Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు
బస్టాండ్ కూడా కట్టలేని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు కడతారంటా అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎద్దేవా చేశారు.
![Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు Chandrababu In Kadapa: Chandrababu questions AP CM YS Jagan over busstand to Pulivendula people Chandrababu In Kadapa: జగన్ పులివెందులలో బస్టాండ్ కట్టలేదు, కానీ 3 రాజధానులు కడతారా: చంద్రబాబు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/18/bf7d5bba7cc986d337aa29b444ee8d0a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పులివెందులలో ప్రజలకు బస్టాండ్ కూడా కట్టలేని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు కడతారంటా అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఎద్దేవా చేశారు. సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి కేసును తేల్చలేని సీఎం జగన్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడో అర్థం కావడం లేదని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు. నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ప్రయివేటు ఫంక్షన్ హల్‌లో కార్యకర్తలతో సమావేశం సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం జగన్ ప్రజల నడ్డి విరిచేలా బాదుడే బాదుడు చేస్తూ అన్ని వస్తువుల రేట్లు ఆకాశాన్ని అంటేలా చేస్తున్నాడని మండిపడ్డారు. ప్రజల నాడి అప్పుడే అర్థం అవుతుందని సీఎం జగన్‌ను ఓటర్లు గద్దె దించడం ఖాయమన్నారు.
సొంత చిన్నాన్న కేసును తేల్చలేని సీఎం జగన్ రాష్ట్రానికి ఏమి న్యాయం చేస్తాడో అర్థం కావడం లేదని మాజీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో జిల్లాకు ఒక సైకో తయారు చేశారని అధికారంలోకి రాగానే వారిని కట్టడి చేస్తామన్నారు. కడపలో కూడా ప్రజలు నేడు టీడీపీ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలి వచ్చారన్నారు. ఏపీలోని వ్యక్తులకు కాదని తెలంగాణ వారికి రాజ్యసభ పదవులు ఇవ్వడం హేయనియం అన్నారు. పులివెందులలో ప్రజలకు బస్టాండ్ లేకుండా చేసిన సీఎం జగన్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. పులివెందులలో తాగునీరు ఇవ్వలేని జగన్ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు.
బాదుడే బాదుడు ప్రతి ఇంటికి చేరింది..
ప్రజల నాడి చూస్తే జగన్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే బాదుడే బాదుడు ప్రతి ఇంటికి చేరిందన్నారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు కూడా బాదుడే బాదుడు అని సెటైర్లు వేశారు. కడపలో ఉత్సహం రెట్టింపు అయిందని, నియంతలు అందరూ కాల గర్భంలో కలిసిపోయారని వ్యాఖ్యానించారు చంద్రబాబు. మూడు సంవత్సరాల్లో జగన్ అరాచకాలు అంతా ఇంత కాదు. జగన్ పాలనలో వీర బాదుడుతో పాటు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పోలీసులను అడ్డుపెట్టి కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప జిల్లా కాజీపేట లో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో https://t.co/65iXwFYnCP
— Telugu Desam Party (@JaiTDP) May 18, 2022
భూకబ్జాలు పెరిగిపోయాయి...
జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో భూకబ్జాలు పెరిగిపోయాయి. దీపం కింద వంట గ్యాస్ లు ఇస్తే జగన్ సీఎం అయ్యాక దీపం ఆర్పేశాడు. ప్రజలు కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కార్యకర్తలు వారికి అండగా నిలబడాలి. కానీ సామాన్యులపై బాదుడే బాదుడుగా పాలన సాగిస్తున్నాడన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, నిన్న కర్నూల్ లో సోలార్ పార్క్ కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారని.. గతంలో తాను సీఎం గా ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే దాన్ని వైఎస్ జగన్ మళ్ళీ ప్రారంభించారని గుర్తుచేశారు. ఈ 3 సంవత్సరాల్లో సోలార్ ప్రాజెక్టు పూర్తి చేసింటే ఇప్పుడు కరెంట్ కష్టాలు ఉండేవి కాదన్నారు.
‘దేశంలో ఎక్కడా లేని పెట్రోల్, కరెంటు ధరలు ఏపీలో ఉన్నాయి. రాష్ట్రంలో ట్యాక్స్ వేస్తూ బాదుడే బాదుడు చేస్తున్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరినీ ఒకటి చేయాల్సిన బాధ్యత టీడీపీ కార్యకర్తలపై ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే 8 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత సీఎం జగన్ సొంతం. రాష్ట్రానికి అప్పులు ఇవ్వడానికి కేంద్రం కూడా వెనకడుగు వేస్తోంది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని అడ్డుపెట్టుకుని 43 వేల కోట్ల రూపాయలు అవినీతి చేసిన వ్యక్తి జగన్. పాదయాత్రలో ముద్దులు పెట్టుకుంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు ప్రజలకు గుద్దులే గుద్దులు ఇస్తున్నాడని’ చంద్రబాబు ఎద్దేవా చేశారు.
లంకలో రాజపక్షేను, ఏపీలో జగన్‌ను..
శ్రీలంకలో రాజపక్షేని ప్రజలు తరిమి కొట్టారు.. ఏపీలో కూడా జగన్ కు అలాంటి పరిస్థితి వస్తుందన్నారు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను అడ్డంకులు కలిగించి ఉంటే ఇడుపులపాయ నుంచి బయటికి వచ్చే వాడు కాదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కు ఒక్కటే అడుగుతున్న.. వైసీపీ వారికి విజ్ఞత ఉంటే అభివృద్ధికి ఖర్చు చేసేవారన్నారు. రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేస్తే దానికి మళ్ళీ జగన్ శంకుస్థాపన చేశారు. రాయలసీమ రాళ్ళ సీమగా మారకూడదని అప్పట్లో ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చారు. రాయలసీమ సస్యశ్యామలంగా ఉండాలని ఎన్నో ప్రాజెక్టులు తెచ్చాము. కానీ గండికోటలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇంతవరకు సీఎం జగన్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
పవర్ ఫుల్ ప్లేసులో పవర్ ఫుల్ లీడర్ అడుగు పెడితే ఇట్లుంటది. #CBNInKadapa2022 pic.twitter.com/1pJffMCKm2
— Telugu Desam Party (@JaiTDP) May 18, 2022
బాబాయి హత్య, చెల్లిని మోసం..
సీఎం జగన్ సొంత చిన్నాన్న హత్య ను ఆత్మహత్య గా చిత్రీకరించారని, సొంత చెల్లినే మోసం చేసిన ఘనత జగన్ సొంతమన్నారు చంద్రబాబు. సిబిఐ డ్రైవర్ ను కూడా కొంత మంది చంపుతామని బెదిరించారు. పోలీసులను చూస్తే జాలేస్తుందన్నారు. సిబిఐ పైనే బాంబులు వేస్తే మీ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెరు పెట్టి ఉన్న ప్రాజెక్టులు పోగొట్టే పరిస్థితి ప్రస్తుతం ఉంది. పోలవరం ఇప్పుడు ఎత్తిపోయింది. పోలీసులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని, ప్రజల్లో చాలా ఆవేదన బాధ ఉందని పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)