Wrestlers Protest: ఆరోపణలు నిజమైతే ఉరేసుకుంటా, ఇదంతా ఓ ఎమోషనల్ డ్రామా - బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు
Wrestlers Protest: తనపై వస్తున్న ఆరోపణల్లో నిజముంటే ఉరేసుకుని చనిపోతానని బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
![Wrestlers Protest: ఆరోపణలు నిజమైతే ఉరేసుకుంటా, ఇదంతా ఓ ఎమోషనల్ డ్రామా - బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు Wrestlers Protest Wrestling Federation WFI Chief Brij Bhushan Says No Evidence Against him Wrestlers Protest: ఆరోపణలు నిజమైతే ఉరేసుకుంటా, ఇదంతా ఓ ఎమోషనల్ డ్రామా - బ్రిజ్ భూషణ్ సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/05/31/c7bee331e4e83b06fc7388bddcbf8f141685524731671517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Wrestler's Protest:
బ్రిజ్ భూషణ్ వాదనేంటి..?
రెజ్లర్లు తనపై చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిజమైనా ఉరి వేసుకుంటానని సంచలన ప్రకటన చేశారు బ్రిజ్ భూషణ్. వాళ్ల వద్ద ఎలాంటి ఆధారాలున్నా కోర్టులో సమర్పించాలని ఛాలెంజ్ చేశారు. అప్పుడు ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉంటానని తేల్చి చెప్పారు.
"ఆరోపణలు నిజం అని తేలితే నేనే ఉరి వేసుకుని చనిపోతాను. ఆధారాలుంటే కోర్టులో సమర్పించండి. దాదాపు నాలుగు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. నన్ను ఉరి తీయలేదని వాళ్లు పతకాలను గంగలో పారేయాలని చూశారు. మీరు మెడల్స్‌ని పారేసినంత మాత్రాన కోర్టు నన్ను ఉరి తీయదు. ఇదంతా కేవలం ఓ ఎమోషనల్ డ్రామా"
- బ్రిజ్ భూషణ్ సింగ్, WFI చీఫ్
మహా పంచాయత్‌కి పిలుపు
రెజ్లర్ల ఆందోళనలకు క్రమంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ సహా కీలక పార్టీలు వాళ్లకు అండగా నిలుస్తున్నాయి. రైతు సంఘాలూ మద్దతునిస్తున్నాయి. బ్రిజ్ భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ రెజ్లర్లు హరిద్వార్‌కు వెళ్లి గంగలో పతకాలు పారేయాలని నిర్ణయం తీసుకోవడమూ సంచలనమైంది. ఆ సమయంలోనే Bharatiya Kisan Union నేత నరేష్ టికాయత్ రెజ్లర్లను నిలువరించారు. ఆ పతకాలు నీళ్లలో పారేయకుండా అడ్డుకుని...5 రోజుల పాటు వేచి చూద్దాం అని సూచించారు. ఈ క్రమంలోనే తదుపరి కార్యాచరణ ఏంటో వెల్లడించారు. సోరమ్ గ్రామంలోని ముజఫర్‌నగర్‌లో మహాపంచాయత్ నిర్వహించాలని పిలుపునిచ్చారు. రేపు (జూన్ 1వ తేదీ) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఆందోళనలకు సంబంధించిన అంశాలు చర్చించేందుకు ఈ మహాపంచాయత్ నిర్వహించనున్నారు. పలు పంచాయతీల ప్రతినిధులతో పాటు యూపీ, హరియాణా, పంజాబ్, రాజస్థాన్‌కు చెందిన కీలక నేతలు హాజరు కానున్నారు. నిరసన కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఈ భేటీలోనే డిసైడ్ చేయనున్నారు. దాదాపు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు చేస్తున్నప్పటికీ...కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి భరోసా ఇవ్వలేదని మండి పడుతున్నారు రెజ్లర్లు.
ఎందురు అరెస్ట్ చేయలేదు..?
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాత్రం ఈ వివాదంపై స్పందించారు. కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ అంశం సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. కేసులు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆ తరవాత బ్రిజ్ భూషణ్‌పై రెండు FIRలు నమోదయ్యాయి. అయితే...కేసులు నమోదు చేయడంతో పాటు WFI చీఫ్ పదవి నుంచి ఆయనను తొలగించాలనీ డిమాండ్ చేస్తున్నారు రెజ్లర్లు. దీనిపైనే వివాదం ముదురుతోంది. రాజీనామా చేసేందుకు ఏ మాత్రం అంగీకరించడం లేదు బ్రిజ్ భూషణ్. అటు పోలీసులపైనా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కేసులు నమోదు చేసి...ఆయనను అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారన్న ప్రశ్నిస్తున్నారు రెజ్లర్లు. దీనికి పోలీసులు వివరణ ఇస్తున్నారు. లైంగిక ఆరోపణలు చేసినట్టు ఇప్పటి వరకూ ఎలాంటి ఆధారాలు లభించలేదని, అందుకే అరెస్ట్ చేయలేదని తేల్చి చెబుతున్నారు. మరో 15 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిపి కోర్టుకి ఓ నివేదిక సమర్పిస్తామని వెల్లడించారు. సాక్ష్యాధారాల కోసం పలు డాక్యుమెంట్‌లు పరిశీలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక్కడ మరో వాదన కూడా ఉంది. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక ఆరోపణలు చేసిన వారిలో ఓ మైనర్ కూడా ఉంది. అందుకే...పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే...ఆ అమ్మాయి మైనర్ కాదని ఇటీవల ఓ వ్యక్తి పోలీసులకు ఆధారాలు ఇచ్చాడు. ఆ అమ్మాయి మైనర్ కాదు అని నిరూపించే కీలక వివరాలు బయటకు వచ్చాయి. దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాలి మలివాల్ మండి పడ్డారు. మైనర్ వివరాలు బయటకు ఎలా వచ్చాయంటూ డీసీపీకీ నోటీసులిచ్చారు.
Also Read: BJP on Rahul Gandhi: రాహుల్ ఇంకా మారలేదు, మోదీ పాపులారిటీ చూసి తట్టుకోలేకపోతున్నారు - బీజేపీ కౌంటర్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)