గాజాలో శిథిలాల కింద నలిగిపోయిన మహిళ, చేయి ఊపుతూ సాయం కోసం అభ్యర్థన - గుండెని మెలిపెట్టే దృశ్యాలు
Viral Video: గాజాలో ఓ మహిళ శిథిలాల కింద నలిగిపోతూ సాయం కోసం అభ్యర్థించిన వీడియో వైరల్ అవుతోంది.
Viral Video:
గాజాలో పౌరుల పరుగులు..
ఇజ్రాయేల్ పాలస్తీనా మధ్య యుద్ధం (Israel Palestine War) కారణంగా వేలాది మంది పౌరులు నలిగిపోతున్నారు. ఆ రెండు దేశాల పంతం వీళ్ల ప్రాణాల మీదకు తెచ్చింది. కళ్లు మూసి తెరిచేలోగా బిల్డింగ్‌లన్నీ నేలమట్టం అవుతున్నాయి. ఎక్కడో ఓ చోట కాస్త నీడ దొరికిందని తల దాచుకునే లోగా పై నుంచి రాకెట్‌లు దూసుకొచ్చి దాడులు చేస్తున్నాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా గాజా వద్ద పౌరుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎటు చూసినా శిథిలాల దిబ్బలే, శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. వీటిని చూసి మరింత జడిసిపోతున్నారు గాజా పౌరులు. సహాయం కోసం అర్థిస్తున్నారు. అక్కడి దృశ్యాలు ప్రపంచాన్నే కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న ఓ మహిళ తనను కాపాడాలంటూ వేడుకుంది. శరీరం అంతా శిథిలాల్లోనే చిక్కుకుంది. కేవలం చేయి మాత్రమే బయటకు కనిపిస్తోంది. ఆ చేతినే ఊపుతూ సాయం చేయాలని అభ్యర్థించింది. ఆమె ఒక్కరే కాదు. అక్కడి పౌరులందరిదీ ఇదే ఘోష. ఆమె ఎంతగా వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. చుట్టు పక్కల ఆంబులెన్స్‌లు లేవు. కాపాడటానికి వీల్లేకుండా పోయింది. అంత పెద్ద శిథిలాల్ని తొలగించి కాపాడడం స్థానికులకూ సవాలుగా మారింది. వాటిని తొలగించేందుకు అవసరమైన ఎక్విప్‌మెంట్ కూడా వాళ్ల దగ్గర ఉండడం లేదు. హమాస్ ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న అనుమానం వచ్చిన ప్రతి చోటా ఇజ్రాయేల్ రాకెట్‌లతో విధ్వంసం సృష్టిస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదులు చనిపోతున్నారో లేదో కానీ...సామాన్యులు మాత్రం ఇలా నలిగిపోతున్నారు.
People are attempting to rescue survivors from under the rubble with their own hands. Literally. No ambulances. No firefighters. No equipment. This woman kept moving her hand so someone would spot her. This is happening across Gaza. pic.twitter.com/SF9exhEd6A
— Nour Odeh 🇵🇸 #NojusticeNopeace (@nour_odeh) October 12, 2023
హమాస్ ఉగ్రవాదులు గాజాలో దాదాపు 150 పౌరులని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను విడిచిపెట్టేంత వరకూ దాడులు కొనసాగుతాయని ఇజ్రాయేల్ సైన్యం స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మరో ప్రకటన కూడా చేసింది. నార్త్ గాజాలోని ప్రజలకు కీలక సూచనలు చేసింది. నార్త్ గాజాలోని 10 లక్షల మంది పౌరులు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేయాలని చెప్పింది. 24 గంటల్లోగా అంతా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. గాజా మొత్తం జనాభాలో సగం ఈ నార్త్ గాజాలోనే ఉంటున్నారు. ఈ ప్రకటన ఇప్పటికే వివాదాస్పదమైంది. ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలంటే వాళ్లు ఎక్కడికి పోతారని ప్రశ్నిస్తున్నాయి మానవ హక్కుల సంఘం. ఐక్యరాజ్య సమితి కూడా తీవ్రంగానే స్పందించింది. ఈ ఆదేశాలు పాటించడం అసాధ్యం అని తేల్చి చెప్పింది. తీవ్ర పరిణామాలను తప్పించాలంటే ఈ ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని స్పష్టం చేసింది.
Also Read: ఇజ్రాయేల్ చేసిన ఖర్చంతా బూడిద పాలేనా? యాంటీ డ్రోన్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అయింది?