Amanchi Highcourt : సీబీఐ అరెస్ట్ భయం - హైకోర్టులో వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే క్వాష్ పిటిషన్ !
సీబీఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని హైకోర్టులో వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవ్యవస్థపై దూషణల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు.
Amanchi Highcourt : న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల్ని దూషించిన కేసులో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని ఆయన హైకోర్టును కోరారు. ఆమంచి కృష్ణమోహన్ తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆమంచి కృష్ణమోహన్ న్యాయవ్యవస్థను కానీ.. న్యాయమూర్తుల్ని కానీ దూషించలేదని ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం ఎదుట వాదించారు. అయితే ఈ కేసులో తదుపరి చర్యలు ఉంటాయని సీబీఐ లాయర్ హైకోర్టుకు తెలిపారు.ఇరు వైపుల వాదనలు విన్న హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి ఆదేశిస్తూ.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.
ఆమంచి కృష్ణమోహన్ ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే తాను రాలేనని మరింత గడువు కావాలని ఆమంచి కోరారు. ఆ మేరకు అంగీకారం తెలిపిన సీబీఐ.. తర్వాత మరోసారి నోటీసులు జారీ చేసింది. సీఆర్పీసీ సెక్షన్ 41(A) కింద సీబీఐ అధికారులు ఆమంచికి నోటీసు ఇచ్చింది. అయితే ఈ సారి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదే అంశానికి సంబంధించి గతంలో విశాఖలో సీబీఐ ముందు ఆమంచి కృష్ణ మోహన్ ను విచారించింది.
న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనల్లో హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ గత ఏడాది నవంబర్ నెలలో కేసు నమోదు చేసింది. ఇప్పటి వరకూ కొంత మంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. వారు బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఈ కేసులో ముందడుగు పడటం లేదు. ఇది వ్యవస్థీకృత నేరం అని సీబీఐ చెబుతోంది కానీ.. నిందితుల్ని మాత్రం పట్టుకోలేకపోతోంది. కేసులు నమోదైన తర్వాత కూడా దారుణమైన వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్ అనే అమెరికాలో ఉండే ఎన్నారై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనను అరెస్ట్ చేయాలని హైకోర్టు ఆదేశించినా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేశామని సీబీఐ చెబుతూ వస్తోంది.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలపై కూడా గతంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. వారి వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను సీబీఐ అడిగినప్పుడు అందించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఈ మొత్తం వివరాలను పరిశీలించి… తీవ్ర నేరాలకు పాల్పడినట్లు తేలితే సీబీఐ మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని, వాటిపై దర్యాప్తు జరిపి నిగ్గు తేల్చాలని ఆదేశించింది.