APBJP : ఏపీలో బీజేపీకి అర్థం కాని రాజకీయం - హైకమాండూ గాల్లో నిలబెట్టేసిందా ?
ఏపీలో బీజేపీ పరిస్థితి గందరగోళంగా మారింది. కేంద్ర పార్టీ ఏమీ చెప్పడం లేదు.. కానీ రాష్ట్రంలో అన్నీ జరిగిపోతున్నాయి.
APBJP ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అయోమయ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపు వైసీపీపై ఢిల్లీ స్థాయిలో అభిమానం చూపిస్తున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో మాత్రం పోరాడమని చెబుతున్నారు. మరో వైపు పొత్తులో ఉన్న జనసేన కలిసి రావడం లేదు. తమతోనే కలిసి రావాలని జనసేన డిమాండ్ చేస్తోంది. కలవడానికి టీడీపీ అంగీకరిస్తుందో లేదో తెలియదు. మొత్తంగా ఇప్పుడు ఒంటరిగా ప్రయత్నాలు చేయలేక.. ఇతర పార్టీలతో కలిసే అవకాశం లేక ఏపీ బీజేపీ నేతలు దీనంగా కేంద్ర పార్టీ వైపు చూస్తున్నారు. కానీ ఏపీ బీజేపీని పట్టించుకునేంత తీరిక ఇప్పుడు కేంద్ర పార్టీకి లేదు. ఫలితంగా ఏపీ బీజేపీ పరిస్థితి దైవాధీనం సర్వీస్‌లా మారింది.
ఢిల్లీ పెద్దలకు వైసీపీ సన్నిహితం కానీ పొత్తులుండవు !
వైసీపీ .. బీజేపీకి అన్ని విధాలుగా సహకరిస్తుంది. కానీ వైసీపీ అధికారికంగా ఎన్డీఏలో చేరదు. వైసీపీ ఓటు బ్యాంక్ దళితులు, ముస్లింలు. వైసీపీ ఎన్డీఏలో చేరితే అది అత్మహత్యా సదృశం అవుతుంది. అందుకే తెర వెనుక సహకారం వరకూ ఓకే కానీ.. తమతో కూటమిలో చేరాలని బీజేపీ కూడా ఒత్తిడి చేయదు. కానీ బీజేపీకి ఏపీలో ఈ రాజకీయం వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. వైసీపీకి దగ్గర అని ప్రచారం జరుగుతూండటం వల్ల అసలు ఎదిగే అవకాశం లేకుండా పోతోంది. అధికారికంగా పొత్తులు పెట్టుకోకపోవడం వల్ల ఉనికి సమస్య వస్తోంది. గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో పరువుపోయింది. ఈ సారి కూడా అలాంటి పరిస్థితి వస్తే... ఊహించుకోలేమని.. పొత్తులు పెట్టుకుని అయినా అధికారంలో భాగస్వామిగా ఉండాలని అనుకుంటున్నారు.
పొత్తులు అంటే ఒకటే మార్గం - టీడీపీ జనసేనతో కలవడం
కలసి పోటీ చేయాలంటే అది టీడీపీ, జనసేనతోనే సాధ్యం. అప్పుడు మాత్రమే బీజేపీకంటూ కొన్ని స్థానాలు వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం గెలిచే అవకాశం ఉంది. ఏపీ బీజేపీ ఎదుట ఉన్న ఏకైక ఆప్షన్ టీడీపీ,జనసేనతో పొత్తు పెట్టుకోవడం. ఇంతకంటే బీజేపీకి కూడా అంతకంటే వేరే ఆప్షన్ లేదు. తమ వెంట బలమైన మిత్రులున్నారని చెప్పుకోవడం కోసమైనా సైకిల్ ఎక్కక తప్పదన్నది అంచనాలు వినపడుతున్నాయి. మరోవైపు కొందరు బీజేపీ నేతలు సైతం టీడీపీ,జనసేనతో పొత్తుకు సై అంటున్నట్లు తెలుస్తోంంది. అదే సమయంలో పొత్తును వ్యతిరేకిస్తున్న వారు కూడా ఉన్నారు. ఏపీలోనే కాదు దక్షిణాదిన భారతీయ జనతా పార్టీకి గడ్డు పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలోనైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే జనసేనతో పొత్తు పెట్టుకుంది. కానీ బీజేపీతో ఉంటే సీట్లు కాదు కదా ఓట్లు కూడా రావని టీడీపీ వైపు వెళ్లిపోయారు. బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేస్తామని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు వద్దనుకుంటున్న టీడీపీ
ఏపీలో బీజేపీకి విపత్కర పరిస్థితి నెలకొంది. బీజేపీ పరిస్థితి ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం కేసులో జైల్లో ఉన్నారు. దీంతో టీడీపీకి సానుభూతి పెరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో ఇది ప్రభావితం చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు టీడీపీ క్లిష్టమైన సమయంలో పవన్ కల్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కూడా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. టీడీపీ,జనసేన పొత్తును ప్రజలు స్వాగతిస్తున్నారు. అయితే వైసీపీకి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపడం ద్వారా బీజేపీ పైనా వ్యతిరేకత ఉందని.. ఆ పార్టీని కూటమిలో కలుపుకుంటే మైనస్ అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు అరెస్టు అయి ఇన్ని రోజులు జైల్లో ఉన్నారంటే అది బీజేపీ ప్రమేయం లేకుండా సాధ్యం కాదని చెబుతున్నారు. అందుకే బీజేపీని వద్దే వద్దంటున్నారు. ఎలా చూసినా బీజేపీ పరిస్థితి గందరగోళంగా ఉంటోంది.