(Source: Poll of Polls)
Cm Revanth Reddy: 'కేసీఆర్ కేంద్రంలో ఏం సంకీర్ణంలో చేరతారు?' - రైతు భరోసా అందిస్తే ముక్కు నేలకు రాస్తావా అంటూ సీఎం రేవంత్ రెడ్డి సవాల్
Telangana News: రైతు భరోసాపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇప్పటికే 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశామని.. ఈ నెల 8లోగా మిగిలిన వారికి జమ చేస్తామన్నారు.
Cm Revanth Reddy Slams Kcr: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీలో చేరతారని తాము మొదటి నుంచీ చెబుతున్నామని.. కేంద్రంలో బీజేపీ చేసిన అన్ని చట్టాలకు బీఆర్ఎస్ మద్దతిచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy) అన్నారు. కేంద్రంలోని ఏ సంకీర్ణంలో చేరతారో కేసీఆర్ (KCR) చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం భద్రాద్రి కొత్తగూడెం సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 'కాంగ్రెస్ ను అడ్డుకునేందుకు ఆ 2 పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి. రైతు భరోసా ఆగిపోయిందని కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారు. రైతు భరోసా కింద ఇప్పటికే 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేశాం. మిగిలిన రైతులకు ఈ నెల 8వ తేదీలోపు నగదు డిపాజిట్ చేస్తాం. ఈ నెల 9 లోగా ఒక్క రైతుకైనా బకాయి ఉంటే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణ చెబుతా. ఆ రోజున అమరవీరుల స్థూపం వద్ద చర్చ పెడదాం. ఒకవేళ అందరికీ రైతు భరోసా నిధులు పడితే నీ ముక్కు నేలకు రాస్తావా.?.' అంటూ కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఆగస్ట్ 15లోగా రైతు రుణమాఫీ అమలు చేసి హరీష్ రావు నోరు మూయిస్తామని అన్నారు.
'ప్రజలు అదే కోరుకుంటున్నారు'
రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ ను ఓడిద్దాం.. తెలంగాణను గెలిపించుకుందాం రండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. 'పోరాటాల్లో ఖమ్మం జిల్లాది ప్రత్యేక స్థానం. 1969 తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభం అయ్యింది. కేసీఆర్ వైఖరిని ప్రజలు ముందే పసిగట్టారు. అందుకే 2014, 19, 23ల్లో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టారు. ఇక్కడి ప్రజలు చైతన్యవంతులు. ముందుచూపు ఎక్కువ. తెలంగాణకు పదేళ్ల పాటు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ. ఈ పదేళ్లలో రాష్ట్రానికి ఒక్కటైనా ఇచ్చారా.?. రాజ్యాంగాన్ని మారుస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాని కార్యదర్శే చెప్పారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందుకు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. హస్తం పార్టీ అధికారంలోకి వస్తేనే రిజర్వేషన్లు పెరుగుతాయి. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన కాషాయ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. సెమీ ఫైనల్స్ లో బీఆర్ఎస్ ను ఓడించాం. ఇక రానున్న ఫైనల్స్ లో బీజేపీని ఓడించి ఛాంపియన్ షిప్ గెలవాలి.' అని రేవంత్ పిలుపునిచ్చారు.
'అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చారు'
మాజీ సీఎం కేసీఆర్ రూ.7 లక్షల కోట్లతో అప్పుల రాష్ట్రాన్ని తమకు అప్పగించారని సీఎం రేవంత్ మండిపడ్డారు. భట్టి విక్రమార్క గట్టి వ్యక్తి కనుకే రైతు బంధు, ఇతర సంక్షేమ పథకాలకు నిధులు సర్దుతున్నారని చెప్పారు. తమ హయాంలో అన్ని వర్గాల ఉద్యోగులకు ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను గెలిపించేందుకు కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Also Read: Cm Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వేముల రోహిత్ తల్లి - న్యాయం చేయాలని వేడుకోలు