న్యూడ్ ఫోటోల కోసం టీనేజ్ బాలికపై ఒత్తిడి, ఒప్పుకోనందుకు పోలీసుల్నే హడలెత్తించాడు!
స్కూల్లో చదువుకునే టీనేజ్ బాలికలను న్యూడ్ ఫోటోలు తనకు పంపాలని నిందితుడు ఎడ్డీ కోరినట్లుగా పోలీసులు తెలిపారు.
పెరు దేశానికి చెందిన ఓ వ్యక్తి తాను అడిగిన ఫోటోలు పంపలేదనే అక్కసుతో ఒక శాడిస్ట్ లా ప్రవర్తించాడు. ఏకంగా అమెరికాలో దాదాపు 150 చోట్ల బాంబులు పెట్టినట్లుగా తప్పుడు సమాచారం అందించి అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టించినట్లుగా అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. నిందితుడిని ఎడ్డీ మాన్యుయేల్ న్యూనేజ్ శాంటోస్ అనే 33 ఏళ్ల వ్యక్తిగా గుర్తించినట్లుగా చెప్పారు. ఇతను ఒక వెబ్ సైట్ డెవలపర్ అని చెప్పారు. అతను పెరు దేశంలో లిమా అనే ప్రాంతంలో ఉండగానే అదుపులోకి తీసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.
స్కూల్లో చదువుకునే టీనేజ్ బాలికలను న్యూడ్ ఫోటోలు తనకు పంపాలని నిందితుడు ఎడ్డీ కోరినట్లుగా పోలీసులు తెలిపారు. పిల్లలు అందుకు ఒప్పుకోకపోవడం వల్ల ఎడ్డీ వారిపై కోపాన్ని ఇలా తీర్చుకున్నాడని తెలిపారు. సెప్టెంబరు నెల మొదట్లో నిందితుడు పోలీసులకు ఫోన్లు చేసి 150 జనసంచార ప్రాంతాల్లో బాంబులు ఉన్నట్లుగా చెప్పాడు. అధికారులను భయభ్రాంతులకు గురి చేశారు.
టీనేజ్ అమ్మాయిలతో ఓ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫాం ద్వారా తాను కూడా టీనేజ్ అబ్బాయినే అని పరిచయం చేసుకున్నాడు. న్యూడ్ ఫోటోలు పంపాలని వారిని కోరేవాడు. ఆ బాలికలు ఫోటోలు పంపడం నిరాకరించేసరికి మీ స్కూల్లో బాంబులు పెడతానని, అవి పేలి చనిపోతావని బెదిరించేవాడు.
ఈ బెదిరింపు ఫోన్ కాల్స్‌తో బాధితులు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని సంప్రదించారు. నిందితుడు ఇలాగే న్యూయార్క్, పెన్సిల్వేనియా, కనెక్టికట్, ఆరిజోనా, అలస్కా లాంటి ప్రదేశాల్లో బాంబులు పెట్టినట్లుగా బెదిరించాడు. సదరు స్కూళ్లకి మెయిల్స్ చేయడం లాంటివి చేశాడు. రెండు రోజులకి అదికాస్తా 20 వేరు వేరు స్కూళ్లలో దాదాపు 1,100 మంది విద్యార్థులను మరోచోటికి తరలించేవరకూ వ్యవహారం వెళ్లింది. ఆఖరికి నిందితుడు ఎయిర్ పోర్టులు, హాస్పిటళ్లు, షాపింగ్ మాళ్లని టార్గెట్ చేస్తూ బెదిరింపులు చేశాడు. దీనివల్ల స్కూళ్లు మూసేయడం, ఫ్లైట్లు డిలే అవ్వడం లాంటివి జరిగాయి.
పరిస్థితి చేయిదాటిపోవడం, అటు బాధితుల నుంచి పదే పదే ఇలాంటి ఫిర్యాదులు వస్తుండడం వల్ల దీనిపై ఫోకస్ పెట్టిన ఎఫ్‌బీఐ అధికారులు దర్యాప్తు చేపట్టి నిందితుణ్ని పట్టుకున్నారు. దర్యాప్తు అధికారులు ఈ మెయిల్స్, ఫోన్ నెంబర్స్ వివరాల ఆధారంగా ఐపీ అడ్రస్‌ని సేకరించడం ద్వారా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పట్టుబడ్డ నిందితుడిపై పోలీసులు సంబంధిత నేరారోపణల కింద కేసు నమోదు చేశారు.