Breaking News Live Updates: విజయనగరం జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, కత్తులతో దాడి
Breaking News Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
LIVE
![Breaking News Live Updates: విజయనగరం జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, కత్తులతో దాడి Breaking News Live Updates: విజయనగరం జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, కత్తులతో దాడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/30/c7c0f93b0556ed716512462b643e859c_original.jpg)
Background
తిరుపతి : తిరుమలలో నేడు టీటీడీ పాలక మండలి సమావేశం జరుగనుంది. స్ధానిక అన్నమయ్య భవన్ లో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన దాదాపు 64 అంశాల అజెండాతో పాటు టేబుల్ అజెండా కింద పలు అంశాలపై పాలక మండలి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇందులో ప్రధానంగా వారపు ఆర్జిత సేవలు తాత్కాలికంగా రద్దుపై పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. ఇక సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ల జారీపై చర్చ జరుగనుంది. దివ్యదర్శనం టోకెన్లు పునఃప్రారంభించేందుకు పాలక మండలి నిర్ణయం తీసుకోనుంది. వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై పాలక మండలిలో నిర్ణయం తీసుకోనున్నారు.
గరుడ వారధి, శ్రీవాణి ట్రస్టు విరాళాలతో నూతన ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయింపుపై పాలక మండలిలో చర్చ జరుగనుంది. అదే విధంగా స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సహాయకులు సౌకర్యార్ధం షెడ్ల నిర్మాణాలకు నిధులు కేటాయింపు అంశంపై నేటి పాలక మండలి సమావేశంలో చర్చ జరుగనుంది. ఎలక్ట్రిక్ బస్సు స్టేషనుతో పాటు ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనుంది. ఆప్కో మెగా షోరూం ఏర్పాటు, ఇళ్ళు, దుకాణాలు లీగల్ హైర్, కొనుగోలు చేసి వారి లైసెన్స్‌ల క్రమబద్దీకరణపై పాలక మండలిలో చర్చ జరుగనుంది..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. వడగాల్పులు అధికంగా వీస్తున్నాయని, ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలని సూచించారు. పలు చోట్ల వడగాల్పులు వీస్తుండటంతో ప్రజలు వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు లోనవుతున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో కొన్ని జిల్లాల్లో మరో 24 గంటల పాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో భగభగలు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, యానాం ప్రాంతాల్లో వేడిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. ప్రస్తుతానికి అత్యధికంగా తిరుపతి నగరంలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోగా.. తిరుపతి తర్వాత విజయవాడ కొండపల్లిలో ఉష్ణోగ్రతలు 44.8 డిగ్రీలను తాకుతోంది. మధ్యాహ్నం సమయంలో అత్యవసరమైతేనే గొడుగు వెంట తీసుకుని బయటకు వెళ్లాలని లేకపోతే వడగాల్పుల ప్రభావంతో వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. వేసవికాలంలో ప్రతిరోజూ దాదాపు 5 లీటర్ల వరకు మంచినీళ్లు తాగాలని, డీహైడ్రేషన్‌కు గురవకుండా ఉండాలంటే పండ్ల రసాలు తాగడం మంచిదని ప్రజలకు సూచించారు.
హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర (Petrol Price Today 30th April 2022) రూ.119.49 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.49 వద్ద స్థిరంగా ఉన్నాయి. గత డిసెంబర్ తొలి వారం నుంచి మార్చి మూడో వారం వరకు దేశ రాజధాని ఢిల్లీలో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. గత కొన్ని రోజులుగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.105.41, డీజిల్ ధర రూ.96.67 వద్ద స్థిరంగా ఉన్నాయి.
తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. వరంగల్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.105.02 గా ఉంది.
వరంగల్ రూరల్ జిల్లాలో 15 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.119.37 కాగా, 13 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.105.36 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) నిలకడగా ఉన్నాయి. నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.119.68 కాగా, డీజిల్ ధర రూ.105.65 అయింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 46 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.121.63 కాగా, డీజిల్‌పై 44 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.107.48కి చేరింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 33 పైసలు పెరగడంతో పెట్రోల్ (Petrol Price in Vijayawada 30th April 2022) లీటర్ ధర రూ.121.19 కాగా, 30 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.106.80 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. 81 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.120 అయింది. డీజిల్‌పై 77 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.105.65గా ఉంది.
చిత్తూరులో పెట్రోల్ పై 63 పైసలు తగ్గడంతో లీటర్ రూ.120.85 కాగా, డీజిల్‌పై 55 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.106.47 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి.
Vizinagaram Crime : విజయనగరం జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ, కత్తులతో దాడి
Vizinagaram Crime : విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరులో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కళ్లలో కారం జల్లి కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందారు. నలుగురికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన వ్యక్తి గేదెల గణేష్ గా గుర్తించారు. తీవ్ర గాయాలైన పద్మ , గీతలను గజపతినగరం సీహెచ్ సీకి తరలించారు.
Rahul Gandhi OU Meeting : రాహుల్ గాంధీకి షాక్, ఓయూలో సభకు నో పర్మిషన్
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. రాహుల్ గాంధీ సభకు అనుమతి ఇవ్వకూడదని ఓయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రాహుల్ గాంధీ సభతో పాటు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని కౌన్సిల్ నిర్ణయించింది. అంతేకాదు.. క్యాంపస్‌లోకి కెమెరాలను నిషేధిస్తూ శనివారం ఉదయం కౌన్సిల్ కీలక ప్రకటన చేసింది.
Chandrababu Tweet: సీఎం జగన్ నివసించే తాడేపల్లిలో అరాచకాలంటూ చంద్రబాబు ఆగ్రహం
Chandrababu Tweet: సీఎం వైఎస్ జగన్ నివశించే తాడేపల్లిలో అరాచకాలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు వివాదంలో వేలు పెట్టి... వృద్ధుడు, మహిళలపై దాడి చేస్తున్నారని, అధికార మదం తో పెట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా జగన్ అని ట్విట్టర్ వేదికగా చంద్రబాబు ప్రశ్నించారు.
Telangana IT Minister కేటీఆర్ వ్యాఖ్యలతో ఏపీ ప్రభుత్వం పరువు పోయింది: టీడీపీ నేత శ్రీనివాసులు రెడ్డి
Telangana IT Minister తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల ఏపీ ప్రభుత్వం పరువు పోయిందని, రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉన్న మాట పక్క రాష్ట్రాలకు కూడా తెలిసిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. కడప నగరంలోని గాయత్రి టవర్స్ లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితి గురించి మాట్లాడిన తెలంగాణ మంత్రి కేటీఆర్ కు సమాధానం చెప్పలేక డొంక తిరుగుడు మాటలు ఏపీ మంత్రులు మాట్లాడుతున్నారన్నారు. ఏపీలోలో అభివృద్ధి మాట అటుంచితే సీఎం జగన్ బాబాయి వివేకా హత్య కేసులో ఇప్పటి వరకు పురోగతి లేదన్నారు. రాష్ట్ర మంత్రులు సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి ఏంటో పక్క రాష్ట్రాలకు కూడా తెలిసిందని ఎద్దేవా చేశారు.
Conference of Chief Justices: ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో న్యాయమూర్తుల సదస్సు ప్రారంభం
Conference of Chief Justices: ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో ప్రారంభమైన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, రాష్ట్ర ముఖ్యమంత్రుల ఉమ్మడి సదస్సు. సదస్సును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ.
హాజరైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, తెలంగాణ రాష్ట్రం నుంచి హాజరైన న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)