YSR District News: నలుగురు ఏకమయ్యారు సెలఫోన్ లారీనే కొట్టేశారు- చివరకు ఇలా దొరికారు!
YSR District News: బ్లూడార్ట్ డెలివరీ కంపెనీకి చెందిన కంటైనర్ లారీ నుంచి భారీ మొత్తంలో ఫోన్ లు, ల్యాప్ టాప్ లు దొంగిలించిన ఇద్దరు నేరస్ఖులను పోలీసులు అరెస్ట్ చేశారు.
YSR District News: ఏపీలో ఇటీవలే జరిగిన భారీ చోరీ కేసును వైఎసార్ కడప జిల్లా పోలీసులు ఛేదించారు. బ్లూడార్ట్ ద్వారా హర్యానా టూ చెన్నై కంటైనర్ లో తరలిస్తున్న ల్యాప్ టాప్ లు, సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ఇద్దరు అంతరాష్ట్ర నేరస్థులు కొట్టేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు జిల్లా ఎస్పీ కే.కే.ఎన్ అన్బురాజన్ తెలిపారు. పరారీలో ఉన్న నలుగురు నేరస్థులను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. వీరి నుంచి రూ.1.58 కోట్ల విలువైన 1557 రెడ్ మి సెల్ ఫోన్లు, 4 యాపిల్ ఐఫోన్ 14 మోడల్ సెల్ ఫోన్లు, 5 ల్యాప్ ట్యాప్ లు, 193 బ్లూ టూత్ లు, ఆడి, ఇన్నోవా కార్లను స్వాధీనం చేసుకున్నారు. బ్లూ డార్ట్ కంపెనీ ఫిర్యాదుపై గత నెల 30వ తేదీన చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే..?
ఈనెల 19వ తేదీన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులతో బ్లూడార్ట్ కంపెనీకి చెందిన ఒక కంటైనర్ లారీ నెం. HR38-Y-3224, హర్యానా రాష్ట్రంలోని బిలాస్‌పూర్ నుంచి చెన్నైకి బయలుదేరింది. సదరు లారీని జుబెర్, క్లీనర్ వాసిమ్ నడుపుతుండగా.. 23వ తేదీన బ్లూ డార్ట్ ఎక్స్ ప్రెస్ లిమిటెడ్ మేడ్చల్ కు చేరుకుంది. అక్కడ కొన్ని సరకులు తీసుకొని హైదరాబాద్ గోడౌన్ కు చేరుకుంది. అక్కడ మరికొన్ని సరకులు తీసుకొని చెన్నై వెళ్లేందుకు బయలుదేరారు.
మార్గమధ్యంలో YSR కడప జిల్లాకు చెందిన దువ్వూరు మండలం గుడిపాడు గ్రామ సమీపంలోని సర్వీస్ రోడ్డు వద్ద ముద్దాయిలు కంటైనర్ లారీని ఆపి తాళాలు పగులగొట్టి కంటైనర్‌లో ఉన్న 1,68,58,671 రూపాయల విలువ చేసే మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను దొంగలించుకు పోయారు.
హైదరాబాద్‌లోని బ్లూడార్ట్ ఎక్స్ ప్రెస్ లిమిటెడ్‌లో సీనియర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న శివ ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 30వ తేదీన చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న వైఎస్సార్ కడప జిల్లా, ఎస్పీ, కె.కె.అన్బురాజన్.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. సీసీ టీవి ఫుటేజీల ద్వారా నిందితులను గుర్తించారు.
ముద్దాయిల అరెస్టు..
ఈనెల 8వ తేదీ తెల్లవారుజామున ఈ కేసులోని ముద్దాయిల గురించి మరియు కేసులోని సొత్తు గురించి పక్కా సమాచారం రాగా.. కడప ఎస్డీపీఓ, సిబ్బందితో వాహన తనిఖీలు చేయగా నిందితులు దొరికిపోయారు. HR26-BJ-4348 నెంబరు గల ఇన్నోవా కారు, HR29-Y-0267 నెంబరు గల ఆడి కార్లలో... A5, A6 నిందితులు సొత్తును హైదరాబాద్ వైపు తీసుకుని వెళ్తున్నారు. కడప సిటీ, ఇర్కాన్ సర్కిల్ సమీపంలోని పాత టోల్ గేటు వద్ద ఈరోజు ఉదయము 11.30 గంటలకు కడప డీఎస్పీ బి.వెంకట శివారెడ్డి నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో తమ నేరాన్ని నిందితులు ఒప్పుకున్నారు.