Kavitha Son Aditya Political Entry: బీసీల కోసం రోడ్లపై ధర్నా చేసిన కవిత కుమారుడు ఆదిత్య- రాజకీయాల్లోకి వచ్చేస్తున్నట్టేనా?
Kavitha Son Aditya Political Entry: బీసీల రిజర్వేషన్ కోసం జరుగుతున్న బంద్‌లో కవిత కుమారుడు ఆదిత్య రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆయన రాజకీయ రంగప్రవేశానికి ప్లాన్ రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది.

Kavitha Son Aditya Political Entry: తెలంగాణలో బీసీల రిజర్వేషన్ల కోసం ఉద్యమం కొనసాగుతోంది. 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఆందోళన చేపట్టాయి. శనివారం నిర్వహించిన బంద్‌కు అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. అన్నీ పార్టీలు మద్దతు ప్రకటించడంతో బంద్ విజయవంతమైంది. అందరు నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. చిత్తశుద్ధితో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓ కుర్రాడు అందర్నీ ఆకట్టుకున్నాడు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు పోరాడతాం అంటూ ప్లకార్డు చేతపట్టి రోడ్లపైకి వచ్చాడు. ఆయనే కవిత పెద్ద కుమారుడు ఆదిత్య. వయసు 23 ఏళ్లు.

కవిత కుమారుడిని రోడ్డుపై ధర్నాలో చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు చదువుల్లో బిజిగా ఉన్న ఆదిత్య ఒక్కసారిగా ఆందోళనలో చూసిన వారంతా షాక్ అయ్యారు. కవితక్క వారసుడు వచ్చేశాడని అంటున్నారు. కేటీఆర్‌కు పోటీ ఇచ్చేందుకు ప్లాన్‌గానే ఆదిత్యను కీలకమైన సమయంలో కవిత తీసుకొచ్చారనే చర్చ సాగుతోంది. బీసీ సంఘాల బంద్‌లో ఆదిత్య పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. కవిత ప్లాన్ ఏంటో కూడా చర్చించుకుంటున్నారు.
బీఆర్‌ఎస్‌తో విభేదించిన కవిత జాగృతి పేరుతో ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత తన రాజకీయ ప్రయాణం గురించి స్పష్టత ఇవ్వడం లేదు. కానీ ప్రజల్లో ఉండేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ ప్రజల మన్ననలు పొందే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఆమె అడుగులు పార్టీ పెట్టేలా ఉన్నాయంటూ విశ్లేషణలు వినిపిస్తున్నా అలాంటి ప్రకటన ఏది కూడా ఆమె నుంచి రాలేదు. ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ చాలా కాలమైంది. కానీ ఇంత వరకు దీనిపై స్పష్టత ఇవ్వలేదు.

ప్రజల తరఫున పోరాటం చేసేందుకే తాను ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. అలాగని బీఆర్‌ఎస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం కూడా చేయడం లేదు. దీంతో ఆమె ప్రయాణం ఎటు సాగుతుందని అంతా ఆలోచిస్తున్న టైంలో బీసీ సంఘాల బంద్ సందర్భంగా ఓ హింట్ ఇచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆదిత్యను బంద్‌లోకి తీసుకురావడంతో ఆమె ప్లాన్ ఏంటో స్పష్టమవుతుందని తెలుస్తోంది. కచ్చితంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్టు సమాచారం. అందుకు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారట. అంతకంటే ముందు తన రాజకీయ వారసుడిగా ఆదిత్యను తీసుకొచ్చారని ఇదే ఆమె భవిష్యత్ రాజకీయాలపై ఇచ్చిన సంకేతమని విశ్లేషిస్తున్నారు.

కేసీఆర్ తర్వాత బీఆర్‌ఎస్‌లో ఎవరి నాయకత్వాన్ని సహించేది లేదని చెప్పిన కవిత, పార్టీలో ఉంటూనే హరీష్, సంతోష్ లాంటి వాళ్లపై ఘాటు విమర్శలు చేశారు. పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. బహిరంగా వేదికలపై కవిత చేస్తున్న విమర్శలతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ పెట్టాలనే ఆలోచనతో ఆమె సొంత పార్టీలోనే రెబల్‌గా మారారని అనుకున్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అలాంటి ప్రకటన చేయలేదు. కానీ భవిష్యత్ వ్యూహాలపై హింట్‌లు ఇస్తూ వస్తున్నారు.






















