Andhra Pradesh Credit War: ఏపీలో క్రెడిట్ వార్ - ప్రభుత్వ విజయాల్లో వాటా కోసం వైసీపీ ఆరాటం - ఎందుకిలా ?
AP politics: ప్రభుత్వ విజయాల్లో వాటా కోసం వైసీపీ పోటీ పడుతోంది. ఏమీ చేయడంలేదని ఆరోపించే స్థాయి నుంచి చేసిన పనులను తమ వల్లే అని చెప్పుకునే స్థాయికి రాజకీయం మారింది.

Credit war between TDP and YSRCP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అధికార కూటమి, ప్రతిపక్షం వైసీపీ మధ్య క్రెడిట్ వార్ ఆసక్తికరంగా సాగుతోంది. ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల విజయాలను తమ ఖాతాలో వేసుకోవడం ద్వారా వైసీపీ ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడను అనుసరిస్తోంది.
భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ వార్
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మొదటి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి కావడం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిని తన కలల ప్రాజెక్టుగా, విజన్‌గా అభివర్ణిస్తుంటే.. వైసీపీ మాత్రం జగన్ హయాంలోనే 90 శాతం భూసేకరణ జరిగిందని, కోర్టు కేసులు పరిష్కరించి మేమే పనులు మొదలుపెట్టామని వాదిస్తోంది. ఈ క్లెయిమ్స్ ద్వారా, ప్రభుత్వం చేసే పనులు వాస్తవానికి తాము వేసిన పునాదులపైనే జరుగుతున్నాయని ప్రజలకు చెప్పడం వైసీపీ ప్రధాన ఉద్దేశ్యం.
ఇతర అభివృద్ధి పనుల్లోనూ క్రెడిట్ కోరుకుంటున్న వైసీపీ
రాయలసీమ జీవనాడి అయిన హంద్రీనీవా ప్రాజెక్టు విషయంలోనూ ఇదే తరహా వాదన వైసీపీ వినిపించింది. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టు ద్వారా సీమకు నీరందిస్తున్నామని చెబుతుండగా, వైసీపీ మాత్రం గత ఐదేళ్లలో తాము చేసిన ఖర్చు వల్లే ఇది సాధ్యమైందని క్లెయిమ్ చేస్తోంది. ప్రాజెక్టు విజయాలను ఓన్ చేసుకోవడం ద్వారా, వైసీపీ తను రాయలసీమ పక్షపాతి ' అనే ముద్రను కాపాడుకోవాలని చూస్తోంది. అదే సమయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూనే, విజయవంతమైన పనులను తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోంది.
గూగుల్ పెట్టుబడులపైనా క్రెడిట్ తీసుకున్న జగన్
ప్రస్తుత ప్రభుత్వం ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ప్రచారం చేస్తోంది. అయితే, వైసీపీ నాయకత్వం ఈ పెట్టుబడులన్నీ గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితమేనని వాదిస్తోంది. మేము తెచ్చిన కంపెనీలకు ఇప్పుడు చంద్రబాబు రిబ్బన్ కటింగ్ చేస్తున్నారు అనే ప్రచారం చేయడం ద్వారా.. రాష్ట్ర అభివృద్ధికి తామే అసలైన కారకులమని, ప్రస్తుత ప్రభుత్వం కేవలం పబ్లిసిటీకే పరిమితమైందని ప్రజల్లో ఒక ముద్ర వేయాలని వైసీపీ భావిస్తోంది. గూగుల్ పెట్టుబడి.. తమ వల్లే వచ్చిందని జగన్ స్వయంగా ప్రకటించుకున్నారు.
పరోక్షంగా ప్రభుత్వ విజయానికి అంగీకారమేనా?
వైసీపీ చేస్తున్న ఈ క్లెయిమ్స్ వెనుక ఒక ఆసక్తికరమైన కోణం ఉంది. ఒక పని విజయవంతమైందని తెలిసినప్పుడే ఎవరైనా ఆ క్రెడిట్ కోసం ప్రయత్నిస్తారు. అంటే, ఎయిర్‌పోర్టు రన్ సక్సెస్ అవ్వడం లేదా పెట్టుబడులు రావడం అనేది రాష్ట్రానికి జరిగిన మేలు అని వైసీపీ పరోక్షంగా అంగీకరిస్తోంది. ఆ సక్సెస్ క్రెడిట్ కూటమికి వెళ్తే తమ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది కలుగుతుందని భావించి, దానిని తమ హయాంలో జరిగిన కృషిగా మలచుకునే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూనే, అభివృద్ధి పనులను తమ ఖాతాలో వేసుకోవడం వల్ల ప్రజల్లో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వానికి వచ్చే పాజిటివ్ మైలేజీని తగ్గించడం ఈ క్రెడిట్ వార్ ప్రచారం వెనుక ఉన్న అసలు లక్ష్యం అనుకోవచ్చు.
ప్రభుత్వం తన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే, వైసీపీ మాత్రం ఆ విజయాల మూలాలు తమ హయాంలోనే ఉన్నాయని గట్టిగా వాదిస్తోంది. ఈ క్రెడిట్ వా 'లో అంతిమంగా ప్రజలు ఎవరి వాదనను నమ్ముతారో వేచి చూడాల్సిందే.





















