TDP Plan : చంద్రబాబు యాత్ర - లోకేష్ పాదయాత్ర ! ఎన్నికల వరకూ జనంలోనే టీడీపీ !
చంద్రబాబు యాత్ర - లోకేష్ పాదయాత్రలతో ప్రజల్లోకి వెళ్లాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. టీడీపీ వ్యూహకమిటీ సమావేశంలో తదుపరి కార్యాచరణపై చర్చించారు.
మహానాడు ఊహించిన దాని కన్నా ఎక్కువ సక్సెస్ అయిందని అంచనాకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు తదుపరి కార్యచరణపై సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అప్పటి వరకూ జనంలోనే ఉండాలన్న లక్ష్యంతో ఆ పార్టీ అగ్రనేతల ప్రచారం ఉండనన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబందించి ఇప్పటికే ఉన్నత స్థాయిలో చర్చలు పూర్తి చేశారు. చంద్రబాబు యాత్ర, లోకేష్ పాదయాత్ర, అచ్చెన్నాయుడు జిల్లాల పర్యటనలు ఇలా పూర్తి స్థాయిలో రాజకీయ కార్యకలాపాలు చురుకుగా ఉండాలని భావిస్తున్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చంద్రబాబు పర్యటనలు!
చంద్రబాబునాయుడు జిల్లాల యాత్రలు ఇప్పటికే ప్రారంభించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పర్యటించారు. కార్యకర్తలు, నేతల సమావేశాలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటనలు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పొలిట్ బ్యూరో చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రతీ నెలకు రెండు, మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించి.. అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్ది.. అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వనున్నారని చెబుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం తీరుపై ఉద్యమం చేస్తూనే మరో వైపు పార్టీని అంతర్గతంగా ఎన్నికలకు సిద్ధం చేయాలని చంద్రబాబు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
లోకేష్ పాదయాత్రపై చర్చలు !
మరో వైపు లోకేష్ పాదయాత్ర చేయాలన్న సూచనలు పార్టీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. నేరుగా లోకేష్ కూడా ఈ అంశంపై స్పందించారు. పాదయాత్ర చేయాలా... బస్సు యాత్ర చేయాలా అన్నది పార్టీ నిర్ణయిస్తుందని.. పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా నెరవేరుస్తానని లోకేష్ మహానాడులో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వ్యాఖ్యానించారు. మరో వైపు పార్టీలో యువతనేతలంతా కలిసి పాదయాత్ర చేయడం ద్వారా యువతను ఆకట్టుకోవచ్చన్న ఆలోచన కూడా జరుగుతోంది. దీనపైనా ఓ నిర్ణయం తీసుకున్నారని విధి విధానాలను ఖరారు చేసుకున్న తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు.
అచ్చెన్న కూడా యాత్ర చేస్తారా ?
ఓ వైపు చంద్రబాబు జిల్లాల పర్యటన... లోకేష్ పాదయాత్రతో పాటు మరో వైపు ఇతర జిల్లాల్లో పార్టీ కార్యకలాపాలు ఏ మాత్రం నెమ్మిదించకుండా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేలా అచ్చెన్నాయుడు కీలక బాధ్యతలు తీసుకోతున్నట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు, లోకేష్ , అచ్చెన్న ముగ్గురూ మూడు రకాల ప్రచావ్యూహాలతో రంగంలోకి దిగుతారని ఎక్కడ చూసినా టీడీపీ గురించి చర్చ జరిగేలా చూసుకుంటారని అంటున్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండేందుకే !
సీఎం జగన్ మనస్థత్వం, వ్యవహారశైలిని విశ్లేషించుకుంటున్న టీడీపీ నేతలు.. ఏ క్షణమైనా జగన్ అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటారని... కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండేలా ఇప్పటి నుండే కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి టీడీపీ ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేసింది. టాప్ గేర్‌లో ఎన్నికల వరకూ ప్రజాక్షేత్రంలోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.