కూల్‌డ్రింక్స్ కంపెనీలకు షాక్ ఇవ్వబోతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ- సెలబ్రిటీలకు బదులు ముకేష్ కనిపిస్తాడేమో!
WHO Report: కూల్ డ్రింక్స్ కంపెనీలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. కూల్ డ్రింకులపై ఇది క్యాన్సర్‌కు కారణమని ముద్రించాలన్న ఆదేశాన్ని ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
WHO Report: పొగాకు క్యాన్సర్ కు కారకం, గుట్కా, కైనీ, జర్దా, పాన్ మాసాలా వీటితో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయా ప్యాకెట్లపై రాసి ఉండటం చాలా మంది గమనించే ఉంటారు. సిగరెట్ ప్యాకెట్లపై 'వార్నింగ్.. స్మోకింగ్ కాజెస్ థ్రోట్ క్యాన్సర్' అని పెద్ద సైజు అక్షరాలతో రాసి ఉంటుంది. చాలా కాలంగా కూల్ డ్రింక్స్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి. అందులో వాడే రసాయనాలు, కృత్రిమ స్వీటెనర్లు క్యాన్సర్ కారకాలుగా వైద్యులు చెబుతుంటారు. ఇక మీదట కూల్ డ్రింక్స్ సీసాలపై, టిన్నులపై ఇది క్యాన్సర్ కు కారకం అని ముద్రించేలా ఆయా సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాన్సర్ కు కారణమయ్యే అస్పర్టమే అనే కృత్రియ స్వీటెనర్లు ఉండే కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్న కంపెనీలకు వచ్చే నెలలో ఈ మేరకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ మేరకు సర్వే చేసిన రిపోర్టు ఆధారంగా డబ్ల్యూహెచ్‌వో చర్యలు తీసుకోనుందని తెలుస్తోంది. దీంతో కూల్ డ్రింక్ కంపెనీలు ఆందోళనకు గురవుతున్నాయి.
ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ -IARC జులైలో క్యాన్సర్ కారకాల జాబితాలో కూల్ డ్రింక్స్ ను కూడా చేర్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో ఇప్పటికే సమావేశం కాగా.. ఆ నిర్ణయాలను జులై 14వ తేదీన ప్రకటించనున్నట్లు సమాచారం. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి హానికరమని వైద్యులు ఎప్పుడూ చెప్పే మాట. అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.
క్యాన్సర్ వచ్చే అవకాశం 87 శాతం ఎక్కువ
కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వారానికి 2 లేదా అంతకంటే ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగే వ్యక్తుల్లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం 87 శాతం ఎక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే మెనోపాజ్ మహిళల్లో శీతల పానీయాలు గర్భాశయ క్యానస్ర్ కు కారణం అవుతున్నట్లు ఓ అధ్యయనం తేల్చింది. ఫ్రూట్ ఫ్లేవర్డ్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగటం వల్ల పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
Also Read: Viral Video: బైక్‌తో స్టంట్స్ చేస్తూ బొక్కబొర్లా పడ్డ జంట, దిల్లీ పోలీసుల క్రేజీ పోస్టు వైరల్
క్యాన్సర్‌తో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యలు
కూల్ డ్రింక్స్ తాగడం చాలా ప్రమాదకరమని వైద్యులు ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నారు. కార్బొనేటెడ్ వాటర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తుంటారు. కూల్ డ్రింక్స్ తీయగా ఉండేందు కృత్రిమ చక్కెరలు కలుపుతారు. ప్రిజర్వేటివ్స్, కలర్స్, రసాయనాలు కూల్ డ్రింక్స్ లో ఉంటాయి. కూల్ డ్రింక్స్ లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల ఊబకాయం సమస్య తలెత్తుతుంది. చిన్న పిల్లల్లో ప్రీమెచ్యూర్ హార్ట్, బీపీ, డయాబెటిస్, థైరాయిడ్, హార్మోన్ల సమస్యలు, కాలేయం వాపు ఇలా చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial