Why Not ED Respond : ఎమ్మెల్సీ కవిత లేఖలపై స్పందించని ఈడీ - విచారణకు హాజరు కాకపోతే ఏం జరుగుతుంది ?
కవిత లేఖలకు ఈడీ స్పందిస్తుందా ? విచారణ వాయిదాకు అంగీకరిస్తుందా ? అంగీకరించకపోతే కవిత ఏం చేస్తారు ? విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తారా ?
Why Not ED Respond : ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ జారీ చేసిన నోటీసుల విషయంలో విచారణకు హాజరయ్యే విషయంలో కవిత సమయం కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు కానీ ఆమె.. పార్టీ పరమైన కార్యక్రమాలు, రాజకీయ ధర్నాల్లో పాల్గొనేందకు వచ్చారు. అయితే ఢిల్లీకి వచ్చే ముందు ఈడీకి రెండు లేఖలు రాశారు. బుధవారం ఉదయం న్యాయనిపుణులతో సంప్రదించిన తర్వాత తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్నాయని 15వ తేదీ తర్వాత హాజరు కాగలనని లేఖ రాశారు. కానీ ఈడీ నుంచి స్పందన లేదు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరే ముందు మరో లేఖ రాసినట్లుగా సమాచారం. 11వ తేదీనే విచారణకు హాజరవుతానని ఆమె ఆ లేఖలో పేర్కొన్నట్లుగా చెబుతున్నారు. దీనపై ఈడీ ఇంకా అధికారికంగా ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు.
రాజకీయ ధర్నాల కారణంగా విచారణకు రాలేనని చెప్పడం సరైన కారణం కాదంటున్న న్యాయనిపుణులు
బీఆర్ఎస్ పార్టీ తరపున జాతీయ వ్యవహారాలు చక్క బెడుతున్న కల్వకుంట్ల కవిత పదో తేదీన మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు. దాదాపుగా 18విపక్ష పార్టీల నేతలు ఈ ధర్నాకు హాజరవుతున్నారు. ఈ ధర్నాను భారత్ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తెలంగాణ జాగృతిని కవిత.. భారత్ జాగృతిగా మార్చి దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి సారి మహిళా రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాట్లను కవిత గురువారం చూసుకోనున్నారు. ఇతర విపక్ష పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ఇదే కారణం చెప్పి.. ముందుగా నిర్ణయించుకున్నందున విచారణకు హాజరు కాలేనని కవిత ఈడీకి లేఖ రాశారు. అయితే రాజకీయ ధర్నాల కారణంగా విచారణకు రాలేనని చెప్పడాన్ని ఈడీ అధికారులు ఒప్పుకోరని.. ఇలాంటి విషయాల్లో పండిపోయిన నిపుణులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతో హాజరు కాకపోవడాన్ని ఉద్దేశపూర్వకంగానే హాజరు కాకపోవడంగా భావిస్తారని అంటున్నారు.
ఈడీ రిప్లయ్ ఇవ్వకపోతే విచారణకు కవిత హాజరవుతారా ?
ఈడీకి రాసిన రెండు లేఖల విషయంలో స్పందన లేకపోతే ఏం చేయాలన్నదానిపై కవిత తరపు న్యాయనిపుణులు తర్జన భర్జన పడుతున్నారు. ఒక వేళ హాజరు కాకపోతే.. విచారణకు సహకరించడం లేదన్న కారణం చూపించడానికి ఈడీకి అవకాశం దొరుకుంది. ఇది అరెస్ట్ చేయడానికి తర్వాత బెయిల్ రాకుండా వాదించడానికి బలమైన అంశంగా మారుతుంది. అందుకే ఈడీ అంగీకరించకపోయినా.. సమాధానం ఇవ్వకపోయినా విచారణకు హాజరు కావడం మంచిదన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అయితే కవిత తరపు న్యాయవాదుల వ్యూహం.. కవిత ఏమనుకుంటున్నారన్న విషయం స్పష్టత లేదు.
రామచంద్రన్ పిళ్లైతో ముఖాముఖి విచారణ కోసం అని ప్రచారం !
అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనను కస్టడీకి తీసుకుంది. పిళ్లై తాను కవిత బినామీని అని అంగీకరించినట్లుగా ఈడీ చెబుతోంది. నిజానికి పిళ్లైను అరెస్ట్ చేయడానికే ముందే 20 రోజులకుపైగా ప్రశ్నించారు. చివరికి అరెస్ట్ చేశారు. అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే అరెస్ట్ చేశారని.. ఇప్పుడు పిళ్లైకు ఎదురుగా కవితను కూర్చోబెట్టడమో లేదా పిళ్లై చెప్పిన వివరాల ఆధారంగా ప్రశ్నించడమో చేయాలని ఈడీ భావిస్తోందని అంటున్నారు. పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నప్పుడే కవితను విచారణ చేయాలనుకుంటున్నారని అదుకే విచారణ వాయిదాకు ఈడీ అంగీకరించకపోవచ్చని చెబుతున్నారు.
మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో కల్వకుంట్ల కవిత విచారణ హాట్ టాపిక్ గామారింది. కవిత లేఖలకు ఈడీ స్పందిస్తుందా ? వాయిదాకు అంగీకరిస్తుందా ? అంగీకరించకపోతే కవిత ఏం చేస్తారు ? విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తారా ? ఇవన్నీ ఉత్కంఠ రేపుతున్నాయి.