Farm House Case : సీబీఐ విచారణను ఆపడానికి బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు - ఫామ్ హౌస్ కేసులో అసలేం జరగబోతోంది ?
ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణ జరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరకాల ప్రయత్నాలూ చేస్తోంది. సీబీఐ విచారణ ప్రారంభమైతే ఏం జరుగుతుంది ?
Farm House Case : ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభించకుండా.. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే మూడు సార్లు లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదన్న విషయం హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. హైకోర్టు ఆదేశించినా.. సాంకేతికంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదు. తీర్పు అమలుపై స్టేకు మంగళవారం ఉదయం హైకోర్టులో..మధ్యాహ్నం సుప్రీంకోర్టులో ప్రయత్నించారు. తెలంగాణ సర్కార్ ఎందుకింత టెన్షన్ పడుతోంది. ఆ కేసు సీబీఐకి వెళ్తే రాజకీయంగా ఫిక్స్ అయిపోతామని కంగారు పడుతోందా ?
సీబీఐ దర్యాప్తుతో రాజకీయ ఇబ్బందులు వస్తాయని బీఆర్ఎస్ ఆందోళన!
మీకు దర్యాప్తు సంస్థలున్నాయి నాకూ ఉన్నాయంటూ కేసీఆర్ చాలెంజ్ చేసి మరీ ఫామ్ హౌస్ కేసును ఢిల్లీ అగ్రనేతల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు హైదరాబాద్‌లో బీఎల్ సంతోష్ పర్యవసానాలు అనుభవించక తప్పదు అని హెచ్చరిక జారీ చేసి వెళ్లారు. ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ కేసు సీబీఐ చేతికి వెళ్లింది. సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందో లేదో తెలియదు కానీ సీబీఐ విచారణ నుంచి మాత్రం తప్పించుకోవడం సాధ్యం కాదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ కూడా ఇప్పుడు ఇరుక్కునే పరిస్థితి ఏర్పడింది. సాక్ష్యాలను ఆయన మీడియా సమావేశం పెట్టి రిలీజ్ చేశారు. వాటిలో ఉన్న కంటెంట్ వైరల్ కాలేదు కానీ ఆయన ఇలా చేయడం మాత్రం సీబీఐ దృష్టిలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనను సీబీఐ విచారిస్తుందని ఇప్పటికే కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.
అధికార వర్గాలకూ ఇబ్బందే !
కేసీఆర్ బయట పెట్టిన అంశాలు సామాన్యమైనవి కాదు. కొన్ని వేల పేజీల డాక్యుమెంట్లతో పాటు ఎంతో క్లిష్టమైన ఆయా నిందితులకు సంబంధించిన సమాచారం చాలా ఉంది. ఆ సమాచారం అంతా ఎలా వచ్చిందనేది కీలకం. అలా వచ్చిన సమాచారం ముఖ్యమంత్రి వద్దకు వెళ్లడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇదే పాయింట్ ను పట్టుకుని సీబీఐ రంగంలోకి దిగితే మొదటగా ఇబ్బంది పడేది సీఎం కేసీఆరే. అలాగే హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు కూడా ఇబ్బందులు పడనున్నారు. వారినీ సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. సీబీఐ విచారణ అంటూ జరిగితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం ఉండదని రాజకీయవర్గాల అంచనా.
బీఆర్ఎస్ ఆయుధం బీజేపీ చేతికి చిక్కినట్లే !
తమకు ఆయుధం అవుతుందనుకున్న ఫామ్ హౌస్ కేసు నుంచి వారు తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ నేతలకు ఏర్పడింది. అలాంటి పరిస్థితిని బీఆర్ఎస్ నేతలు సీబీఐ చేతుల్లో పెట్టారు. నిజానికి ఈ కేసులో ప్రలోభ పెట్టిన వారిపై విచారణ జరగాలి. మనం ముందే చెప్పుకున్నట్లు సిట్ దర్యాప్తు చేస్తే ఓ కోణం సీబీఐ దర్యాప్తు చేస్తే మరో కోణంలో జరుగుతుంది. ఎలా చూసినా సీబీఐ విచారణ అంటూ ఎమ్మెల్యేలకు ఎర కేసు వారి చేతుల్లోకి వెళ్తే బీజేపీకి బ్రహ్మాస్త్రం దక్కినట్లే. ఆకేసులో ఉన్న కోణాలతో పరిశీలిస్తే మొదట సీఎం కేసీఆర్ నూ సీబీఐ టార్గెట్ చేయవచ్చు. తర్వాత సీనియర్ పోలీసు ఆఫీసర్లను టార్గెట్ చేసి అధికార యంత్రాంగంలో భయభ్రాంతులు కల్పిస్తే బీజేపీ పని సులువు అవుతుంది. అందుకే సీబీఐకి అలాంటి చాన్స్ ఇవ్వకూడదనే.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా ఆపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.