BRS In Karnataka : నేరుగా పార్లమెంట్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ పోటీ - కర్ణాటకలో జేడీఎస్‌కు కేసీఆర్ ప్రచారం కూడా !
నేరుగా పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ లోపు జరిగే ఎన్నికల్లో తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల్లో భావసారూప్య పార్టీలకు మద్దతు ప్రకటించనున్నారు.
BRS In Karnataka : భారత్ రాష్ట్ర సమితి నేరుగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ లోపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు, ఉపఎన్నికల్లో పోటీ చేయడం కన్నా.. భావసారూప్య పార్టీలకు మద్దతు ఇవ్వడం మంచిదని నిర్ణయించారు. జాతీయ లక్ష్యాలతో పార్టీ పెడుతున్నారు కాబట్టి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా దృష్టి పెట్టకపోవడం మంచిదని భావిస్తున్నారు. అందుకే రాబోయే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయడం కన్నా.. జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఒక్క తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ పోటీ చేయనుంది.
తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువ ఉన్న చోట్ల పట్టుకు బీఆర్ఎస్ ప్రయత్నం
కర్ణాటకలో తెలుగు మూలాలు ఉన్న ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాలపై బీఆర్ఎస్ ప్రధానంగా దృష్టి పెట్టి జేడీఎస్‌కు సహకారం అందించనుంది. హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని బీదర్, యుద్గీర్, రాయచూర్, కొప్పాల, కలబురిగి, బళ్లారి-విజయపుర జిల్లాల్లో తెలుగువారు ఎక్కువగా ఉన్నారు. కర్ణాటక జనాభాలో దాదాపు 15 శాతం మంది తెలుగు మాట్లాడే వారు ఉంటారు. 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న బెంగళూరులో కూడా భారీ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 శాసనసభా నియోజకవర్గాలలో 14 పార్లమెంట్ స్థానాల్లో తెలుగువారి ఓట్లు ప్రభావం ఉన్నట్లుగా బీఆర్ఎస్ అధినేత గుర్తించినట్లుగా తెలుస్తోంది.
జేడీఎస్‌కు మద్దతుగా కేసీఆర్ కూడా ప్రచారం !
కర్ణాటకలో జేడీఎస్ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. కానీ రెండు జాతీయ పార్టీలు ఇంకా బలంగా ఉన్నాయి. కర్ణాటకలో లింగాయత్‌లు ఎవరి వైపు ఉంటే వారికే అధికారం లభిస్తుంది. టీఆర్ఎస్ తరపున జహీరాబద్ నుంచి ఎంపీగా ఉన్న బీబీ పాటిల్ కూడా లింగాయత్ వర్గానికి చెందినవారే. ఆయన నేతృత్వంలోనే జేడీఎస్ కు అన్ని విధాలుగా .. సాయం అందించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. అలాగే కర్ణాటకలో మెడికల్ కాలేజీలు సహా పలు విద్యా సంస్థలు ఉన్న నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి కూడా కీలక బాధ్యతలు ఇప్పగించినట్లుగా తెలుస్తోంది. కన్నడ భాషపై పట్టుకలిగిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలకు ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరవాత కేసీఆర్ కూడా కర్ణటాకలో బీఆర్ఎస్- జేడీఎస్ తరపున ప్రచారం చేయనున్నారు
అసెంబ్లీ ఎన్నికల్లో సహకారమేనా ? పోటీ కూడానా ?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, జేడీఎస్ పొత్తు ఖాయమయింది.. కానీ అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని తెలుస్తోంది. జేడీఎస్ ను గెలిపించడానికి.. కుమారస్వామిని సీఎం చేయడానికి కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కుమారస్వామి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయదని.. అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ కర్ణాటకల్లో కొన్ని సీట్లలో పోటీ చేస్తుందని ఆయన చెప్పినట్లుగా కర్ణాటక మీడియా వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ ప్రస్థానానికి 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలను వేదికగా మల్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ లోపు వచ్చే అసెంబ్లీ, ఉప ఎన్నికల్లో స్థానికంగా కలిసి వచ్చే భావసారూప్య పార్టీలకు మద్దతివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. తెలంగాణ హోం గ్రౌండ్ కాబట్టి.. తెలంగాణలో మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తారు.