Bhadradri Kothagudem Politics : ఆ ఎమ్మెల్యే పార్టీ మారుతారా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జోరుగా చర్చ!
Bhadradri Kothagudem Politics : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయం జోరుగా మారుతోంది. ఓ ఎమ్మెల్యే పార్టీ మారేందుకు స్కెచ్ వేసుకున్నారని ప్రచారం సాగుతోంది.
Bhadradri Kothagudem Politics : మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు. దీంతో పార్టీల మధ్య జంపింగ్ లపై జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం పార్టీ మారినప్పటికీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవడంతో వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో రాదో అని భావిస్తున్న కొంత మంది ముందస్తుగానే పార్టీలు మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ఎమ్మెల్యే పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలుండగా ఇందులో నాలుగు ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు కాగా ఒకటి జనరల్. గత ఎన్నికల్లో ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఒక స్థానంలో టీడీపీ గెలుపు సాధించింది. అనంతరం జరిగిన పరిణామాల్లో నలుగురు ఎమ్మెల్యేలు అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లగా ప్రస్తుతం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దీంతో జిల్లాలో అటు కాంగ్రెస్, ఇటు టీఆర్‌ఎస్ పార్టీలోనూ అంతర్గత పోరు నెలకొంది. టీఆర్‌ఎస్ పార్టీలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులు ఒక గ్రూపుగా, పార్టీ మారిన నేతలు మరో గ్రూపుగా ఏర్పడటంతో... వీరి మధ్య ఆదిపత్య పోరు నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎవరు ఎటువైపు జంప్ చేస్తారనే ప్రధాన చర్చ నడుస్తోంది. కాగా ఇటీవల జిల్లాలోని ఓ ఎమ్మెల్యే తీరు అందరినీ ఆశ్చర్య పరుస్తుంది. ఆయన గెలిచిన పార్టీలో అన్ని హోదాలు ఉన్నప్పటికీ జిల్లాలో కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
పార్టీ మారేందుకు చర్చలు
ప్రస్తుతం పార్టీ మారినప్పటికీ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇదే అదనుగా పార్టీ మారడంతోపాటు తనకు నచ్చిన అసెంబ్లీ నియోజకవర్గంలో తన కార్యకర్తలను బలోపేతం చేసుకునేందుకు ఆ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ప్రచారం. దీంతో పాటు రానున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఇదే చక్కని సమయమని ఆ ఎమ్మెల్యే భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రధాన పార్టీతో చర్చలు నడిపిన ఆయన తాను అనుకున్న సీటు కేటాయింపునకు వారు ఓకే చెప్పడంతో పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యే పార్టీ మారే విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలియడంతో ఆయన మారకుండా చూసేందుకు బుజ్జగింపులు చేస్తున్నట్లు సమాచారం. ఆ పార్టీ అధిష్ఠానం చేసే బుజ్జగింపులు పలిస్తాయా? లేక ఆయన పార్టీ మారేందుకు సిద్ధమవుతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికీ మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పుడు ఏ పార్టీ నాయకులు ఎటు వెళతారు? అనేది మాత్రం జిల్లా రాజకీయాల్లో చర్చానీయాంశంగా మారింది.
కొత్తగూడెం సీటుపై హోరాహోరీ పోటీ!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. జిల్లాల విభజనతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెరో ఐదు సీట్లుగా విడిపోయాయి. వీటిలో మూడు జనరల్ సీట్లు ఉండగా, కొత్తగూడెం జిల్లాలో ఒక్క కొత్తగూడెం మినహా మిగిలిన నాలుగు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. దీంతో కొత్తగూడెం సీటు కోసం టీఆర్ఎస్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఇతర నాయకుల మధ్య పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించి ఆ తర్వాత అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. అప్పట్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జలగం వెంకట్రావు ఓటమి పాలయ్యారు. గెలిచిన కొంతకాలానికే వనమా కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్ లో చేరారు. వచ్చే ఎన్నికల్లో తనకే కొత్తగూడెం సీటు ఇస్తారని వనమా వెంకటేశ్వరరావు ధీమాగా ఉన్నారు.