(Source: ECI/ABP News/ABP Majha)
KCR ఆ పాఠాన్ని తొలగించండి, లేదంటే మీ పూర్వీకులు కూడా పాపాత్ములేనా?: విష్ణువర్ధన్ రెడ్డి
Vishnu Vardhan Reddy About KCR: ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలపై తెలంగాణ రాష్ట్ర విద్యార్థులలో విద్వేషాన్ని రేకెత్తించే కేసిఆర్ ముందు క్షమాపణ చెప్పాలని, ఆ తరువాత జాతీయ రాజకీయాలు మొదలుపెట్టాలన్నారు.
Vishnu Vardhan Reddy About KCR: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని బీఆర్ఎస్‌గా మార్చడం ద్వారా తెలంగాణ సీఎం కేసీర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అయితే ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ పార్టీతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొత్తులపై చర్చించారు. తమిళనాడు, కేరళలోనూ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని బరిలోకి నిలపాలని భావిస్తున్నారు. కానీ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పాలకులను పాపాత్ములుగా చిత్రీకరించారంటూ బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలపై తెలంగాణ రాష్ట్ర విద్యార్థులలో విద్వేషాన్ని రేకెత్తించేలా పాఠాలను ఎందుకు లిఖించారని తెలంగాణ సీఎం కేసీఆర్ ను బీజేపీ నేత ప్రశ్నించారు. కేసిఆర్ ముందు క్షమాపణ చెప్పాలని, ఆ తరువాత జాతీయ రాజకీయాలు మొదలుపెట్టాలన్నారు.
రాష్ట్రం ఏపీ, తెలంగాణలుగా విడిపోయిన తరువాత సైతం అవకాశం దొరికిన ప్రతిసారి గులాబీ పార్టీ బాస్ కేసీఆర్ పక్క రాష్ట్రాలపై విద్వేషాన్ని చిమ్ముతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఏపీ ప్రజలపై విషం చిమ్ముతూ, విద్వేషాన్ని రెచ్చగొడుతున్న కేసీఆర్ పూర్వీకులది విజయనగరం జిల్లా కాదా! అని ప్రశ్నించారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్ళి స్థిరపడిన మీ పూర్వీకులు కూడా పాపాత్ములు అవుతారా, పక్క రాష్ట్రాల ప్రజలపై విషం చిమ్మే మీకు జాతీయ రాజకీయాలలోకి వచ్చే అర్హత ఉందా? అని ప్రశ్నిస్తూనే.. ఈ విషయంలో కేసీఆర్ మరోసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న కేసీఆర్ గారు, పాఠాల ద్వారా పక్క రాష్ట్రాల ప్రజలపై విద్వేషాన్ని చిమ్ముతున్న మీరు ఎలా అర్హులు ?@trspartyonline @TelanganaCMO #BRS pic.twitter.com/YyxiTxCRBd
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 11, 2022
ఆ పాఠాన్ని తొలగించాలని డిమాండ్
8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం నుంచి రాష్ట్రాల మధ్య విద్వేషాన్ని రేకెత్తించేలా ఉన్న మీ స్వంత రాష్ట్రంలో ఆపాఠాన్ని వెంటనే తొలగించాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పుడు మాత్రమే పక్క రాష్ట్రాల్లో పర్యటించే హక్కు ఉంటుందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ కేసీఆర్‌కు గుర్తు చేస్తోందని సూచించారు.
వివాదాస్పద పాఠ్యాంశంలో ఏముందంటే..
తెలంగాణ ప్రజల కోసం, మాతృభూమి విముక్తి కోసం ప్రాణత్యాగం చేసిన ధన్యజీవులారా మీకు జోహార్లు. వీరులారా ! మీ జీవితం తెలంగాణ భూమిపుత్రుల సేవలలోనే తరించింది. ఈ సమాజమంతా మీకు జోహార్లు అర్పిస్తుంది. ఇక్కడి ప్రజల సుఖసంతోషాల కోసం మీరు, మీ కుటుంబసభ్యులు ఎన్నో బాధలను అనుభవించారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం పారిన రక్తం పాపాత్ముల పరిపాలన అంతమయ్యేవరకు విశ్రమించదు. శాంతించదు. మీ ఒక్కొక్క రక్తపు చుక్క తెలంగాణ వ్యతిరేకులపై విషం చిమ్ముతుంది. మీ ఆవేశం ప్రత్యేక తెలంగాన అవసరాన్ని ప్రతి నిమిషం ప్రబోధిస్తుంది. మీరు ధరించిన రక్తతిలకం మాకు స్ఫూర్తినందిస్తుంది. అది అధికార మదంతో బలిసిన వారికి యమపాశమవుతుంది. మీ అడుగులలో అడుగేస్తూ మా నెత్తురు ధారపోస్తాం. రక్తతర్పణాలను చేస్తాం. నింగి, నేలలో విస్తరించిన సమస్త ప్రాణులారా ! మా ప్రతిజ్ఞ వినండి. బాహాటంగానే తెలంగాణను సాధిస్తాం. అమరుల ఆత్మలు శాంతించే విధంగా అమృతవర్షం కురిపిస్తాం. అని పాఠ్య పుస్తకంలో ఉంది.