Roja : ఆశలు హై - అంచనాలు నై ! మంత్రి పదవి రాకపోతే రోజా తట్టుకుంటారా ?
మంత్రి పదవి రాకపోతే రోజా కూల్‌గా ఉండగలరా ? మంత్రి పదవికి సొంత పార్టీ నేతలే అడ్డు పుడతున్నారన్న ప్రచారంతో ఆమె అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఉంటారా ?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మంత్రి పదవులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. చాలా మంది ఆశావహులు తమకు చాన్స్ వస్తుందని ఆశపడుతున్నారు. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట మొదటి నుంచి నడిచిన నేతలు కొంత మంది ఉన్నారు. వారు తమకు పదవి గ్యారంటీ అని భావిస్తున్నారు. అలాంటి వారిలో రోజా, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి వారు ఉన్నారు. మిగతా వారి సంగతేమో కానీ రోజా వైపే అందరి దృష్టి పడింది. ఆమెకు మంత్రి పదవి వస్తుందా ? రాకపోతే ఆమె తట్టుకోగలరా అనేదానిపై ఎక్కువ చర్చ జరుగుతోంది.
రోజాకు మంత్రి పదవి కష్టమేనని ప్రచారం !
అందరి దగ్గర రాజీనామా పత్రాలు తీసుకోవడంతో కొత్త మంత్రులు ఎవరు.. అనే విశ్లేషణ అన్ని వర్గాల్లోనూ జరుగుతోంది. అయితే ఎక్కడా రోజా పేరు ప్రధానంగా వినిపించడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవుల్లో రెడ్డి సామాజికవర్గానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని డిసైడయ్యారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమమయంలో జిల్లాల సమీకరణాలు కూడా కలిసి రాకపోవడం వల్ల రోజాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆమెకు మంత్రి పదవి ఇవ్వడానికి వ్యతిరేకంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏ విధంగా చూసినా రోజాకు మంత్రి పదవి రాదని.. జగన్ స్వయంగా అవకాశం ఇవ్వాలనుకుంటే లక్ తగలవచ్చని భావిస్తున్నారు.
ఆశలు పెట్టుకుని గుళ్లూ గోపురాల చుట్టూ తిరుగుతున్న రోజా !
మంత్రి పదవిపై రోజా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వైసీపీ గెలిచినప్పుడే తనకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు. కానీ చాన్స్ రాకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. అప్పట్లోనే వైసీపీ హైకమాండ్ బుజ్జగించింది. ఎపీఐఐసీ చైర్మన్ పదవి ఇచ్చింది. అయితే ఆ పదవీ కాలం ముగిసిన తర్వాత రెన్యూవల్ చేయలేదు. బహుశా మంత్రి పదవి ఇస్తారేమోనని అప్పట్లో అనుకున్నారు. ఇప్పుడు మంత్రి పదవులు భర్తీ చేసే సమయం ముంచుకు వచ్చింది. అందుకే కొంత కాలంగా ఆమె ఆలయాల చుట్టూ తిరుగుతూ పూజలు చేస్తున్నారు.
జగన్ వెంట మొదటి నుంచి నడిచిన రోజా.. ప్రతిపక్ష నేతగా పోరాటం !
మొదటి నుంచి జగన్ వెంట నడిచిన అతికొద్ది మంది నేతల్లో రోజా ఒకరు. టీడీపీ నుంచిపోటీ చేసి ఓడిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్‌లో ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే హఠాత్తుగా వైఎస్ చనిపోయారు. ఆ తర్వాత ఆమె జగన్ వెంట నడిచారు. టీడీపీతోనే రాజకీయ జీవితం ప్రారంభించినా... అలాంటిదేమీ మనసులో పెట్టుకోకుండా తన దూకుడును చూపించేవారు. చంద్రబాబునూ వదల్లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యేగా చాలా కష్టపడ్డారు. ఢీ అంటే ఢీ అన్నారు. ఈ పోరాటంతో పాటు.. విధేయతను చూసి జగన్ మంత్రి పదవి ఇస్తారని రోజా ఆశలు పెట్టుకున్నారు.
టీడీపీలోనే ఉండి ఉంటే !?
రోజా టీడీపీలోనే ఉండి ఉంటే.. 2014 నుంచి 2019 వరకూ మంత్రిగా ఉండేవారని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తూ ఉంటాయి. పార్టీలో ఆమె చంద్రబాబు ఆమెను చాలా ప్రోత్సహించారని గుర్తు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చే సమయంలో ఆమె పార్టీలో ఉండి ఉంటే.. మహిళా కోటా.. రెడ్డి సామాజకివర్గ కోటా కింద ఖచ్చితంగా పదవి వచ్చి ఉండేదని అంచనా వేస్తున్నారు. రోజాలో ఇలాంటి ఆలోచన ఉందేమో కానీ జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని గట్టిగా ఆశిస్తున్నారు.
పదవి రాకపోతే రోజా కంట్రోల్‌లో ఉండగలరా !?
జగన్ మంత్రి పదవి ఇవ్వకపోతే రోజా ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీలో చర్చనీయాంశమవుతోంది. ఆమె దూకుడైన నేత. తనకు అన్యాయం జరిగిందని భావిస్తే ఊరుకోరని ఆమె నైజం తెలిసిన వాళ్లు అంటున్నారు. అయితే ఆమె జగన్‌పై ఘాటు భాషను ప్రయోగించకపోవచ్చు కానీ అసంతృప్తి వ్యక్తం చేయకుండా ఉండరని అంటున్నారు. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు పదవిఇచ్చినా ఇవ్వకపోయినా వైఎస్ఆర్‌సీపీ తప్ప మరో చాయిస్ లేదంటున్నారు.