What Is AP BJP Target : వైఎస్ఆర్‌సీపీని ఓడించడం బీజేపీ లక్ష్యం కాదా ? జనసేన విషయంలో ఎందుకు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ?
ఏపీ బీజేపీ నేతలు జనసేన తమతోనే ఉంటుందని ప్రకటిస్తున్నారు. కానీ జనసేన వైఎస్ఆర్‌సీపీ ముక్త ఏపీ కోసం అందరూ కలిసి పోరాడాలంటోంది. ఇంతకూ బీజేపీ టార్గెట్ ఏంటి ?
What Is AP BJP Target : " జనసేన పార్టీ మాతోనే ఉంటుంది.. ఉండాలి " ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కమాండింగ్ ప్రకటనలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తామని కానీ.. వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకుంటామని కానీ జనసేన చెప్పడం లేదు. పవన్ కల్యాణ్.. తన మానాన తాను రాజకీయం చేసుకుంది. వైసీపీ ముక్త ఏపీ అనే నినాదాన్ని వినిపిస్తున్నారు. మరో వైపు తెలుగుదేశం పార్టీ కూడా పొత్తుల గురించి మాట్లాడటం లేదు. ప్రభుత్వంపై అందరూ కలిసి పోరాడాలని అటు టీడీపీ..ఇటు జనసేన రెండూ చెబుతున్నాయి. కానీ ఎన్నికల్లో కలిసి పోటీ గురించి మాత్రం చెప్పడం లేదు. కానీ బీజేపీ మాత్రం ప్రభుత్వంపై పోరాటం గురించి చెప్పడం లేదు...కానీ జనసేన మాత్రం తమతోనే ఉంటుందని అదే పనిగా ప్రకటిస్తున్నారు. దీంతో అసలు బీజేపీ వైఖరి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది.
జనసేన ఇతర పార్టీలతో కలవకుండా చేయడమే బీజేపీ లక్ష్యమా ?
భారతీయ జనతా పార్టీకి ఏపీలో కనీస బలం లేదు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితే ఉన్నా... తెలంగాణలో ఆ పార్టీ పుంజుకుంది. కానీ ఏపీలో మాత్రం బీజేపీ కనీసం మెరుగుపడకపోగా.. నోటా కంటే ఎక్కువగా దిగజారిపోయింది. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీతో అవగాహనతో ఒకటీ అరా గెల్చుకున్నారు. జనసేన మద్దతుతో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో పోటీ చేస్తే.. జనసేనకు వచ్చే ఓట్లు కూడా రాలేదన్న విశ్లేషణ ఉంది. ఈ కారణంగా పొత్తుల్లో బలం లేదన్న అభిప్రాయం ముందు నుంచి ఉంది. అదే సమయంలో జనసేన పార్టీని బీజేపీ ఎప్పుడూ కలుపుకోలేదు. బీజేపీ పెద్ద నేతలు ఎవరు వచ్చినా పవన్‌కు ఆహ్వానం లేదు. చివరికి మోదీ.. ఏపీకి వచ్చిన సందర్భంలో పిలిచి మాట్లాడారు. ప్రధాని కాక ముందు కలిశానని.. ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడే పిలిచారని పవన్ కూడా అన్నారు. ఆ మీటింగ్ విశేషాలు సీక్రెట్‌గా ఉంచుతామని.. బయటకు చెప్పబోమని జనసేన నేతలంటున్నారు. కానీ బీజేపీ నేతలు మాత్రం... జనసేన తమతోనే ఉంటుందని.. టీడీపీతో వెళ్లదని.. ఈ మేరకు పవన్ మోదీకి చెప్పారని ప్రచారం ప్రారంభించేశారు. ఈ ప్రకటనలతో.. జనసేన పార్టీని ఇతర పార్టీలతో వెళ్లకుండా చేయడమే లక్ష్యంగా ఏపీ బీజేపీ నేతలు పని చేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది.
బీజేపీ లక్ష్యం వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడం కాదా ?
ఏ ఏన్నికలైనా అధికార పార్టీని కొనసాగించాలా వద్దా అనే ప్రాతిపదికన సాగుతాయి. వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి మరో చాన్స్ ఇవ్వాలా ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా అన్న దిశగా ప్రజలు తీర్పు చెబుతారు. బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందనేది ఇప్పుడు కీలకం. ఆ పార్టీ టార్గెట్ వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ఓడించడం కాకపోతే.. ఇతర పార్టీలతో కలిసే చాన్స్ ఉండదు. అదే సమయంలో తాము ఒక్కరమే కాకుండా.. జనసేన పార్టీని కూడా ఇతర పార్టీలతో కలవకుండా చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒక్క చాన్స్ నినాదానికి తాము మద్దతిస్తామని అంటున్నారు.అంటే ఎలాగైనా పవన్ ఇతర పార్టీలతో కలవకుండా చేయాలనుకుంటున్నారని ప్రస్ఫుటమవుతుంది.
వైఎస్ఆర్‌సీపీకే బీజేపీ పరోక్ష మద్దతా ?
ప్రదానమంత్రి నరేంద్రమోడీ ఏపీ పర్యటనకు వస్తే వైఎస్ఆర్‌సీపీ నేతలే బాధ్యత తీసుకున్నారు. అదేమిటని కేంద్ర బీజేపీ అడగలేదు. రాష్ట్ర బీజేపీ నేతలు పట్టించుకోలేదు. తెలంగాణలో సమయం లేకపోయినా ఎయిర్‌పోర్టులో కార్యకర్తల మీటింగ్ పెట్టి తెలంగాణ సర్కార్‌పై విరుచుకుపడిన మోదీ.. ఏపీలో మాత్రం రోడ్ షో నిర్వహించారు కానీ ఏపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోదీ పర్యటన తర్వాత బీజేపీ నేతలు మరింత దూకుడుగా.. వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ మాతోనే ఉంటాడు.. కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. కానీ జనసేన మాత్రం.. వైఎస్ఆర్‌సీపీ ముక్త ఏపీనే తమ లక్ష్యమని మరోసారి చెప్పింది.
ఏపీలో బీజేపీ ఎదగలేకపోవడానికి ప్రధాన కారణం... సొంత విధానం లేకపోవడమే. అధికార పార్టీకో.. ప్రతిపక్ష పార్టీకో మద్దతుగా ఉండే నేతలే ఎక్కువగా ఉంటారు. కంప్లీట్ బీజేపీ అన్న నేతలు ఉన్నా.. వారికి వాయిస్ తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రో వైసీపీ అని పేరున్న నేతల చేతుల్లో బీజేపీ ఉండటం వల్ల ఈ పరిస్థితి ఉందంటున్నారు. వైసీపీ కేంద్రానికి మద్దతిస్తున్నందున.. గట్టిగా ఏమీ అనలేని పరిస్థితి హైకమాండ్‌కు కూడా ఉంది.