బీజేపీ ఒంటరి పోరుకు సిద్ధమా..? కార్యాలయాల ఓపెనింగ్ అందుకేనా..?
రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ స్థానాల పరిధిలో పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
Andhrapradesh Election 2024: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోందా..? అంటే ఆ పార్టీ ముఖ్య నాయకులు నుంచి అవునన్న సమాధానమే వస్తోంది. జనసేన, టీడీపీతో కలిసి పోటీ చేయాలని ఆ పార్టీ నాయకులతోపాటు బీజేపీలోని ముఖ్య నాయకులు భావించారు. కానీ, ఇందుకు కేంద్ర అధినాయకత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. గడిచిన కొన్నాళ్ల నుంచి ఏపీలో పొత్తులతోనే బీజేపీ రాజకీయాలను నెరుపుతోంది. మిగిలిన రాష్ట్రాలు మాదిరిగా ఏపీలో కనీస స్థాయిలో పార్టీ పుంజుకోవడం లేదు. దీనికి కారణం పొత్తులేనని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. పొత్తు ఉన్నప్పుడు ఒకటి, రెండు స్థానాల్లో విజయం సాధించడం.. లేకపోతే కనీస స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించలేని పరిస్థితిలో పార్టీ ఉండడం పట్ల అగ్రనాయకత్వం దృష్టి సారించింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రధాన పార్టీలు నుంచి కీలమైన వ్యక్తులను పార్టీలోకి తీసుకురావడంతోపాటు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడం ఉత్తమమమని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు సీట్లు రాకపోయినా పార్టీ కేడర్‌కు రాష్ట్రంలో ఎదిగే ప్రయత్నాన్ని బీజేపీ చేస్తోందన్న భావనతో క్షేత్రస్థాయిలో గట్టిగా పని చేసేందుకు అవకాశముంటుందని చెబుతున్నారు. ఆ దిశగా ఇప్పుడు బీజేపీ చర్యలను ముమ్మరం చేసినట్టు చెబుతున్నారు.
కార్యాలయాలు ప్రారంభం
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ స్థానాలు పరిధిలో బీజేపీ పార్టీ కార్యాలయాలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ఉద్ధేశంతో బీజేపీ అధిష్టానం ఉండడంతోనే ఈ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నిర్వహించనున్నారు. పార్టీ అభ్యర్థులను కొద్దిరోజుల్లో ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే కీలక అభ్యర్థులను పోటీలో దింపేందుకు అనుగుణంగా ఆ పార్టీ దృష్టి సారించింది. ప్రధాన పార్టీలు నుంచి బీజేపీలోకి వచ్చే వారిపైనా నాయకులు దృష్టి సారించారు. ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకులను ఆహ్వానించడం ద్వారా స్థానికంగా కొంత బలోపేతం కావచ్చని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
ఆ నేతల ఏం చేయనున్నారు..
టీడీపీ, జనసేనతో పొత్తు ఉంటుందని బీజేపీలో కొంత మంది నేతలు బలంగా విశ్వసిస్తూ వచ్చారు. బీజేపీ అధినాయకత్వం ఆదేశాలతో పార్లమెంట్ స్థానాలు పరిధిలో కార్యాలయాలు ఏర్పాటుకు ఆదేశాలు రావడం, మరో పక్క జనసేన, టీడీపీ అభ్యర్థుల ప్రకటనకు సిద్ధమవుతుండడంతో పొత్తు లేనట్టేనన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తు ఉంటటుందని ఆశించిన బీజేపీలోని కొందరు ముఖ్య నేతలు ఏం చేయబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, విశాఖలోని ఉత్తర నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు వంటి వారంతా ఉమ్మడిగా పోటీ ఉంటుందని బలంగా విశ్వసించారు. కానీ, బీజేపీ తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు దానికి వ్యతిరేకంగా ఉండడంతో వీరి ఆలోచన ఎలా ఉండబోతుందన్న దానిపైనా ఆసక్తి నెలకొంది. బీజేపీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేయాలన్న ఆలోచన వెనుక బలమైన కారణం ఉన్నట్టు చెబుతున్నారు. బలమైన అభ్యర్థులతో పోటీలోకి వెళితే క్షేత్రస్థాయిలో బలంపై ఒక అంచనాకు వచ్చి.. 2029 నాటికి రోడ్ మ్యాప్ వేయాలన్నది వారి మొదటి లక్ష్యం. ఏపీలో గెలిచే సీట్లుపై బీజేపీ ఎప్పుడూ లెక్క పెట్టుకోలేదు. ఇక్కడ ఏ పార్టీ గెలిచినా తమకే సహకారాన్ని అందించేందుకు ఉవ్విళ్లూరుతున్న నేపథ్యంలో పొత్తుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటన్న భావనలో ఆ పార్టీ అగ్రనాయకత్వం ఉండడం వల్లే.. కలిసి పోటీ చేయడంపై అగ్రనాయకత్వం సానుకూలతను వ్యక్తం చేయడం లేదని ఆ పార్టీ ముఖ్య నాయకులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ సమీకరణాలు ప్రకారం పొత్తు లేనట్టే కనిపిస్తోందని, చివరి దశలో రాజకీయ సమీకరణాల్లో మార్పులతో పొత్తుకు వెళతారా..? అన్నది వేచి చూడాలని ఆ పార్టీ కీలక నాయకులే చెప్పుకుంటున్నారు.