Srikakulam Latest News: శ్రీకాకుళంలో కళింగ VS వెలమ!కూన రవికుమార్‌కు మద్ధతుగా దువ్వాడ! ధర్మాన, అచ్చెన్న ఫ్యామిలీపై ఫైర్!
Srikakulam Latest News:ఒక్క బదిలీ శ్రీకాకుళం రాజకీయాలను కెలికేసింది. రాజకీయ కక్ష సాధింపుల ఆరోపణల నుంచి కుల చిచ్చు వరకు చేరింది వ్యవహారం. జరుగుతున్న పరిణామాలపై దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Srikakulam Latest News: శ్రీకాకుళం జిల్లాలో వివాదాస్పదమైన ఓ కేజీబీవీ ప్రిన్సిపాల్ బదిలీ కొత్త మలుపు తిరిగింది. జిల్లాలో ఎప్పటి నుంచి నలుగుతున్న కళింగ వర్సెస్ వెలమ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ బదిలీ వ్యవహారంపై స్పందించిన దువ్వాడ శ్రీనివాస్‌సంచలన వ్యాఖ్యలు చేశారు. కళింగ నాయకులను తొక్కేస్తున్నారని ఆరోపించారు. ఇది జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.
శ్రీకాకుళం ప్రశాంతంతకు మారు పేరు. అక్కడ రాజకీయం కూడా అంతే కూల్‌గా ఉంటుంది. వివాదాలు పెద్దగా ఉండవు. కానీ ఈ మధ్య కాలంలో అమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. లోలుగు కేజీబీవీలో పని చేస్తున్న ప్రిన్సిపాల్ బదిలీ ఆయన మెడకు చుట్టుకుంది. ఆమెను కంచిలి కేజీబీవీకి బదిలీ చేయడంతో వివాదం రాజుకుంది. తనపై కక్ష పూరితంగా ఎమ్మెల్యే సిఫార్సుతోనే తనను బదిలీ చేశారని ప్రిన్సిపాల్ సౌమ్య ఆరోపించారు. అంతే కాకుండా ఆమె ఆత్మహత్యాయత్నం కూడా చేశారు.
సౌమ్య ఆత్మహత్యాయత్నంతో వివాదం రాజకీయ రంగు పులుముకుంది. వైసీపీ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకొని కూన రవికుమార్‌ను టార్గెట్ చేసింది. అధికారంలో ఉన్నామనే అహంకారంతో విచ్చలవిడిగా ఉద్యోగులపై కక్షసాధింపులకు దిగుతున్నారని వైసీపీ అనుకూల మీడియా స్టోరీలు ప్రచురించింది. ఇప్పటి వరకు రాజకీయాల్లో యాక్టివ్‌గా లేని ధర్మాన కృష్ణదాసు సౌమ్యను పరామర్శించారు.
కట్ చేస్తే సీన్‌లోకి వైసీపీ బహిష్కృత నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వచ్చారు. కూన రవికుమార్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణమని అలాంటి బదిలీల్లో వెళ్లేందుకు సిద్ధంగా ఉండే ఎవరైనా ఉద్యోగాల్లో చేరుతారని చెప్పుకొచ్చారు. కానీ సౌమ్య విషయంలో రాద్ధాంతం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని చెప్పుకొచ్చారు.
