Chodavaram TDP Sabha : పన్నులతో బాదుతున్న జగన్‌ను తిరిగి బాదాలి - చోడవరంలో చంద్రబాబు పిలుపు
రాష్ట్రం మళ్లీ గాడిలో పడాలంటే తెలుగుదేశం పార్టీ రావాలని చంద్రబాబు అన్నారు. పన్నులతో బాదుతున్న జగన్‌ను తిరిగి బాదాల్సిన సమయం వచ్చిందన్నారు.
Chodavaram TDP Sabha : జగన్మోహన్ రెడ్డి ఫేక్ పాలన చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినతే చంద్రబాబు మండిపడ్డారు. చోడవరంలో మినీ మహానాడులో పాల్గొని ప్రసంగించారు. పరిపాలనలో ఓనమాలు తెలియని వ్యక్తి జగన్ .. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు. మీ ఊళ్లో ఒక రోడ్డు వేసినా, మంచి నీటి పథకం వచ్చినా, సాగునీరు వచ్చినా టిడిపి వల్లనేనేనన్నారు. రాష్ట్రంలో సామాజిక న్యాయం తెచ్చింది ఎన్టీఆర్...ఎర్రం నాయుడుని కేంద్ర మంత్రిని చేసింది టిడిపి. అయ్యన్న పాత్రుడు లాంటి వారికి అవకాశాలు ఇచ్చింది టిడిపి అని గుర్తుచేశారు. ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఎవరు పెత్తనం చేస్తున్నారని ప్రజల్ని ప్రశ్నించారు. ఎ2 ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. ఎ2కు ఇక్కడ ఏంపని? విశాఖలో తట్ట మట్టి వెయ్యలేని జగన్ మూడు రాజధానులు కడతా అంటున్నాడని.. రాష్ట్రంలో రోడ్ల గుంతలకు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
ఉత్తరాంధ్రపై ఏ-2 , సుబ్బారెడ్డి పెత్తనం ఏమిటి ?
విజయసాయిరెడ్డి పోయి సుబ్బారెడ్డి వచ్చాడు. ఉత్తరాంధ్రపై వీళ్ల పెత్తనం ఏంటి? ఇదే సామాజిక న్యాయం అంటున్న వైసిపికి ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్క సీటు గెలిపించకుండా బుద్ది చెపుతారన్నారు. బంగారం లాంటి కోనసీమలో క్రాప్ హాలిడే కి కారణం ఎవరు? ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కూడా క్రాప్ హాలిడే ఇచ్చారు. రైతులకు ఇన్స్యూరెన్స్ అని జగన్ ఉత్తిత్తి బటన్ నొక్కుతున్నాడు. దైర్యం ఉంటే నిజమైన బటన్ నొక్కు...వివరాలు అన్నీ బహిరంగ పరుచు అని చంద్రబాబు సవాల్ చేశారు. ప్రజల కట్టే ట్యాక్సులతో సొంత పేపర్ లకు ప్రకటనలు ఇస్తున్నాడన్నారు. టీచర్ల పోస్టులు ఎందుకు భర్తీ చెయ్యడం లేదు...టీచర్లను బ్రాందీ షాపుల వద్ద పెట్టినప్పుడే వ్యవస్థ కుప్పకూలింది. తల్లితండ్రి తరువాత గౌరవించే గురువులను జగన్ పంగనామాలు పెట్టి అవమానించాడు. విద్యా వ్యవస్థను నాశనం చేశారు....టెన్త్ లో ఎందుకు ఇంత మంది ఫెయిల్ అయ్యారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ సిఎంగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టరు.....ఉద్యోగాలు రావన్నారు. తెలుగు దేశం ఐటి ఉద్యోగాలు ఇస్తే... జగన్ వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడని.. మనం 50 వేలు జీతం వచ్చే ఉద్యోగాలు ఇస్తే...జగన్ 5 వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇచ్చాన్నారు. రాష్ట్రంలో యువత బయటకు రావాలి.. జగన్ ను రాజకీయాల నుంచి వెళ్లగొట్టాలని పిలుపునిచ్చారు.
సీఎంగా మద్యం బ్రాండ్లు తేవచ్చనే ఆలోచనే రాలేదు!
