Hydra Revanth : ఉద్దేశం మంచిదే అయినా దూకుడే అసలు సమస్య - హైడ్రా డ్యామేజీని రేవంత్ ఎలా కవర్ చేసుకుంటారు ?
Telangana : హైదరాబాద్‌కు ఓ రూపు తీసుకు రావాలని ముంపు నుంచి కబ్జాల నుంచి బయటపడేయాలని రేవంత్ ప్రయత్నం చేశారు. కానీ ముందూ వెనుకా లేని దూకుడు వల్ల చిక్కుల్లో పడ్డారు. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు ?
How will Revanth cover Hydra damage : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తన మార్క్ చూపించాలని అనుకున్నారు. తెలంగాణను పట్టి పీడిస్తున్న సమస్యలను చిటికెలో పరిష్కరించేయాలనుకన్నారు. కానీ దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలకు పరిష్కారం చూపించడంతేలిక కాదు. ఇన్నేళ్లుగా ప్రభుత్వాలు ఏమీ చేయలేకపోయిన వాటిని తాను ఇట్టే చేసేయాలనుకుని చేసిన పనులు వికటిస్తున్నాయి. గత ప్రభుత్వాల తప్పులన్నీ మీదపడిపోతున్నాయి. దశాబ్దాలుగా మూసీని మురిక కాలువ చేసి ఇందులో కాలనీలు కట్టేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. పైగా పట్టాలిచ్చారు. చెరువుల్ని మూసేసి ఆపార్టుమెంట్లు కట్టేసినా అదే పరిస్థితి ఇప్పుడు అదంతా తాను సరి చేయాలని రేవంత్ రెడీ అయ్యారు. ఆయన ఉద్దేశం మంచిదే కానీ మూలాలు అన్వేషించకుండా కూల్చేస్తే పనైపోతుందని అనుకోవడంతోనే సమస్య వచ్చింది.
ముందుగా ఆక్రమణ దారులను మానసికంగా రెడీ చేయాలి కదా !
హైడ్రా విషయంలో ప్రజలంతా పానిక్‌కు గురవుతున్నారు. దీనికి కారణం రెండు నెలలో హైడ్రా హైదరాబాద్‌ను కూల్చి వేసిందన్నట్లుగా ప్రచారం జరగడమే. ప్రజల్ని ప్రిపేర్ చేయకపోవడం వల్ల ఎక్కవ సమస్యలు వస్తున్నాయి. హైడ్రా ఏర్పాటును హడావుడిగా చేశారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఏర్పాటు చేసి కూల్చివేతలు ప్రారంభించేశారు. ఇంకా అసెంబ్లీలో చట్టబద్ధం చేయలేదు. అసెంబ్లీలో దీనిపై విస్తృతంగా చర్చ పెట్టాల్సినంత పెద్ద విషయం ఇది. ప్రజల ఆమోదం లభించేలా తన వాదనను ప్రభుత్వం వినిపించిన తర్వాత బాధితులకు న్యాయం చేసి ఆ తర్వాత కూల్చివేతలు చేపట్టాల్సి ఉంది. అంటే మెరుగైన హైదరాబాద్ కోసం కూల్చివేతలు తప్పవు అని అందరికీ నచ్చ చెప్పి కూల్చివేతలు చేసినట్లయితే వ్యతిరేకత కనిపించేది కాదు. పైగా ప్రజల నుంచి మద్దతు వచ్చేది.
మూసి మార్కింగులతో మరింత గందరగోళం
మూసి విషయంలో కూడా ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరించింది. హైదరాబాద్‌లో మూసి అంటే మురికి కాలువ. మురికి కాలువగా మారిపోయిన మూసిలో అంతా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, నిరుపేదలే చిన్న చిన్న ఇళ్లు కట్టుకుని ఉంటారు. దశాబ్దాల నుంచి మూసిలో నిర్మాణాలు జరుగుతున్నాయి. మరి వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇచ్చేస్తాం వెళ్లిపొమ్మంటే ఎలా వెళ్తారు. తప్పన ిసరి అనుకుంటే వారికి ఆ పరిస్థితి కల్పించేలా మెల్లగా చర్యలు తీసుకోవాలి . కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు చర్చలు జరిపి అందరికీ న్యాయం చేసి..అక్కడి నుంచి తరలిస్తేనే అడ్డంకులు లేకుండా ఉంటాయి. కానీ రాత్రికి రాత్రి మార్కింగులు చేయడం వల్ల అలదడి రేగింది.
ప్రభుత్వానికి బాధ్యతలూ ఉంటాయి !
కూల్చివేతల్లో నష్టపోతున్న వారికి న్యాయం చేయాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే వారు కూల్చివేసిన ఆస్తికి సంబంధించి ప్రభుత్వం అన్ని రకాల పన్నులూ వసూలు చేస్తోంది . రిజిస్ట్రేషన్లు కూడా చేసింది. మరి ఇప్పుడు కూల్చివేయడం ఎలా న్యాయం ? అవి ప్రభుత్వ స్థలాలే.. నదులే అయినా వారికి పరోక్షంగా అయినా హక్కులిచ్చింది ప్రభుత్వమే. వారి వద్ద నుంచి ఇంటి పన్నులు కట్టించుకుని రిజిస్ట్రేషన్లు చేసిచ్చి ఇప్పుడు అది ప్రభుత్వ స్థలం చెరువు జాగా అంటే ప్రభుత్వం తప్పు చేసినట్లే. రేవంత్ ప్రభుత్వం ఈ విషయాన్ని మర్చిపోయింది. అందుకే సమస్యల్లో ఇరుక్కుపోయింది.