BRS Early Polls : ముందస్తు కోసం కేసీఆర్ మాస్టర్ ప్లాన్ - బీఆర్ఎస్‌కు మద్దతివ్వాలనే నినాదంతో ఎన్నికలకు వెళ్తారా ?
కేసీఆర్ ముందస్తుకు వెళ్తారన్న వాదన రోజు రోజుకు బలపడుతోంది. బీఆర్ఎస్‌కు ముందుగా తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కావాలని ఆయన ప్రజల వద్దకు వెళ్లే అవకాశాలున్నాయని అంటున్నారు.
BRS Early Polls : పేరు మారింది..తెలంగాణ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారింది. ఇప్పటివరకు ఈ పేరు మార్పు కోసమే ఎదురుచూసిన తెలంగాణ సిఎం ఇక రేపో మాపో ఆ ముందస్తు ముచ్చట కూడా చెప్పేయబోతున్నారా ? అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికకు ముందు నుంచే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న వార్తలు హడావుడి చేశాయి. అయితే ఈ లోపే ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయపార్టీగా మార్చనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు.
మునుగోడు ఉపఎన్నికలకు ముందు నుంచీ ముందస్తు ఎన్నికల ఊహాగానాలు
దసరా పండగ రోజున పార్టీ పేరుని ప్రకటించి ఈసీకి కూడా లేఖని పంపారు కేసీఆర్ . అన్నీ పక్కాగా ఉన్న తర్వాత ఈసీ కూడా బీఆర్ ఎస్ పార్టీ గుర్తింపుని ఖరారు చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కెసిఆర్ బీఆర్ ఎస్ పార్టీ జెండాని ఆవిష్కరించి ఇక జాతీయరాజకీయాల్లో తెలంగాణ సత్తా చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం, కారు, తెలంగాణ తల్లి బొమ్మ లేకుండా కేవలం గులాబీ రంగుని మాత్రమే కంటిన్యూ చేస్తూ భారతదేశ పటాన్ని జెండాపై ప్రతిబింబించేలా భారత రాష్ట్ర సమితి జెండాని రూపొందించారు. దీంతో ఇక అధికారికంగా ఈరోజు నుంచి బీఆర్ ఎస్ పార్టీగా తెలంగాణలో కనిపించనుంది. అంతేకాదు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ పేరుతోనే అభ్యర్థులు రంగంలోకి దిగబోతున్నారు.
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు కసరత్తు పూర్తి చేశారా ?
ఇప్పటివరకు పార్టీ పేరు మార్పు కోసమే గులాబీ అధినేత ఎదురుచూశారు. ఇప్పుడు అధికారికంగా బీఆర్ ఎస్ పార్టీగా మారడంతో రేపోమాపో ముందస్తు ముచ్చట కూడా ప్రకటించే ఛాన్స్ ఉందన్న వార్తలు మళ్లీ హడావుడి చేస్తున్నాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా మరోసారి తెలంగాణలో ముందస్తు ఎన్నికలే ఉంటాయని చెప్పుకొచ్చారు. ఎయిర్ పోర్టు మెట్రో రైల్ నిర్మాణ పనులకు కెసిఆర్ శంకుస్థాపన చేయడంపై కిషన్ రెడ్డి స్పందిస్తూ 65 ఏళ్లు అయినా ఆ మెట్రో పనులు పూర్తి కావని జోస్యం చెప్పారు. పనిలో పనిగా ముందస్తు ఎన్నికలపై కూడా స్పందించారు. కెసిఆర్ ముందస్తు ఎన్నికల్లో భాగంగానే ఫామ్ హౌజ్ ని వదిలి జిల్లా పర్యటనలు, ఆఘమేఘాల మీద అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాషాయం నేతలు గతకొన్ని రోజులుగా ముందస్తు ఎన్నికల గురించే ఎక్కువగా మాట్లాడుతుండటంతో పాటు ఇప్పుడు బీఆర్ ఎస్ పార్టీగా కూడా మారడంతో కెసిఆర్ ఏ క్షణంలోనైనా ఎన్నికలకు పోతున్నట్లు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో క్లారిటీ ఇస్తారా ?
ముందస్తు ఎన్నికలు వస్తాయనే ఉద్దేశ్యంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రను బస్ యాత్రకు షిప్ట్ అయ్యే అలోచనలో ఉన్నారంట. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కేంద్రం రాష్ట్రానికి చేస్తోన్న అన్యాయంతో పాటు ముందస్తు ఎన్నికలపై కూడా క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మే నెలలో ఎన్నికలకు వెళ్లే విధంగా ప్లాన్ రెడీ అవుతందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మే నెలే ముహూర్తం అంటున్నారు మరికొంతమంది. అయితే ముందస్తు ముచ్చట ఉండదని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. అయితే బీఆర్ ఎస్ పార్టీ గుర్తు ప్రజల మనస్సులోకి వెళ్లేంతవరకు కెసిఆర్ ముందస్తు ముచ్చటకి వెళ్లడన్న టాక్ కూడా ఉంది. ఇప్పటివరకు కారు-తెలంగాణ రాష్ట్రం గుర్తుతో దూసుకుపోయిన గులాబీపార్టీ రానున్న ఎలాంటి ఫలితం అందుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.