మద్యంలో అవినీతి కొత్త చరిత్ర...ఇలా కూడా చెయ్యవచ్చా అని నాకే అనిపించింది. మద్యంలో సొంత బ్రాండ్లు తేవచ్చు అని ఎప్పుడూ ఎవరూ ఊహించలేదు. మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్, షాపులు నిర్వహణ అన్నీ జగనే చేస్తున్నాడు. ప్రజలు తాగే మద్యం లో జగన్ వాటా నేరుగా ఆయనకే వెళ్లిపోతుందని ఆరోపించారు. జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 29 మంది చనిపోతే వాటిని జగన్ సహజమరణాలు అన్నారని.. జగన్ కు ప్రజల ప్రాణాలు అంటే విలువ లేదన్నారు. ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ చార్జి పెంచారు. చెత్త పన్ను వేశారు. ఇప్పుడు వాహనాల ఫ్యాన్సీ నెంబర్ కూడా పెంచారు. మనల్ని పన్నులతో బాదుతున్న ముఖ్యమంత్రిని ప్రజలు తిరిగి బాదాలని పిలుపునిచ్చారు.
వైసీపీ వల్ల పోతున్న ప్రతీ ప్రాణానికి జగన్‌దే బాధ్యత
4 గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారు. 60 మంది ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టారు. పల్నాడులో బడుగులను చంపేస్తున్నారు. ఇది మనం తిరుగుబాటు చెయ్యాల్సిన సమయం వచ్చిందన్నారు. వివేకా హత్య కేసులో సాక్షులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాక్ష్యులను కూడా బతకనివ్వడం లేదన్నారు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి....సరెండర్ లీడ్స్ వస్తున్నాయా, డిఎలు వస్తున్నాయా....పిఎఫ్ వస్తుందా అని ప్రశ్నించారు. విశాఖ ఎయిర్ పోర్టు లో కొడి కత్తి దాడి జరిగింది...ఇప్పుడు ఏమయ్యింది. కోడికత్తి నాటకం తో జగన్ సానుభూతి సంపాదించాడు...బాబాయి హత్య నాపై నెట్టి సానుభూతి పొందాడని మండిడ్డారు. దళిత డ్రైవర్ ను చంపిన ఎమ్మెల్సీకి పాలాభిషేకం చేసిన వైసిపి తమకు ఏం గతి పడుతుందో గుర్తుపెట్టుకోవాలనిహెచ్చరించారు. జగన్ కారణంగా పోతున్న ప్రతి ప్రాణం జగన్ కు ఉరితాడు అవుతుందన్నారు.
పోలీసులా .. వైసీపీ గూండాలా ?
కోనసీమపై సిగ్గుంటే చర్యలు తీసుకోవాలి...చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలి. కొంత మంది పోలీసులు తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసిన పార్టీ నేతల పేరు చెప్పమని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. విచారణలో పోలీసులు బ్యాడ్జ్ పెట్టుకోకపోతే వాళ్లు పోలీసులా...వైసిపి గూండాలా...ఎలా తెలుస్తుంది. తప్పు చేస్తున్న పోలీసులకు ఎవరినీ వదిలేది లేదు. జగన్ మాట వింటే పోలీసులు జైలుకు వెళతారు. సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించకుండా తప్పు చేస్తే పోలీసులు మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. మాట వివని పోలీసులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడితే అధికారం వచ్చిన తరువాత అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
రేట్లు ఎందుకు పెరిగాయో గడప గడపకూ నిలదీయాలి !
ఎందుకు ఇసుక రేటు పెరిగింది, ఎందుకు మద్యం రేటు పెరిగింది...ఎందుకు ధరలు పెరిగాయి అని ప్రజలు వైసిపి నేతలను నిలదీయాలని చంద్రబాబు సూచించారు. పోరాటానికి సిద్దంగా ఉన్నాను. యువత కలిసి రావాలి. ప్రతి ఇంట్లో జెండా పట్టుకోవాలన్నారు. జగన్ రెడ్డి నాకు వయసు అయిపోయింది అనుకుంటున్నాడు. నేను అందరికంటే ఎక్కువ పని చేస్తా....ఉదయం నుంచి రాత్రి వరకు అంతే ఉత్సాహంగా పనిచేస్తా నా అవసరం రాష్ట్రానికి ఉందని నాడు బ్లాస్టింగ్ లో వెంకటేశ్వర స్వామి నన్ను బతికించారని గుర్తు చేశారు. 2014లో 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా...ఎక్కడా లోటు లేకుండా పాలన చేశాను. రాష్ట్రాన్ని జగన్ 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు...మళ్లీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత టిడిపి తీసుకుంటుందన్నారు.