అటు కింజరాపు, ఇటు ధర్మాన ఫ్యామిలీపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు."జిల్లాలో వారం రోజులుగా ఒక ట్రాన్స్‌ఫర్ చర్చనీయాంశంగా మారింది. ఒక ట్రాన్స్‌ఫర్ కోసం ఇంత రచ్చ జరగడం ఎప్పుడూ చూడలేదు. కలెక్టర్ చేసిన ట్రాన్స్‌ఫర్‌పై ఎందుకు రచ్చ జరుగుతోంది. ట్రాన్స్‌ఫర్ సహజమే కదా. మరి ఇది ఎందుకు పొలిటికల్ వార్‌లా మారింది. కులాల ప్రస్తావన ఎందుకు వచ్చింది. దాడులు ఎందుకు జరుగుతున్నాయి? తటస్థ ఎమ్మెల్సీగా పరిశీలిస్తే చాలా విషయాలు వెలుగు చూశాయి. జిల్లావ్యాప్తంగా ఒక కులంపై దాడులు జరుగుతున్నాయి. టెక్కలి నియోజకవర్గంలో మరింత ఎక్కువగా ఉంది. అటెండర్ నుంచి ఆర్టీవో వరకు ఒక కులం వాళ్లే ఉన్నారు. అది మంత్రి కులానికి చెందిన వారు. మిగతా కులాలపై వేధింపులు సర్వసాధారణమైపోయాయి. నియంత్రుత్వపాలన సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. " అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కళింగ కులానికి చెందిన నాయకులు ఎదుగుదల చూడలే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్. మంత్రి అచ్చెన్న చెప్పిన వెంటనే కృష్ణదాసు సౌమ్యను పరామర్శించారని ఆరోపించారు. అచెన్న బాధితుడైన అధికారిని మాత్రం ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఆయన ఏమన్నారంటే" మంత్రి అచ్చెన్న నిర్వాకం అందరికీ తెలిసిందే. వ్యవసాయ పనిముట్లు ఇచ్చే కంపెనీలతో డైరెక్ట్ మీటింగ్ పెట్టమని పేషీలో ఉన్న రాజమోహన్‌పై ఒత్తిడి తెచ్చారు. అది ఆయన చేయలేక ఒత్తిడి భరించలేక లెటర్ సెలవుపై వెళ్లిపోయారు. దీనిపై కృష్ణదాస్ ఏం చేస్తున్నారు. ఆయన్ని ఎందుకు పరామర్శించలేదు. అచ్చెన్న చెప్పాడని సౌమ్యను పరామర్శించారు. రాజమోహన్ అనుభవించింది మానసిక ఒత్తిడి కాదా... మంత్రి అచ్చెన్నపై విమర్శలు చేయరా. ఎందుకు ఒకే కులాన్ని టార్గెట్ చేస్తున్నారు."
కులాన్ని టార్గెట్ చేస్తున్నారని తమ బుర్రల్లోకి వెళ్తే మాత్రం గేమ్ స్టార్ట్ చేస్తామని ధర్మాన, అచ్చెన్నకు వార్నింగ్ ఇచ్చారు దువ్వాడ. "ఎవడిపై రౌడీయిజం చేయాలని అనుకుంటున్నారు. ఇదే జరిగితే అది మా బుర్రల్లోకి ఎక్కింది అంటే మాత్రం కచ్చితంగా ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, అచ్చెన్నకు వార్నింగ్ ఇస్తున్నాను. మేం గేమ్ స్టార్ట్ చేస్తాం. మరో ఉద్యమం ప్రారంభమవుతుంది. జాతికి నష్టం జరుగుతుంటే కచ్చితంగా నేను నిలబడతాను. ఆ జాతితోపాటు మిగతా కులాలను అన్నింటినీ ఏకం చేస్తాం. ప్రాణత్యాగాలు చేయడానికైనా సిద్ధం. కొందరు చీడపురుగులను వాడుకొని కులంలో చిచ్చు రేపాలని చూస్తారు. వారిని కూడా టార్గెట్ చేస్తాం. కళింగ జాగృతి కోసం ముందడుగు వేస్తాం.
కళింగ కులస్తుడిని కాబట్టే వైసీపీ నుంచి తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు దువ్వాడ. తాను ఉన్నన్ని రోజులు వారికి మునుగడ ఉండదనే ఈ చర్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు. అయినా తాను వెనక్కి తగ్గబోనని అన్నారు. "నేను కళింగ కులానికి చెందిన వాడినని సస్పెండ్ చేశారు. స్పీడ్‌గా ఉంటానని సస్పెండ్ చేశారు. నేను ఉంటే వారి ఉనికి ఉండదని సస్పెండ్ చేశారు. నన్ను ఎదుర్కొని దమ్ము లేక సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే హైదరాబాద్ వెళ్లి బట్టలు మడత పెట్టుకుంటానని అనుకున్నారు. కానీ రాజకీయాలలో మడతేయడానికి వచ్చాను. కులాన్ని వాడుకోవాలనుకుంటే ఎప్పుడో వాడుకునే వాడిని. ఇప్పుడు మాత్రం అన్ని కులాలను వాడుకుంటాను. అన్ని కులాలకు నాయకత్వం వహిస్తాను. కళింగ కులానికి అన్యాయం జరగడంతో ఇతర కులాలు కూడా నష్టపోతున్నాయి. అన్ని కులాలకు బాసటా ఉంటూ ముందు ఉండి నడిపిస్తాం. " అని అన్నారు.





















