Lokesh Issue : లోకేష్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారు ? తెర వెనుక ఏం జరిగింది ?
లోకేష్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందా ? ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అంచనాకు వచ్చారా ?
Lokesh Issue : చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత వైసీపీ నేతలు ఇక నెక్ట్స్ లోకేష్ అని చెప్పడం ప్రారంభించారు. సీఐడీ చీఫ్ సంజయ్ కూడా అదే చెప్పారు. ఆయన ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిన లోకేష్ పేరు కూడా చెప్పేవారు. ఆయనపైనా రెండు, మూడు కేసులు ఉన్నాయని చెప్పేవారు. ఆ తర్వాత ఏ క్షణమైనా అరెస్టు అని ప్రచారం కూడా జరిగింది. వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా .. సీఐడీ కదలికల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నట్లుగా ప్రకటనలు చేసింది. లోకేష్ సీఐడీ అధికారులకు అందుబాటులోకి రాలేదని.. విదేశాలకు వెళ్లాడనీ ప్రచారం చేశారు. కానీ ఇప్పడు లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణకు వస్తే ప్రభుత్వం తరపున ఎలాంటి వాదనలు వినిపించాలో కూడా ఏజీకి చెప్పలేదు. ఒక్క సారిగా పరిస్థితి ఎందుకు మారిపోయిందని టీడీపీ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నాయి.
అరెస్టుకు మానసికంగా రెడీ అయిపోయిన లోకేష్
తెలుగుదేశం పార్టీ ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి ఎన్నికలకు ముందు దెబ్బకొట్టడానికి చంద్రబాబుతో పాటు లోకేష్ ను అరెస్టు చేసి నాయకత్వం లేకుండా చేసే ప్రయత్నం జరుగుతోందని టీడీపీ అనుమానించింది. అందుకే చంద్రబాబు తర్వాత లోకేష్ ను అరెస్టు చేస్తారని ప్రచారం చేశారు. నిజానికి లోకేష్ అరెస్టు అనే ప్రచారం జరిగే నాటికి .. లోకేష్‌పై ఒక్క ఎఫ్ఐఆర్ కూడా లేదు. లోకేష్ ఢిల్లీలో న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్న సమయంలో ఏపీకి రావాలంటే భయపడుతున్నారని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శించారు. ఆ సమయంలో తనపై కేసులు ఉంటే అరెస్టు చేయడానికి సీఐడీ ఢిల్లీకి రాలేదా అని లోకేష్ ప్రశ్నించారు. అప్పటికీ ఆయనపై కేసులు లేవు.కానీ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా చేశారు. ఆ తర్వాతే సీన్ మారిపోయింది.
లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణలో ప్రభుత్వ లాయర్ల ఆశక్తత
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మొదట వాట్సాప్ లో నోటీసులు పంపిన సీఐడీ పోలీసులు తర్వాత ఢిల్లీ వెళ్లి స్వయంగా ఇచ్చారు. తనను ఐఆర్ఆర్ కేసులో ఏ 14గా చేర్చారని తెలిసిన తర్వాత లోకేష్ హైకోర్టులో మందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. అలాగే తనపై ఉన్నాయంటూ సీఐడీ అధికారులు ప్రచారం చేస్తున్న స్కిల్ కేసు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఐఆర్ఆర్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ ఒక్క సారిగా మాట మార్చేశారు. ఏ14dగా లోకేష్ ను చేర్చినా... దర్యాప్తు అధికారి ఎఫ్ఐఆర్‌లో సెక్షన్లు మార్చేశారని అందుకే 41A నోటీసులు ఇస్తామని అరెస్టు ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. సెక్షన్లు ఎందుకు మార్చారో.. ఏమని మార్చారో స్పష్టత లేదు. ఇక స్కిల్ కేసులో అసలు లోకేష్ పేరు ఎఫ్ఐఆర్ లో ఉందో లేదో కూడా స్పష్టత లేదు. బుధవారం ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు ఏజీ .. తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేనందున వాయిదా వేయాలన్నారు. ఫైబర్ గ్రిడ్ కేసులో అసలు ఎఫ్ఐఆర్‌లో లోకేష్ పేరే లేదని హైకోర్టుకు చెప్పారు. ఇలా లోకేష్ విషయంలో ముందస్తు బెయిల్ పిటిషన్లపై వాదనలు వినిపించడంలో ప్రభుత్వం తేలిపోయింది.
ఆధారాలు లేవని ఇరుక్కుపోతామని వెనక్కి తగ్గారా ? రాజకీయంగా నష్టమని ఆగిపోయారా ?
ప్రభుత్వం లోకేష్ అరెస్టు విషయంలో ఒక్క సారిగా ఎందుకు వెనక్కి తగ్గిందన్నదానిపై భిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ ఆధారాలు లేనివేనని.. తప్పుడు పద్దతుల్లో అన్వయించి సగం సమాచారం దాచి.. కేసుకు సంబంధం లేని అంశాలను చేర్చి ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా మొత్తం బయటపడుతుందని.. అప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందన్న ఉద్దేశంతో వెనక్కి తగ్గారని కొంత మంది భావిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేయడం వల్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుందన్న అంచనాలు రావడం వల్ల కూడా రాజకీయ వ్యూహాన్ని మార్చారన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. కారణం ఏదైనా ప్రతిపక్ష నేతల్ని అరెస్టు చేసే విషయంలో దూకుడు తగ్గిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.