YSRCP : బుధవారం నుంచి ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ - "పథకం" పారుతుందా ?
ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాన్ని బుధవారం నుంచి ప్రారంభించనున్నారు ఏపీ అధికార పార్టీ నేతలు. ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని వివరించనున్నారు.
గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ఆ పార్టీ నేతలు బుధవారం ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ అయ్యేందుకు అవకాశంగా తీసుకోవాలని వైఎస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని.. సంక్షేమ,అభివృధ్ది కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లి లోటుపాట్లు ఉంటే దిద్దుబాటుకు చర్యలు తీసుకోవాలని సజ్జల సూచించారు. గత మూడు సంవత్సరాల నుంచి ప్రజలకు అందిస్తున్న సంక్షేమం గురించి ప్రజలకు చెబుతామని వైసీపీ నేతలంటున్నారు.
ఇప్పటి వరకూ రూ. 1.38 లక్షల కోట్లు సంక్షేమం ద్వారా ప్రజలకు అందించామని.. 31 లక్షల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చామన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి వారికి అందుతున్న ఫలాలు అడిగి తెలుసుకుంటామని వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. మ్యానిఫెస్ట్ లో 96 శాతం ప్రజలకు అందించామని.. గ్రామాలలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వనున్నారు. 2024 లో మరోసారి జగన్ ను సీయం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపడుతున్నట్లుగా వైఎస్ఆర్‌సీపీ నేతలు చెబుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు కూడా ఇంటింటికి వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పథకాల లబ్దిదారుల జాబితాలు ఇప్పటికే అధికార పార్టీ నేతలకు అందాయి. ఇంకా ఇంటింటికి వెళ్లే క్రమంలో ఎవరికైనా పథకాలు అందకపోతే వారి పేర్లను నోట్ చేసుకుంటారు. వారి అర్హతను బట్టి పథకాలను మంజూరు చేస్తారు.
ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ మూడేళ్ల సంక్షేమాన్ని ప్రజలకు చెప్పాలని ప్రజల వద్దకు వెళ్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికల ఆలోచనలో ఉన్నారు కాబట్టే తమ పథకాల గురించి ముందుగానే వైఎస్ఆర్‌సీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఇతర పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పలు రకాల పన్నులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదలతో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయేమోనన్న ఆందోళన వైఎస్ఆర్‌సీపీ నేతల్లో ఉంది.