(Source: ECI/ABP News/ABP Majha)
YSRCP In NDA : ఏపీ రాజకీయాల్లో భారీ ట్విస్ట్ - ఎన్డీఏలోకి టీడీపీ కాదు వైఎస్ఆర్‌సీపీ!?
ఎన్డీఏలో చేరికకు వైఎస్ఆర్‌సీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా ?ఎన్నికలకు ముందే ఎన్డీఏలో చేరిక ప్రకటన ఉంటుందా ?టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ జట్టుకట్టకుండా జగన్ ప్లాన్ చే్శారా ?
YSRCP In NDA : మోదీ విధానాల పట్ల సంపూర్ణ సానుకూలతతో ఉన్నాం ఎన్డీఏలో టీడీపీ చేరికను కాలమే నిర్ణయిస్తుందని చంద్రబాబునాయుడు ఓ ఇంగ్లిష్ మీడియా చానల్‌తో చేసిన వ్యాఖ్యల తర్వతా వచ్చే ఎన్నికల్లో 2014 కూటమి రిపీటవుతుందన్న చర్చ జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ సందర్భంగా బీజేపీ తరపున వకాల్తా పుచ్చుకుని కలసి పోటీ చేస్తామని.. ఒప్పిస్తామని ప్రకటించారు. ఎన్డీఏలో నమ్మకమైన మిత్రుల కోసం చూస్తున్న బీజేపీ కూడా టీడీపీ విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. అయితే రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన వైఎస్ఆర్‌సీపీ అధినేత జగన్ రెడ్డి.. ఎన్డీఏలో టీడీపీ చేరకుండా .. చేర్చుకోకుండా బీజేపీకి బంపర్ ఆఫర్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.
ఎన్డీఏలో చేరేందుకు జగన్ ఓకే చెప్పారా ?
సీఎం జగన్ మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. అందులో నీతి ఆయోగ్ భేటీ, పార్లమెంట్ భవన్ ప్రారంభోత్సవాలు మినహా మిగతా అన్ని భేటీలు రహస్యం లేదా రాజకీయమేనని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీజేపీ.. టీడీపీ దగ్గరకు కదులుతున్న సూాచనలు కనిపిస్తూండటంతో సీఎం జగన్ చురుగ్గా కదిలారని అంటున్నారు. ఎన్డీఏలోకి మళ్లీ టీడీపీని ఆహ్వానించవద్దని.. అవసరం అయితే తమ పార్టీనే ఎన్డీఏలో చేరుతుందని బీజేపీ పెద్దలకు ఆయన హామీ ఇచ్చినట్లుగా చెబుతున్నారు. బీజేపీకి చెందిన కొంత మంది ఉన్నత స్థాయి నేతలు ఈ సమాచారాన్ని కొంత మంది రాష్ట్ర నేతలకు చేరవేశారు. ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. దీంతో విషయం మెల్లగా బయటకు వస్తోంది.
నమ్మకమైన మిత్రుల కోసం బిజేపీ ప్రయత్నాలు !
భారతీయ జనతా పార్టీ రెండు సార్లు తిరుగులేని మెజార్టీ సాధించింది. ఈ సారి అలాంటి విజయం కష్టమేనన్న అభిప్రాయం పోల్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణాది నుంచి గతంలో కర్ణాటక నుంచి వచ్చిన సీట్లు కూడా జారిపోయే ప్రమాదం ఉంది. హిందీ రాష్ట్రాల్లో పది .. ఇరవై శాతం సీట్లు తగ్గినా బీజేపీకి మైనస్ అవుతుంది. మిత్రపక్షాల అవసరం పడుతుంది. ఎన్డీఏలో ఇప్పుడు సీట్లు సాధించే కెపాసిటీ ఉన్న మిత్రపక్షాలు ఏమీ లేవు. శివసేన, అకాలీదళ్, జేడీయూ లాంటి పార్టీలన్నీ దూరమయ్యాయి. శివసేన , జేడీయూ కలసి వచ్చే అవకాశం లేదు. వస్తే దక్షి్ణాది నుంచే మిత్రపక్షాలను కలుపుకోవాలి. దక్షిణాదిలో బీజేపీకి నమ్మకంగా కనిపించే పార్టీ టీడీపీనే. అయితే టీడీపీ విషయంలో మోదీ అంత సానుకూలంగా ఉండరన్న ప్రచారం ఉంది. కానీ ప్రత్యామ్నాయం లేకపోతే తప్పదన్న భావనలో ఉంటారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే జగన్.. ఎన్డీఏలో చేరికకు సిద్ధమని సంకేతాలు ఇచ్చారని అంటున్నారు.
ఎన్డీఏలో జగన్ చేరితే రాజకీయాల్లో పెను మార్పులు !
ఎన్డీఏలో జగన్ చేరితే.. ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి. ఇప్పుడు బీజేపీతో పొత్తులో జనసేన ఉంది. అదే్ వైసీపీ ఎన్డీఏలో చేరితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన ఉండదు. బయటకు వచ్చేస్తుంది. టీడీపీతో కలిసి పోటీ చేస్తుంది. బీజేపీ, వైసీపీ కూటమితో.. టీడీపీ, జనసేన పోటీ పడతాయి. అయితే బీజేపీకి ఉన్న బలం దృష్ట్యా పొత్తులు పెట్టుకుని సీట్లు ఇవ్వడం దండగేనన్న అభిప్రాయం ఉంది. కానీ కేంద్రంలో ఉన్న అధికార పార్టీగా.. ఆ పార్టీ సహకారం .. ఏపీలోని రెండు ప్రాంతీయ పార్టీలు కోరుకుంటున్నాయి. సహకారం లేకపోయినా న్యూట్రల్ గా ఉంటే చాలని టీడీపీ నేతలనుకుంటున్నారు.
బీజేపీతో పొత్తంటే వైసీపీకి సాహసమే !
నిజానికి బీజేపీతో పొత్తు అంటే.. వైసీపీ సాహసం చేస్తోందనే అనుకోవాలి. ఎందుకంటే... వైసీపీ కోర్ ఓటు బ్యాంక్ లో ముస్లింలు ఉంటారు. దళితులు ఉంటారు. బీజేపీతో పొత్తును వీరు స్వాగతించరు. ఓ పదిశాతం వీరు వ్యతిరేకం అయినా.. బీజేపీ తరపున కలిసి వచ్చే ఓటు బ్యాంక్ ఉండదు. ఇలాంటి సమీకరణాలు చూసుకుంటే వైసీపీకి బీజేపీతో రిస్కేనని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ముందు ముందు ఈ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.