Raghunandan Rao: సభలో కుర్చీలు వెతుక్కునేలోపే అసెంబ్లీ వాయిదా పడింది - MLA రఘునందన్ రావు
Raghunandan Rao: బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదో చెప్పాలని రఘునందన్ రావు నిలదీశారు. మరమనిషి ఏమైన నిషిద్ద పదమా.. అని ప్రశ్నించారు.
Raghunandan Rao: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తీరుపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. బీఏసీ సమావేశం నిర్వహించకుండానే అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారని ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... ఎవరికీ తెలియకపోయినా మీడియా వ్యక్తులకు మాత్రం అసెంబ్లీ సమావేశాల తేదీలను లీకు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ సభ్యులకు మూడు రోజులు మాట్లాడే అవకాశం లభిస్తుందని భావించామని.. అది కలగానే మిగిలి పోయిందని అన్నారు. సభకు వెళ్లి కుర్చీలు వెతుక్కునే లోపే అసెంంబ్లీ వాయిదా పడిందని అన్నారు. ఇతర పార్టీల వాళ్లను మాట్లడనివ్వకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలా చేస్తుందంటూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు.
'కుర్చీలు వెతుక్కునేలోపే వాయిదా పడింది'
బీజేపీ ఎమ్మెల్యేలను బీఏసీ సమావేశానికి ఎందుకు పిలవడం లేదంటూ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క సభ్యుడు ఉన్నా ఆ పార్టీని బీఏసీకి ఆహ్వానిస్తారని, కానీ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా తమను ఎందుకు పిలవడం లేదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రశ్నించారు. ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటే బీఏసీ సమావేశానికి పిలుస్తారో చెప్పాలని కోరారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు సీపీఎం, లోక సత్తా పార్టీలకు ఒక్కరే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. బీఏసీ సమావేశానికి వారిని పిలిచినట్లు రఘునందన్ రావు గుర్తు చేశారు. బీజేపీని కూడా బీఏసీ సమావేశానికి పిలవాలని స్పీకర్ ను కోరినట్లు తెలిపారు. అయినప్పటికీ తమకు ఎలాంటి సమాచారం లేకుండానే బీఏసీ సమావేశం పెట్టుకున్నారని.. అసెంబ్లీ సమావేశానికి వచ్చి కూర్చునే లోపే వాయిదా వేశారని అన్నారు. కావాలనే టీఆర్ఎస్ ప్రభుత్వం.. బీజేపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపిస్తుందని రఘునందన్ రావు ఆరోపించారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్.. మూడు పార్టీలు ఒక్కటే అని విమర్శించారు.
'సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలను రానీయకుండా కుట్ర'
బీఏసీ సమావేశానికి హాజరైన కాంగ్రెస్, మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేలు... అసెంబ్లీ సమావేశాలను 20 రోజుల పాటు జరపాలని ఎందుకు కోరలేదో తెలపాలని అన్నారు. 12, 13వ తేదీల్లో నిర్వహించబోయే సభలకు బీజేపీ ఎమ్మెల్యేలలను రానీయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఎమ్మెల్యే రఘునందర్ రావు తెలిపారు. ఇక నైనా ఇలాంటి కుట్రలను మానుకోవాలని... పార్టీల కోసం కాకుండా ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాల్లో అందరూ మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలని అన్నారు. అలాగే మంత్రి ప్రశాంత్ రెడ్డిపై రఘునందన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ లెక్క ప్రకారం తమకు నోటీసులు ఇస్తారని ప్రశ్నించారు. ఎలా ఇచ్చినా, ఏ పద్దతుల్లో తమకు ఎదరు వచ్చినా న్యాయ పరంగానే ఎదుర్కుంటామని రఘునందన్ రావు తెలిపారు.
'సభాపతిని మరమనిషి చేశారు'
సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డిని మరమనిషి అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించడంపై నోటీసులు ఇవ్వడం ఏమిటని రఘునందన్ రావు ప్రశ్నించారు. మర మనిషి అనడంలో తప్పేముందని, అది ఏమైనా నిషిద్ధ పదమా అని దుబ్బాక ఎమ్మెల్యే నిలదీశారు. స్పీకర్ పోచారం బీఏసీ నిబంధనలు పాటించడం లేదని రఘునందన్ రావు ఆరోపించారు. నిజామాబాద్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లిన ోజు సభాపతిని మరమనిషి చేసింది మంత్రి ప్రశాంత్ రెడ్డి అని రఘునందన్ రావు విమర్శించారు. శాసనసభ సమావేశాలకు సంబంధించిన నిబంధనల పుస్తకం పట్టుకుని మంత్రి ప్రశాంత్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు.