Achennaidu : జగన్ నిద్రలో లేచి అసెంబ్లీని రద్దు చేస్తారు - ఎన్నికలకు సిద్దంగా ఉండాలని టీడీపీ కార్యకర్తలకు అచ్చెన్న పిలుపు !
ఏపీలో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని అచ్చెన్నాయుడు అంచనా వేశారు. నిద్రలో లేచి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు జగన్ లెటర్ ఇస్తారని ఆయన జోస్యం చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలపై అంతకంతకూ చర్చ పెరుగుతోంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ( TDP ) ఈ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉంది. ఎప్పుడు పార్టీ నేతలతో సమావేశం జరిపినా ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని సన్నద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) సూచిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అదే చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిద్రలో లేచి ఎప్పుడైనా అసెంబ్లీని ( AP Assembly ) రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించవచ్చని జోస్యం చెప్పారు. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉందని అనుకోవద్దని ఎప్పుడైనా వస్తాయని రెడీాగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు.
తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగు రైతు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన అచ్చెన్నాయుడు (Achennaidu ) ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీ 160 స్థానాల్లో గెలుస్తుందన్నారు. గత ఎన్నికల్లో ఉద్యోగుల ( Employees ) కారణంగానే ఓడిపోయామన్నారు. ప్రలోభాలాకో.. భయపడో ఉద్యోగులు లొంగిపోయారన్నారు. వివేకా హత్య తర్వాత వచ్చిన సానుభూతి కారణంగానే జగన్ సీఎం అయ్యారన్నారు. ఓ ప్రభుత్వంపై ప్రజల్లో ఇప్పుడున్నంత వ్యతిరేకత ఎప్పుడూ లేదని గుర్తు చేశారు.
రైతులను జగన్ ప్రభుత్వం అడుగడుగునా ముంచేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్న రైతులకు మేలు చేసే అన్ని పథకాలు నిలిపివేశారని కొత్త పథకాలేమీ అందరికీ అందడం లేదన్నారు. రాష్ట్రంలో ప్రతీ రైతునూ కలవాలని తెలుగురైతు ప్రతినిధులకు అచ్చెన్న సూచించారు. రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నారని.. రైతులకు ఉరితాళ్ళుగా మారిందన్నారు. దౌర్భాగ్య ముఖ్యమంత్రి హయాంలో రైతులకు యూరియా దొరకడం లేదని విమర్శించారు.
పోలీసులను గుప్పిట్లో పెట్టుకొని టీడీపీ నేతలపై కేసులు పెట్టారని.. మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ( Goutham Sawang ) ఖాకీ బట్టలను మరిచి పోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చెప్పిన పనులు చేసిన సవాంగ్‌ను అన్నా అంటూ సీఎం జగన్ సున్నం పెట్టారని అచ్చెన్నాయుడు సెటైర్లు పేల్చారు. ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు రావొచ్చని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి టీడీపీ నేతలు మరింతగా ఆజ్యం పోస్తున్నారు . అయితే వైఎస్ఆర్‌సీపీ నేతలు మాత్రం ముందస్తు ఎన్నికలు రావని చెబుతున్నారు.