Why Nagababu Target Modi : మోదీపైనా నాగబాబు సెటైర్లు ! జనసేన డైరక్ట్‌గానే చెబుతోందా ?
బీజేపీ - జనసేన మధ్య దూరం పెరుగుతోందా ? మోదీపై నాగబాబు పరోక్ష సెటైర్ల వెనుక రాజకీయం ఉందా ?
Why Nagababu Target Modi : జనసేన నేత నాగేంద్ర బాబు ప్రధాని మోదీ, సీఎం జగన్ చిరంజీవి కన్నా గొప్పగా యాక్టింగ్ చేశారంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో రకరకాల విశ్లేషణలకు కారణం అవుతోంది. నాగేంద్రబాబు ఎవరి పేర్లూ చెప్పలేదు. చిరంజీవి పేరు మాత్రమే ప్రస్తావించారు. అయితే ఆయన నటించలేదని మాత్రం నగబాబు చెబుతున్నారు. ఇతరులు అందరూ నటించారని అంటున్నారు. వైదికపై ప్రధానంగా ఉంది ప్రధాని మోదీ, సీఎం జగన్. సీఎం జగన్‌తో రాజకీయంగా పోరాడుతున్నప్పటికీ.. ప్రధాని మోదీ మాత్రం మిత్రపక్షమే అయినా ఎందుకలా చేశారో జనసేన వర్గాలకూ పజిల్‌గానే మారింది.
చిరంజీవి మాత్రమే సహజంగా ఉన్నారని తేల్చిన నాగబాబు !
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణలో అగ్ర నటుడైన తన అన్న చిరంజీవి మాత్రమే సహజంగా వ్యవహరించారని మిగిలిన వాళ్లంతా సహజ నటుల్లా వ్యవహరించారని.. గొప్పగా నటించేశారని నాగబాబు విమర్శలు అందుకున్నారు. కార్యక్రమం పూర్తయిన jరెండు రోజుల తర్వాత ఆయన ఈ కామెంట్లు చేయడం సహజంగానే చర్చనీయాంశమయింది. నాగబాబు విమర్శలు ఎవరిపై చేశారో పేర్లు రాయలేదు. కానీ వేదికపై ఉన్న ప్రధాని మోదీ, సీఎం జగన్, మంత్రి రోజాతో పాటు ఇతరులు. వారందరూ గొప్ప స్థాయిలో నటించేశారని అంటున్నారు.
ప్రధాని మోదీనే అన్నారా ?
అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎక్కువ షో సహజంగానే ప్రధాని మోదీదే. చిరంజీవి సన్మానిస్తే ఆప్యాయంగా దగ్గరగా తీసుకుని దాదాపుగా ఓ నిమిషం పాటు బాగా పరిచయస్తుడైన మిత్రుడైనట్లుగా మాట్లాడారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత మోదీ స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందిన వృద్ధురాలి కాళ్లకు నమస్కారం పెట్టారు. అవి కూడా వైరల్ అయ్యాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాగబాబు నటన అంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది., అదే సమయంలో సీఎం జగన్ కూడా.. చిరంజీవి హత్తుకుని.. నా సోదరుడు.. సోదరుడు అంటూ ప్రసంగించారు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని నాగబాబు కామెంట్ చేశారని భావిస్తున్నా రు.
జగన్‌పై విమర్శలు రొటీన్ - ప్రధానిపై మాత్రం ఆశ్చర్యకరం !
జగన్ విషయంలో నాగబాబు ఎలాంటి కామెంట్లు అయినా చేయవచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్‌సీపీపై ఆయన పోరాడుతున్నారు. వైఎస్ఆర్‌సీపీని ఓడిస్తామని బహిరంగ సవాల్ చేస్తున్నారు. ఆ పార్టీపై రాజకీయ విమర్శలు సహజం. కానీ.. మోదీని పరోక్షంగా విమర్శించడం ఏమిటన్న అభిప్రాయం గట్టిగానే వినిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ.. జనసేన మిత్రపక్షం. ప్రధాని మోదీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ చెబుతూ ఉంటారు. అలాంటి మోదీపై పరోక్షంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనేది జనసైనికులకూ అర్థం కాని ప్రశ్న.
బీజేపీతో దూరం జరుగుతున్నామని చెబుతున్నారా ?
ఆహ్వానం అందినా పవన్ కల్యాణ్ అల్లూరి విగ్రహావిష్కరణకు వెళ్లలేదు. బీజేపీతో ఆయన బంధం వికటిస్తోందని అందుకే వెళ్లలేదన్న ప్రచారం జరుగుతోంది. అయితే ప్రధానిగా ఘనంగా స్వాగతం పలకాలని పవన్ పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని చెప్పి.. బీజేపీ కూడా జనసేన తమతోనే ఉందని అంటున్నారు. కానీ నాగబాబు కూడా పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు తెలియకుండా నాగబాబు ఇలాంటి విమర్శలు చేస్తారని జనసేన పార్టీ వర్గాలు కూడా అనుకోవడం లేదు. దీంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. అదేంటో తెలియాలంటే మరిన్ని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోవాల్సి రావొచ్చు.