BJP Vishnu On Central Funds : జాతీయ రహదారులు మిలమిల - రాష్ట్ర రహదారులు వెలవెల ! ఎందుకిలా ?
రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో ఎన్‌డీబీ నిధులు వెనక్కి పోతున్నాయని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. జాతీయ రహదారులు శరవేగంగా నిర్మాణం అవుతూంటే.. రాష్ట్ర రహదారులు అలా ఎందుకు ఉన్నాయో చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు.
BJP Vishnu On Central Funds : ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల దుస్థితికి కారణం వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడమే కారణమని ఏపీ బీజేపీ ఆధారాలతో సహా వివరాలను వెల్లడించింది. కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేస్తున్నప్పటికీ పరిమితంగా రాష్ట్రం తన వాటాగా చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవడం వల్లనే రోడ్ల పనులు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు.
ఎన్‌డీబీ రోడ్లకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన నిధులు పెండింగ్
ఆంధ్రప్రదేశ్‌లోని మండల కేంద్రాలను జిల్లా కేంద్రాలతో కలిపే రహదారులను ₹6,400 కోట్లతో రెండు వరుసల రహదారులుగా అభివృద్ధి చేయాలని కేంద్రం సంకల్పించిందని.. అందులో బాగంగా ఈ నిధులలో 70 శాతం వాటా న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఋణం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకారాన్ని తెలియజేసిందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. మిగిలిన 30 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం అందించవలసి ఉంటుంది. ఇందులో మొదటి దశలో భాగంగా 1,243 కి.మీ.ల రహదారుల నిర్మాణం కోసం ఎన్ డి బి బ్యాంకు రాష్ట్ర ప్రభుత్వానికి ₹2,978 కోట్ల నిధులను అందిస్తే, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 30 శాతం ఇవ్వవలసిన సొమ్మును సైతం ఇవ్వలేదు. దీనితో ఈ పనుల కోసం టెండర్లు పిలిచి నేటికి దాదాపు పది నెలలు కావస్తున్నా రహదారుల మరమ్మతులను కాంట్రాక్టర్లు ప్రారంభించలేదని గుర్తు చేశారు.
రహదారుల దుస్థితి, నిధులు వెనక్కి పోవడంపై సీఎం వివరణ ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ నిధులు సైతం వెనక్కి పోనున్నాయి. దీనిమీద ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ... ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల నిధులు వెనక్కి పోతే.. దానికి కేంద్రాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు. రాష్ట్ర రహదారులు , జాతీయ రహదారుల మీద ప్రజల్లో చర్చకు వైసీపీ ప్రభుత్వం వస్తుందా అని సవాల్ చేశారు. రాష్ట్రంలో దాదాపు 90 వేల కోట్లు పైబడి నిధులతో జాతీయ రహదారి ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోందని గుర్తు చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. ఇవన్నీ రికార్డుల్లో ఉన్నవేనన్నారు.
శరవేగంగా జాతీయ రహదారుల నిర్మాణం - ఆర్ అండ్ బీ రోడ్లు అధ్వాన్నం
వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర రహదారులకు చేయవలసిన చిన్న చిన్న మరమ్మతులకు సైతం గుత్తేదారులు పాల్గొనకుండా పారిపోతున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న జాతీయ రహదారుల టెండర్లలో దాదాపు 20 శాతం పైబడి తక్కువ ధరకు టెండర్లు వేసి ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నమ్మకం కోల్పోయిందనడానికి ఇదే నిదర్శనమని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లపై వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధుల దౌర్జన్యం , అవినీతి గుత్తాధిపత్యం , ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించకపోవడం కారణం కాదా అని రాష్ట్ర బిజెపి ప్రశ్నిచింది. జగన్ సీఎం అయ్యాక రహదారులు గాలికి వదిలేసిందని దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అదే సమయంలో జాతీయ రహదారుల నిర్మాణాన్ని అత్యంత వేగంగా పెద్ద ఎత్తున జరుగుతోందని కాణిపాకం, తిరుపతి వంటి పుణ్యక్షేత్రాల మీదుగా చిత్తూరు నుండి మల్లవరం వరకు నిర్మిస్తున్న NH-140, 6 వరుసల జాతీయ రహదారిలోని మిగిలిన పనులను NHAI శరవేగంగా చేపడుతోందని తెలిపారు. ఈ ఘనత ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలదేనన్నారు.