అటు జాతీయ స్థాయి నేతలు, ఇటు రాష్ట్ర నాయకుల సభలు, సమావేశాలతో తెలంగాణ హీటెక్కనుంది. అంగబలం, అర్థబలం దండిగా ఉన్న బీఆర్‌ఎస్… 115 మంది అభ్యర్థులతో తన తొలి జాబితాను ప్రకటించిన సంగతి విదితమే. ఫలితంగా నెలకొన్న అసంతృప్తులు, బుజ్జగింపుల పర్వం ఒకవైపు కొనసాగుతుండగానే మరోవైపు ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు అధికారిక, అనధికారిక కార్యక్రమాల పేరిట నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇప్పుడు ఆ పర్యటనల ఉధృతి ఎక్కువ కానుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ట్రబుల్ షూటర్ హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత వివిధ కార్యక్రమాల పేరిట ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది కాబట్టి వారు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. దాంతోపాటు సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్, నామినేషన్ దాఖలు తేదీ కూడా ఖరారయ్యాయి. పదిహేనో తేదీ నుంచి బీఆర్ఎస్ తెలంగాణలో ఎక్కడ చూసినా కనిపించేలా ప్రణాళికలు రెడీ చేసుకున్నారు.
బీఆర్ఎస్ కు ధీటుగా ప్రచార బరిలోకి కాంగ్రెస్
కర్నాటక ఎన్నికల ఫలితాలతో జోష్ నింపుకున్న రాష్ట్ర కాంగ్రెస్… బీఆర్‌ఎస్‌తో ఢీ అంటే ఢ అనే విధంగా ఇటీవల కార్యక్రమాలను నిర్వహించింది. కొద్ది నెలల క్రితం వరంగల్‌లో రైతు డిక్లరేషన్, ఆ తర్వాత సరూర్‌నగర్‌లో నిరుద్యోగ సభ, సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించి, తుక్కుగూడలో విజయభేరీ సభను ఏర్పాటు చేయటం ద్వారా ఆ పార్టీ తన క్యాడర్‌లో జవసత్వాలను నింపింది. ఇటీవల చేవెళ్లలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరిట బహిరంగ సభను నిర్వహించి, ఆయా సామాజిక తరగతులను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సారి గెలుపు గుర్రాలు అనుకున్న వారికే టిక్కెట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రలకు రంగం సిద్ధం చేయటం ద్వారా ప్రజల్లోకి వెళ్లనుంది. రాహుల్ గాంధీ స్వయంగా మూడు రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు అవకాశం ఉందని హైకమాండ్ భావిస్తున్నందున ఎక్కువ దృష్టి పెట్టనుంది.
జోష్ కనిపంచని బీజేపీ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలతో కాస్త వెనుకబడిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఫలితాలు ఆ పార్టీపై పెను ప్రభావాన్ని చూపాయి. దానికితోడు నేతల మధ్య సఖ్యత లేకపోవటం, అంతర్గత కుమ్ములాటలతో ఆ పార్టీ సతమతమవుతోంది. బీజేపీలోని పాత కాపులు, కొత్త నేతల మధ్య ఆధిప్యత పోరు తారాస్థాయికి చేరటంతో ఇటీవల పలువురు సీనియర్లు కమలాన్ని వీడారు. ఈ కారణాలన్నింటితో బీజేపీ పరిస్థితి మరింతగా దిగజారింది. ఈనెల 15,16 తేదీల్లో తొలి జాబితాను ప్రకటిస్తామంటూ ఆ పార్టీ నేతలు చెబుతున్నా.. అ గట్టి అభ్యర్థులు కనిపించడం లేదు.
ఇతర పార్టీలన్నీ నామ మాత్రమే !
ఈ సారి తెలంగాణలో పార్టీల సంఖ్య ఎక్కువగానే ఉంది. కమ్యూనిస్టులు, తెలంగాణ జన సమితి, వైఎస్సార్ టీపీ, టీడీపీ , బీఎస్పీ, జనసేన, కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీల పరిస్థితి అయోమయంగానే ఉంది. ఆయా పార్టీలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాయనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. పోటీ చేయని స్థానాల్లో ఎవరికి మద్దతిస్తారనే దానిపైనా క్లారిటీ లేదు. మొన్నటి వరకూ కాంగ్రెస్‌లో వైఎస్సార్ టీపీ విలీనం గురించి చర్చలు, మంతనాలు జరిగినా పలు సమీకరణాల రీత్యా అది వాయిదా పడుతూ వస్తోంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో వెళ్తున్నరు. మిగతా పార్టీలు నామ మాత్రంగానే మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.