Sanatana Dharma row: నాకు పది రూపాయల దువ్వెన చాలు: ఉదయనిధి స్టాలిన్
Sanatana Dharma row: నాకు పది రూపాయల దువ్వెన చాలు అని బెదిరింపులపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్
![Sanatana Dharma row: నాకు పది రూపాయల దువ్వెన చాలు: ఉదయనిధి స్టాలిన్ 10-Rupee Comb Enough Udayanidhi on 10-Crore Bounty On Head Sanatana Dharma row: నాకు పది రూపాయల దువ్వెన చాలు: ఉదయనిధి స్టాలిన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/04/ff39b9b261b34c990e9afe205aa0b3571693834849870360_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
తనకు ప్రాణ హాని ఉందని వస్తున్న బెదిరింపులపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. ఇలాంటి బెదిరింపులను తాను పట్టించుకోనని, తాను తమిళనాడు కోసం ప్రాణాలు ఇవ్వడానికి ముందు వరుసలో నిల్చున్న వ్యక్తి మనవడినని పేర్కొన్నారు. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం డెంగీ, మలేరియా, కరోనా లాంటిదని దానిని పూర్తిగా నిర్మూలించాలని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్‌కు చెందిన సన్యాసి ఒకరు ఉదయనిధిని చంపితే పది కోట్ల రూపాయలు ఇస్తానంటూ ప్రకటించారు. ఎవరైనా ఉదయనిధి తల నరికి తన దగ్గరికి తెస్తే రూ.10కోట్లు ఇస్తానని, ఎవ్వరికీ ఆయనను చంపే ధైర్యం లేకపోతే తానే చంపుతానని పరమహంస ఆచారన్య అనే సన్యాసి బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఈయన అయోధ్యలోని తపస్వి చావ్ని అనే ఆలయ ప్రధాన పూజారి.
కాగా ఉదయనిధి చెన్నైలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరమహంస ఆచార్య వ్యాఖ్యలపై స్పందించారు. ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినందుకు నా తల తీయడానికి పది కోట్ల రూపాయలు ఇస్తానన్నారు కానీ నా తల దువ్వుకోవడానికి పది రూపాయల దువ్వెన చాలు అంటూ వెల్లడించారు. ఆయన బెదిరింపులను అస్సలు పట్టించుకోననే దృష్టిలో మాట్లాడారు. తమిళంలో చాప్, స్లైస్ అనే పదాలకు జుట్టు దువ్వడం అనే అర్థం కూడా ఉంటుంది. ఈ భావనతో స్టాలిన్ అలా బదులిచ్చారు. ఇలాంటి బెదిరింపులు తమకు కొత్తమే కాదని, ఇలాంటి వాటికి తాము భయపడబోమని స్పష్టంచేశారు. తమిళనాడు కోసం తన తలను రైలు పట్టాలపై పెట్టిన వ్యక్తి మనవడినని చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి ప్రముఖ నేత ఎం కరుణానిధి మనవడు. అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన కరుణానిధి పెరియార్ ప్రారంభించిన హేతువాద, బ్రాహ్మణ వ్యతిరేక ద్రవిడ ఉద్యమానికి నాయకత్వం వహించారు.
కరుణానిధి రైలు పట్టాలపై పడుకున్న ఘటన 1953లో జరిగింది. సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న వ్యాపారవేత్త దాల్మియా కుటుంబం పేరుతో ఓ గ్రామం పేరు మార్చడాన్ని నిరసిస్తూ కరుణానిధి నేతృత్వంలో డీఎంకే కార్యకర్తలు రైలు పట్టాలపై పడుకుని నిరసన తెలిపారు. ఆ ఘటన గురించి ఉదయనిధి ప్రస్తావించారు.
శనివారం చెన్నైలో తమిళనాడు రచయితలు, కళాకారుల సంఘం 'సనాతన నిర్మూలన' పేరిట నిర్వహించిన కార్యక్రమానికి డీఎంకే నేత ఉదయనిధి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.. సనాతన ధర్మం మలేరియా, డెంగీ , కరోనా లాంటిదని దానిని పూర్తిగా నిర్మూలించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొన్నింటిని మనం వ్యతిరేకిస్తే సరిపోదని, పూర్తిగా రూపుమాపాలని సంచలనంగా మాట్లాడారు. సనాతన ధర్మం సమాతనత్వానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం అని, ప్రజలను కులాల పేరిట విభజించిందని పేర్కొన్నారు. మహిళలపై వివక్షను ప్రోత్సహించిందని అన్నారు. దాన్ని నిర్మూలించాల్సిందే అంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. ఆయన మాటలను బీజేపీతోపాటు విశ్వహిందూపరిషత్, పలు హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)