Palasa YSRCP : అప్పల్రాజు ఇలాఖాలో బల్ల గిరిబాబుకు అవమానం ! పలాసలో రచ్చ రచ్చ
పలాస వైఎస్ఆర్‌సీపీలో నేతల మధ్య విభేదాలు పెరిగిపోయాయి. ప్లీనరీలో మున్సిపల్ చైర్మన్‌కు అవమానం జరిగింది.
Palasa YSRCP : నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీల్లో పార్టీ అంతర్గత విభేదాలు బయట పడుతున్నాయి. తణుకు వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీలో అదే పార్టీకి చెందిన యువ విభాగం అధ్యక్షుడు మట్టా వెంకట్‌ను ఆహ్వానించకపోవడం వివాదం అయింది. ఆయనను పోలీసులు ఈడ్చుకెళ్లి బయటపడేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. అలాగే పలు చోట్ల విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా పలాస నియోజకవర్గంలో జరిగిన వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ వేదికపై మున్సిపల్ చైర్మన్‌ను ఆహ్వానించలేదు. ఆయనను కిందనే ఉంచేశారు.
బల్ల గిరిబాబును ప్లీనరీ వేదికపైకి పిలవని నేతలు
నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్న ప్రాంతం అయిన పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీకి చైర్మన్‌గా బల్ల గిరిబాబు ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం చూసినా... పదవి ప్రకారం చూసినా.., పార్టీలో ఆయన నియోజకవర్గ స్థాయి నేత. అయితే పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా ఆయనను కొంత కాలంగా దూరం పెడుతూ వస్తున్నారు. పలాస నియోజకవర్గానికి ప్రస్తుతం మంత్రి అప్పల్రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనతో కొన్ని విషయాల్లో విభేదించడంతో దూరం పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు అప్పల్రాజు కనుసన్నల్లోనే ప్లీనరీ జరగడంతో ఆయనకు ప్రాధాన్యం లేకపోయింది.
అల్లూరి విగ్రహావిష్కరణకు ఆహ్వానం - మోదీ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు !
అవమానించారని మున్సిపల్ చైర్మన్ వర్గీయుల ఆగ్రహం
మున్సిపల్ చైర్మన్‌గా తనకు తగిన మర్యాద లభిస్తుదని ప్లీనరీకి వెళ్లిన బల్ల గిరిబాబును కిందనే కూర్చోబెట్టారు. ప్లీనరీ కమిటీ సభ్యులు వేదికపైకి రావాలని అందర్నీ పిలిచినప్పటికీ బల్ల గిరిబాబును పిలవలేదు. మర్చిపోవడం కాని ఉద్దేశపూర్వకంగానే పిలవలేదని బల్ల గిరిబాబు వర్గీయులకు అర్థమయింది. వెంటనే వారు ఆందోళనకు దిగారు. దీంతో ప్లీనరీ వద్ద గందరగోళం ఏర్పడింది. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో పోలీసులు వారిని అక్కడి నుంచి పంపేశారు. తనకు తీవ్రంగా అవమానం జరిగిందని బల్ల గిరిబాబు అసంతృప్తితో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
హైటెన్షన్ వైరు ఉడత కొరికిందట, అధికారులు వెల్లడి - నారా లోకేశ్ దిమ్మతిరిగే కౌంటర్
శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్‌సీపీలో రోడ్డున పడుతున్న నేతల అసంతృప్తి
ఇటీవల అమ్మఒడి నిధులను బటన్ నొక్కి విడుదల చేయడానికి సీఎం జగన్ శ్రీకాకుళంలో పర్యటించారు. ఆ సమయంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణిని ప్రోటోకాల్ ఉన్నప్పటికీ ఆహ్వానించకపోవడంతో ఆమె కూడా జరిగిన అవమానం చాలని కంట నీరు పెట్టుకుని వెళ్లిపోయారు. ఈ పరిణామాలతో జిల్లా వైఎస్ఆర్‌సీపీలో అంతర్గత విభేదాలు పార్టీకి నష్టం చేరేలా మారాయన్న వాదన వినిపిస్తోంది.