(Source: ECI/ABP News/ABP Majha)
TDP Vs YSRCP : ఏపీలో విపక్షాలు ప్రజా సమస్యలపై పోరాడకూడదా ? టీడీపీ, జనసేన కార్యక్రమాలపై పోలీసులెందుకు విరుచుకుపడుతున్నారు ?
ఏపీలో విపక్ష పార్టీలు రాజకీయం చేయడం కష్టమైపోతోంది. ప్రజాసమస్యలపై ఎలాంటి పోరాటం పెట్టుకున్న పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నేతల్ని వెనక్కి పంపేస్తున్నారు.
TDP Vs YSRCP : ప్రజాస్వామ్యంలో అధికారం పొందిన పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు ప్రజా వ్యతిరేకతమైతే ప్రతిపక్షాలు పోరాడతాయి. ఇది డెమెక్రసీ. కానీ ప్రతిపక్షాలు పోరాడకుండా .. ప్రజాస్వామ్య నిరసనలను కూడా పోలీసుల సాయంతో అడ్డుకోవడం ఇప్పుడు కామన్ అయిపోతోంది. విపక్ష పార్టీలు రాజకీయ కార్యకలాపాలు చేపట్టకూడదన్నట్లుగా రాజకీయాలు మారిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. అధికార పార్టీగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నిరసనలు.. గర్జనలకు పిలుపునిస్తే ఏ సమస్యా ఉండటం లేదు. వాటి వల్ల సమస్యలొచ్చినా పోలీసులు చూసుకుంటున్నారు. కానీ విపక్ష పార్టీలు ప్రజా వ్యతిరేకత నిర్ణయాలపై రోడ్డెక్కుతామంటే మాత్రం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో ఏపీలో రాజ్యాంగం అమలు కావడం లేదని.. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని విపక్షాలు తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాయి.
రుషికొండ విధ్వంసంపై టీడీపీ పోరాటాన్ని అణిచివేసిన పోలీసులు !
రుషికొండ విషయంలో ప్రభుత్వం అన్ని రకాల నిబంధనలు ఉల్లంఘించి మరీ విధ్వంసం చేస్తోందని. ఈ విషయాన్ని ప్రజల ముందు ఉంచుతామని తెలుగుదేశం పార్టీ నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పి వారికి అనుమతి నిరాకరించారు. కానీ అదే పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు వైఎస్ఆర్‌సీపీ నేతలు విశాఖ గర్జన నిర్వహించారు. దానికి పోలీసులు అనుమతి ఇచ్చారో.. లేదో అసలు వైఎస్ఆర్‌సీపీ నేతలు అడిగారో లేదో కానీ పోలీసులు మాత్రం పెద్ద ఎత్తున సహకరించారు. అదే రోజున పవన్ కల్యాణ్ విశాఖకు వస్తే అభిమానులు ఘన స్వాగతం చెబితే.. ర్యాలీ నిర్వహించాలని కేసులు పెట్టారు. పవన్‌ను జనసేన పార్టీ నిర్వహించాలనుకున్న జనవాణిలో పాల్గొననీయకుండా వెనక్కి పంపేశారు. ఇప్పుడు తెలుగుదేశం వంతు. అధికార పార్టీ నేతలు తమ రాజకీయాలు.. ప్రతిపక్షానికి వ్యతిరేకంగా ఏ ఆటంకాలు లేకుండా చేసుకుంటున్నారు. కానీ ప్రభుత్వంపై పోరాడాల్సిన ప్రతిపక్షానికి మాత్రం ఆటంకాలు సృష్టిస్తున్నారు. దీంతో ప్రతిపక్షం గొంతు నొక్కేస్తున్నట్లవుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ఏపీలో విపక్ష పార్టీలు రాజకీయాలు చేసుకోకూడదా !?
ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న వి ప్రభుత్వం పై పోరాడి ప్రజల మెప్పును సంపాదించి అధికారం పొందాలనుకుంటాయి. అది వారి రాజ్యాంగ విధి. అయితే అధికార పార్టీ వారిని నియంత్రించాలనుకోవడం అదీ కూడా పోలీసు వ్యవస్థను ఉపయోగించి మరీ .. బలవంతంగా వారి వారి రాజకీయ కార్యక్రమాలు చేసుకోనివ్వకుండా చేయడం మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్య ఉల్లంఘనేనని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రుషికొండ ఏమైనా నిషేధిత ప్రాంతమా..? అక్కడికి వెళ్తే ప్రభుత్వానికి వచ్చే నష్టమేంటని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న విధ్వంసం ప్రజల ముందు ఉంచుతామనే అడ్డుకుంటున్నారని వారంటున్నారు.
చంద్రబాబు, పవన్‌లకు ఎన్నో సార్లు ఆటంకాలు !
వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చంద్రబాబు పల్నాడు పర్యటనను అడ్డుకున్నారు. విశాఖ, తిరుపతి విమానాశ్రయాల నుంచి వెనక్కి పంపారు. పవన్ కల్యాణ్‌ను విశాఖ నుంచి వెనక్కి పంపారు. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు ఏ ప్రజా సమస్యపైనైనా పోరాడితే వెంటనే పోలీసులు హౌస్ అరస్ట్ చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ మొత్తాన్ని విపక్షాన్ని కంట్రోల్‌లో ఉంచడానికే పని చేయిస్తున్నారని ఈ కారణంగానే విపక్షాలు విమర్శిస్తున్నాయి. గతంలో ఉన్న ప్రభుత్వాలు .. ప్రతిపక్షాల రాజకీయ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం ఏ మాత్రం చేయలేదని గుర్తు చేస్తున్నాయి. ఇలా చేయడం వల్ల .. నిర్బంధాలపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని గుర్తుంచుకోవాలని అంటున్నారు.
లోకేష్ పాదయాత్ర.. పవన్ బస్సు యాత్ర సజావుగా సాగుతాయా ?
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. జనవరి నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కానుంది. అదే సమయంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బస్సు యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. అయితే ప్రభుత్వ తీరు చూస్తూంటే వీరి యాత్రలకు కూడా అనుమతి ఇచ్చే అవకాశాలు ఉండవని.. కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకున్నా... పోటీ కార్యక్రమాలతో ఉద్రిక్తతలు రెచ్చగొట్టి వెనక్కి పంపిస్తుందన్న అనుమానాలు ఇప్పటి నుంచే ఆయా పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయంటున్నారు.