Sharmila Districts Tour: అన్న జగన్ కంటే ముందే జనంలోకి షర్మిల - రాజన్న బిడ్డ ఆట మొదలైంది!
Sharmila to Visit Districts: మొత్తం 9 రోజులపాటు షర్మిల జిల్లాల యాత్ర ఉంటుందని తెలుస్తోంది. ప్రతి రోజు రెండు మూడు జిల్లాల నాయకులతో ఆమె సమావేశమవుతారు.
YS Sharmila Politics: నేను రెడీ.. మీరు రెడీయా అంటూ కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్సాహపరిచారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ఆమె తన ప్రసంగంతో కలకలం రేపారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని అంటున్నారామె. వైఎస్ఆర్ చివరి కోరిక.. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని.. ఆ కోరిక నెరవేర్చే బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందన్నారామె. ఆయన చివరి కోరిక తీర్చడానికి తాను రెడీ అని.. మీరు రెడీయా అంటూ కాంగ్రెస్ కార్యకర్తలను ప్రశ్నించారామె. త్వరలో షర్మిల జిల్లాల పర్యటనకు వస్తారు. ఆమె యాత్రలకు ఆల్రడీ షెడ్యూల్ ఫిక్స్ చేశారు కాంగ్రెస్ నేతలు.
ఇచ్చాపురం టు ఇడుపులపాయ..
ఇచ్చాపురంతో షర్మిల జిల్లాల యాత్ర మొదలవుతుంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆమె పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే కదనరంగంలోకి దిగుతున్నారు. ఈనెల 23నుంచి షర్మిల ఏపీ యాత్ర మొదలవుతుందని సమాచారం. 23వ తేదీ శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, విజయనగరం జిల్లాల్లో ఆమె పర్యటించనున్నారు. స్థానిక నాయకులతో ఆమె సమావేశాలు ఉంటాయి.
మొత్తం 9 రోజులపాటు షర్మిల జిల్లాల యాత్ర ఉంటుందని తెలుస్తోంది. ప్రతి రోజు రెండు మూడు జిల్లాల నాయకులతో ఆమె సమావేశమవుతారు. ప్రతిరోజూ ఆయా జిల్లాల సమన్వయకర్తలతో ఆమె భేటీ అవుతారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకుంటారు.
టికెట్లు ఖరారు చేస్తారా..?
వాస్తవానికి షర్మిల రాకముందు ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి మరీ అయోమయంగా ఉంది. పార్టీ పిలిచి టికెట్ ఇచ్చినా పోటీచేసేందుకు ఎవరూ ఆసక్తి చూపేట్టు లేరు. కానీ షర్మిల రాకతో సీనియర్ నేతల్లో కూడా కదలిక వచ్చింది. గెలుపోటములను పక్కనపెడితే.. ఏపీలో కూడా కాంగ్రెస్ ఉంది అనిపించుకునేందుకు వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తాజాగా జిల్లాల పర్యటనలకు వెళ్తున్న షర్మిల.. ఆశావహుల నుంచి దరఖాస్తులు కూడా స్వీకరించే అవకాశముంది. ఏయే జిల్లాల్లో ఏయే నియోజకవర్గాల్లో పార్టీ ఉనికి కోల్పోకుండా ఉంది, అక్కడ ఎన్ని ఓట్లు వస్తాయి, ఎవరెవరు పోటీకి ఉత్సాహంగా ఉన్నారు అనే వివరాలన్నీ ఆమె సేకరిస్తారు. చివరకు అధినాయకత్వానికి నివేదించి ఆమె టికెట్లు ఖరారు చేస్తారు. ఏపీలో పెద్దగా కాంపిటీషన్ ఉండదు కాబట్టి.. టికెట్ల కేటాయింపులో షర్మిలదే తుది నిర్ణయం అనుకోవచ్చు.
షర్మిల టార్గెట్ ఎవరు..?
ప్రతిపక్షంలో ఉన్న ఎవరికైనా అధికార పక్షమే తొలి టార్గెట్. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అధికార వైసీపీతోపాటు ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ఉమ్మడి టార్గెట్ అవుతాయి. కానీ షర్మిల మాత్రం తన తొలి ప్రసంగంలో వైసీపీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీతో కూడా నష్టం జరిగింది అంటూనే.. వైసీపీతో ఇంకా నష్టం జరిగిందని చెప్పారు. దీనికి ఉదాహరణగా ఏపీ అప్పులను పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ, వైసీపీ దొందూ దొందేనన్నారు షర్మిల. దీన్నిబట్టి ఆమె తొలి టార్గెట్ జగన్, వైసీపీ అని స్పష్టమవుతోంది. జిల్లాల్లో ఉన్న కాంగ్రెస్ సానుభూతి పరులందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చి.. వైసీపీకి వ్యతిరేకంగా పనిచేసే విషయంలో ఆమె వారిని ఏకం చేస్తారని తెలుస్తోంది. ఈ విషయంలో షర్మిల ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.