Shekawat On KCR : కాళేశ్వరంలో భారీ అవినీతి - కేసీఆర్ సమాధానం చెప్పాలన్న కేంద్ర జలశక్తి మంత్రి !
కాళేశ్వరంలో అవినీతికి కేసీఆర్ సమాధానం చెప్పాలని గజేంద్రసింగ్ షెకావత్ డిమాండ్ చేశారు. డిజైన్ల లోపంతోనే కాళేశ్వరం మునిగిందన్నారు. యాదాద్రిలో బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభోత్సవ సభలో షెకావత్ ప్రసంగించారు.
Shekawat On KCR : ఇంజనీరింగ్ లోపంతోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపు హౌస్లు మునిగాయని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆరోపించారు. బండి సంజయ్ మూడో విడత పాదయాత్ర ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. యాదగిరిగుట్టలో జరిగిన బీజేపీ ప్రజా సంగ్రామ సభలో ప్రసంగించారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని..కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు డబ్బు సంపాదించే మిషన్ గా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయహోదా ఇవ్వలేదని అడుగుతున్న కేసీఆర్... ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని విమర్శించారు. అవినీతి పరులను జైల్లో వేసేందుకే బీజేపీ కి అధికారం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను ఆయన కోరారు.
కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. .!
పోరాడి సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని షెకావత్ ఆవేదన వ్యక్తం చేశఆరు. రాష్ట్రంలో బీజేపీ జంగ్ సైరన్ మోగించిందని..వచ్చే ఎన్నికల్లో బండి సంజయ్ నాయకత్వంలో అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న ఆయన.. ఇక్కడి ప్రజలు సుష్మా స్వరాజ్ను చిన్నమ్మగా పిలుచుకుంటారని తెలిపారు. రాష్ట్రంలో ఒక కుటుంబం మాత్రమే బాగుపడుతోందని..కేసీఆర్ కుటుంబ పాలన అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అవినీతి, కుటుంబ పార్టీలకు మాత్రమే కేసీఆర్ మద్దతు ఇచ్చారని ఆరోపించారు. అణగారిన వర్గాలంటే కేసీఆర్ కు గిట్టదన్నారు.
ఏళ్లుగా పాలించిన వాళ్లు దేశాన్ని పట్టించుకోలేదు !
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గద్దెదిగితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. తో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బండి సంజయ్ పాదయాత్రను ప్రజలు ఆశీర్వదించారని..మూడవ విడత పాదయాత్ర కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశాన్ని ఏళ్లుగా పాలించిన వాళ్లు ప్రజలను పట్టించుకోలేదని షెకావత్ అన్నారు. దళితుడైన రాంనాథ్ కోవింద్ తోపాటు గిరిజన మహిళైన ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. కుటుంబహితమే లక్ష్యంగా కేసీఆర్ పాలన సాగుతోందని..అవినీతి పరులకు ఆయన అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. మోడీ పాలనలో ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నాయన్న ఆయన..ప్రపంచంలో భారత్ శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.
కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయం. .!
కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. రైతులను నిండా ముంచిన ఘనత కేసీఆర్ కే చెల్లిందని అన్నారు. ఫ్రీ యూరియా ఇస్తానని పాలాభిషేకం చేయించుకున్న ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేదని అన్నారు. వాసాలమర్రికి అభివృద్ధి కోసం ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. కేసీఆర్ మూర్ఖపు, చేతగాని పాలన వల్ల చేనేత కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఇప్పటికైనా బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరాన్ని నిండా ముంచిన ఘనత కేసీఆర్ కు దక్కిందని సంజయ్ విమర్శించారు. కేసీఆర్ పాలనను అంతం చేస్తామన్నారు.