YS Viveka Case : అవినాష్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ - వైఎస్ఆర్‌సీపీ సాహసం చేస్తోందా ? విమర్శలకు సమాధానం ఎలా ?
అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్‌సీపీ సపోర్ట్ ను ఎలా సమర్థించుకుంటారు ?క్లీన్ గా రావాలని చెప్పుకుండా పార్టీ పరంగా అండ !ప్రజల సందేహాలను అధికార పార్టీ ఎలా తీరుస్తుంది ?నైతిక పరమైన అంశాలకు ఏం చెబుతారు ?
YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు చూపిస్తోంది. ఈ విషయంలో నిందితులుగా సీబీఐ తేల్చిన వైఎస్ అవినాష్ రెడ్డికి వైఎస్ఆర్‌సీపీ పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతోంది. నిజానికి హత్యకు గురైంది సీఎం జగన్ సొంత బాబాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్నది కూడా సోదరుడు వరుసయ్యే అవినాష్ రెడ్డి. ఏ వైపునా నిలబడలేని పరిస్థితి సీఎం జగన్‌ది. కానీ సీఎం జగన్ మొదటి నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం వైపే ఉన్నారు. విపక్షాలు విమర్శలు చేస్తున్నా.. కుటుంబంలో విబేధాలు వచ్చినా ఆయన అవినాష్ రెడ్డికే మద్దతు తెలుపుతున్నారు. అయితే రాను రాను సీబీఐ ఈ కేసులో పట్టు బిగుస్తోంది. ప్రజలకు కూడా అవినాష్ రెడ్డిపైనే అనుమానాలు ఎక్కువగా కలుగుతున్నాయి. ఇలాంటి సమయంలో పాలకుడి స్థానంలో ఉండి ఓ నిందితుడిగా జగన్ మద్దతు పలకడం నైతికంగా కరెక్ట్ కాదు. అవినాష్ రెడ్డి నిర్దోషి జగన్ సంపూర్ణంగా నమ్ముతున్నారు. కానీ ప్రజలకు వచ్చే సందేహాలను తీర్చకపోతే వారిలో సీఎం జగన్ ఇమేజ్ మసకబారుతుంది. అందుకే ప్రజలకు ఈ కేసు విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
చనిపోయిన వివేకా వివాహేతర సంబంధాల గురించి ప్రచారం సమంజసమేనా ?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో సంచలనం అవుతోంది. సీబీఐ అధికారులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల చుట్టూ కేసు తిరుగుతోంది. వైఎస్ వివేకా హత్య కేసుతో తనకు సంబంధమే లేదని అవినాష్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఆయన పదే పదే కోర్టుల్లో వైఎస్ వివేకా వివాహేతర సంబంధాల గురించి చెబుతున్నారు. వివేకా హత్యకు మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలే కారణమంటూ ఆయన తాజాగా దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే A 2 సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో కూడా వివేకాకు సంబంధం ఉన్నట్లుగా ఆరోపించారు. ఈకేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అయితే ఇలా వరుసగా వివేకానందరెడ్డి స్త్రీ లోలుడన్నట్లుగా చెబుతూండటం ..చాలా మందిలో అనేక అనుమానాలకు కారణం ్వుతోంది.
ప్రజలకు ఉన్న ప్రధాన సందేహం.. ఎవరో హత్య చేస్తే సాక్ష్యాలను ఎందుకు తుడిచేశారు ?
వైఎస్ వివేకా చనిపోయిన రోజున ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొదట గుండె పోటు అని ప్రచారం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న వివేకా కుమార్తె, అల్లుడు రాక ముందే ఖననం చేయాలనుకున్నారన్న ప్రచారమూ జరిగింది. పోస్టుమార్టం నిర్వహించలేదు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని.. పోస్టుమార్టంకు పంపించారు. అప్పటి వరకూ అందరూ గుండెపోటు అనే ప్రచారం చేశారు. పోస్టుమార్టంలో గాయాలు బయటపడిన తర్వాతనే హత్య అని అంగీకరించారు. అదే సమయంలో వివేకా ఇంట్లో సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నించారు. రక్తాన్ని తుడిచేశారు. ఇవన్నీ పోలీస్ రికార్డుల్లో ఉన్నాయి. మృతదేహానికి కట్లు కట్టారు. ఇదంతా అవినాష్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఎక్కువగా భావిస్తున్నారు. కానీ తనకేమీ తెలియదని అవినాష్ రెడ్డి అంటున్నారు. ఈ విషయం నిజమని ప్రజల్ని నమ్మించగలిగేలా చెబితేనే ప్రజలకు క్లారిటీ వస్తుంది. లేకపోతే అవినాష్ రెడ్డిపైనే ఎక్కువ మంది అనుమానపడతారు.
వైఎస్ఆర్‌సీపీ ఇమేజ్‌కు డ్యామేజే !
వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా మారాయి. విపక్ష పార్టీలు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకుని ప్రజల్లోకి వెళ్తున్నయి. ఓ వైపు కోడి కత్తి కేసు.. మరో వైపు వివేకా హత్య కేసు విచారణలు మొత్తం వైసీపీ పార్టీకి ఇబ్బందికరంగానే మారాయి. కోడికత్తి కేసులో ఎన్ఐఏ విచారణ వైసీపీ కోరుకున్నదే. అయితే ఇప్పుడు ఎన్ఐఏ విచారణను కూడా తప్పు పడుతున్నారు. ఇక అవినాష్ రెడ్డి కేసులో సీబీఐ విచారణను కూడా తప్పు పడుతున్నారు. ఇలా అన్ని రకాల విచారణలను తప్పు పట్టుకుంటూ పోవడం ప్రజల్లో ప్రభుత్వాన్ని చులకన చేస్తుందన్న అభిప్రాయం ఆ పార్టీ క్యాడర్‌లో ఉంది.
ఎలా చూసినా అవినాష్ రెడ్డి.. వైఎస్ వివేకా హత్య కేసు విషయం వైఎస్ఆర్‌సీపీకి ఇబ్బందికరంగా ఉంది. కేసు నుంచి బయటపడాలని అవినాష్ రెడ్డికి చెప్పకుండా పార్టీ పరంగా అండగా ఉండటంతో ప్రజలకు కూడా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికార పార్టీ కావడంతో అది బాధ్యతగా మారింది.