YSRCP : పేర్నినాని, ప్రసాదరాజులు కుట్ర చేశారు - మాజీ మంత్రి రంగనాథరాజు ఆరోపణలు !
పేర్ని నాని, ప్రసాదరాజులు తనపై కుట్ర చేశారని మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ఆరోపించారు. అక్వా రైతుల సబ్సిడీ తీసేయడానికి తనే కారణం అని వారు ప్రచారం చేశారన్నారు
YSRCP : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీలో నేతల మధ్య విభేదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. పెద్ద పార్టీలో ఇలాంటి చిన్న చిన్న విభేదాలు సహజమేనని పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించిన తర్వాత ఇవి మరింత పెరిగినట్లుగా కనిపిస్తోంది. తాజాగా వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పెద్దఅమిరంలో నిర్వహించిన ప్లీనరీలో తనపై నర్సాపురం ఎమ్మెల్యే, అప్పటి ఇంచార్జి మంత్రి కుట్ర చేశారని ఆరోపించారు.
అక్వా రైతుల సబ్సిడీ తీసేసిన ప్రభుత్వం
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అక్వా రైతులకు ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి ప్రాధికార సంస్థ కింద నమోదు చేసుకున్న చెరువులకే.. అది కూడా ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులకే విద్యుత్ రాయితీ దక్కుతుందని ప్రభుత్వం ప్రకటించి జీవో విడుదల చేసింది. ఆక్వా రంగంలో నూటికి తొంభై శాతం మంది రైతులు కౌలుదారులే ఉంటారు. కౌలు తీసుకున్న రైతులు రిజిస్టర్ చేసుకున్న ఒప్పంద పత్రం తీసుకొస్తే విద్యుత్ రాయితీకి పేర్లు నమోదు చేస్తారు. అయితే అలాంటి పత్రాలు లభించే అవకాశం లేకపోవడంతో 90 శాతం రైతులకు సబ్సిడీ అందడం లేదు. ఇలా విద్యుత్ సబ్సిడీ తీసేయడానికి తానే కారణం అని అప్పటి మంత్రి పేర్ని నాని, నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు ప్రచారం చేశారని రంగనాథరాజు మండిపడ్డారు.
తనే కారణం అని పేర్ని నాని దుష్ప్రచారం చేశారన్న రంగనాథరాజు
పేర్ని నాని మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో రంగనాథరాజు కూడా మంత్రిగా ఉండేవారు. మంత్రి పదవుల కోసం తమలో తాము కుట్రలు చేసుకోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. అక్వా రైతులకు సబ్సిడీ ఎత్తివేయడానికి తనే కారణం అని వారిద్దరూ ప్రచారం చేశారని మండిపడ్డారు. వాళ్లిద్దరూ తనపై బాంబేశారన్నారు. దేనికైనా మందు ఉంటుంది కానీ ఈర్ష్యకు ఉండదన్నారు. రంగనాథరాజు ఆరోపణలపై పేర్ని నాని, ప్రసాదరాజు స్పందించలేదు. రంగనాథరాజుతో పాటు పేర్ని నాని కూడా మంత్రి పదవి కోల్పోయారు. ప్రసాదరాజుకు పదవి దక్కలేదు.
వైఎస్ఆర్‌సీపీలో పెరిగిపోతున్న అసంతృప్తి
వైఎస్ఆర్‌సీపీలో ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. పార్టీ నేతల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఈ కారణంగా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలా విభేదాలు బయటపడుతున్న నియోజకవర్గాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.